NALSAR CJI : హైదరాబాద్​ నల్సార్ వ్యవహారం.. బార్ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా​ ఆదేశాలపై సీజేఐ సీరియస్!

CJI NALSAR : హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థుల నిరసనలపై కౌన్సిల్ జోక్యాన్ని ఆయన ఖండించారు. ‘బ్యాక్​ ఆఫ్​’ అంటూ వ్యాఖ్యానించారు.

Published on: Aug 14, 2026, 11:33:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్​లోని ప్రతిష్ఠాత్మక నల్సార్ యూనివర్సిటీ వ్యవహారంలో బార్​ కౌన్సిల్ ఆఫ్​ ఇండియా (బీసీఐ) వ్యవహరించిన తీరుపై భారత దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. "బ్యాక్ ఆఫ్" అంటూ గట్టి సందేశాన్ని బీసీఐకి ఇచ్చారు.

భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా..
భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా..

అసలేం జరిగింది?

ఈ ఏడాది నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మిశ్ర హాజరు కావాల్సి ఉంది. అయితే యువతను 'కాక్రోచ్'లు అన్నారని, ఆయన తమ వర్సిటీకి రాకూడదని అనేక మంది లా స్టూడెంట్స్ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే వర్సిటీ స్నాతకోత్సవంలో చీఫ్ జస్టిస్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రచారంపై విచారణ జరగాలని, అప్పటివరకు నల్సార్ గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని బీసీఐ తొలుత ఉత్తర్వుల్లో పేర్కొంది.

“ఈ నిరసన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? నిర్వహించారు? లేదా సమీకరించారు? అనేదానిపై వైస్ ఛాన్సలర్ నుంచి వాస్తవ నివేదికను సమర్పించాలి. విచారణ పూర్తయ్యే వరకు 2026 గ్రాడ్యుయేట్లను ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్‌రోల్ చేయకూడదు,” అని సదరు ఉత్తర్వుల్లో ఉంది.

ఈ వ్యవహారంపై అనేక వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ వార్త సోషల్​ మీడియాలో వెంటనే వైరల్ అయ్యింది.

కాగా కొన్ని గంటల వ్యవధిలోనే బీసీఐ ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. 2026 నల్సార్ గ్రాడ్యుయేట్లలో అత్యధికులు నిర్దోషులని, చీఫ్ జస్టిస్‌ను అగౌరవపరిచే ఎలాంటి చర్యల్లోనూ వారు పాల్గొనలేదని తమ తాజా సమాచారం ద్వారా తేలిందని బీసీఐ వెల్లడించింది.

సీజేఐ సూర్యకాంత్ స్పందన ఇలా..

"ఇది అసలు సమంజసం కాదు. నేనే ఒకప్పుడు చదువుకునే రోజుల్లో యాక్టివ్‌గా నిరసనల్లో పాల్గొన్నాను. ఇది నాకూ విద్యార్థులకూ మధ్య జరిగాల్సిన సంభాషణ. ఇందులో జోక్యం చేసుకోవడానికి వాళ్లు (బీసీఐ) ఎవరు?" అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా స్పష్టం చేశారు.

నల్సార్ విద్యార్థులు లేదా ఫ్యాకల్టీ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. బీసీఐ జారీ చేసిన సర్క్యులర్లపై వివరణ కోరింది.

అంతకుముందు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్​సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్ సింగ్ బీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని "ఏకపక్షం, చట్టవిరుద్ధం మరియు అసమంజసం" అని తీవ్రంగా విమర్శించారు.

ఆగస్టు 13న బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు రాసిన లేఖలో వికాస్ సింగ్ ఈ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్న లా విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నమే ఈ సమగ్ర ఆంక్షలని ఆయన పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛా ఆలోచనలకు, చర్చలకు వేదికలుగా ఉండాలని ఎస్‌సీబీఏ చీఫ్ తెలిపారు. కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిపై అసమ్మతి తెలిపినంత మాత్రాన విద్యార్థులను న్యాయ వృత్తిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.

"రాజ్యాంగబద్ధమైన అధికారి పట్ల తమ అసమ్మతిని వ్యక్తం చేసినందుకు విద్యార్థులకు న్యాయ వృత్తిలోకి ప్రవేశించే హక్కును నిరాకరిస్తామని బెదిరించలేరు," అని సీనియర్ లాయర్ వికాస్ సింగ్ వెల్లడించారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More