భారత దేశ 53వ సీజేఐగా జస్టిస్​ సూర్యకాంత్​ ప్రమాణం..

జస్టిస్​ సూర్యకాంత్​ భారత దేశ 53వ సీజేఐగా ప్రమాణం చేశారు. ఒక చిన్న న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి, దేశంలోనే అత్యున్నత న్యాయ పదవికి చేరుకున్నారు.

Published on: Nov 24, 2025, 10:18:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ సూర్యకాంత్. ఆదివారం సాయంత్రం పదవీ విరమణ చేసిన జస్టిస్ బీఆర్ గవాయి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

53వ సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్​ (PTI)
53వ సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్​ (PTI)

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సుప్రీంకోర్టులో తన పదవీకాలంలో, జస్టిస్ సూర్యకాంత్ పలు కీలకమైన రాజ్యాంగపరమైన తీర్పులతో సంబంధం కలిగి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, బీహార్ ఓటర్ల జాబితా సవరణ, పెగాసస్ స్పైవేర్ కేసు వంటి ముఖ్యమైన తీర్పుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ(ఎస్​ఐఆర్​) చేయాలనే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ప్రశ్నించిన పిటిషన్లను విచారించే సమయంలో, జాబితా నుంచి తప్పిపోయిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను అందించాలని జస్టిస్ సూర్యకాంత్ ఈసీని ఆదేశించారు.

రక్షణ దళాలకు సంబంధించిన వన్ ర్యాంక్-వన్ పెన్షన్ పథకాన్ని రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా ధృవీకరించి, ఆ తీర్పును సమర్థించారు జస్టిస్ సూర్యకాంత్.

1967 అలిగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయం తీర్పును తోసిపుచ్చిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. ఈ తీర్పు ఆ సంస్థ మైనారిటీ హోదాను పునఃపరిశీలించడానికి మార్గం సుగమం చేసింది.

అక్రమంగా పదవి కోల్పోయిన ఒక మహిళా సర్పంచ్‌ను తిరిగి నియమించిన ధర్మాసనానికి ఆయన నాయకత్వం వహించారు. ఈ కేసులో చూపిన లింగ వివక్షను ఆయన తీవ్రంగా ఖండించారు.

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్‌లలోని మూడింట ఒక వంతు సీట్లను మహిళల కోసం కేటాయించాలని ఆదేశించిన ఘనత కూడా జస్టిస్ సూర్యకాంత్‌కు దక్కింది!

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై ఇటీవల వచ్చిన రాజ్యాంగ పరమైన రిఫరెన్స్‌లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అలాగే, వలస పాలన నాటి రాజద్రోహం చట్టాన్ని నిలిపివేస్తూ, ప్రభుత్వం సమీక్ష పూర్తయ్యే వరకు దాని కింద కొత్త కేసులు నమోదు చేయరాదని ఆదేశించిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు.

జస్టిస్ సూర్యకాంత్ నేపథ్యం

జస్టిస్ సూర్యకాంత్ హరియాణాలోని హిసార్ జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఫిబ్రవరి 10, 1962న జన్మించారు. ఒక చిన్న న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి, దేశంలోనే అత్యున్నత న్యాయ పదవికి చేరుకున్నారు.

2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్​. ఆ సమయంలో ఆయన "ఫస్ట్ క్లాస్ ఫస్ట్"గా ఉత్తీర్ణులయ్యారు.

జస్టిస్ సూర్యకాంత్​కి ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉంది.

అంతకుముందు, ఆయన పంజాబ్, హరియాణా హైకోర్టులో అనేక ముఖ్యమైన తీర్పులు రాశారు.

నూతనంగా నియమితులైన సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్​.. ఫిబ్రవరి 9, 2027న ఆయనకు 65 ఏళ్లు నిండే వరకు, అంటే సుమారు 15 నెలల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

కొత్త సీజేఐ ప్రధాన లక్ష్యాలు

తన పదవీకాలంలో అత్యంత ముఖ్యమైన అంశాలుగా న్యాయవ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం, వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తానని సీజేఐగా బాధ్యతలు చెప్పట్టేందుకు కొన్ని రోజుల ముందు జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.

"నా మొదటి, ముఖ్యమైన సవాలు పెండింగ్‌లో ఉన్న కేసుల భారం! నేటి స్కోర్‌బోర్డ్ ప్రకారం, సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు 90,000 మార్కును దాటాయి. ఇది ఎలా జరిగింది? ఎవరు బాధ్యత వహిస్తారు? అనే దాని గురించి నేను మాట్లాడటం లేదు. బహుశా కేసుల జాబితా పెరిగి ఉండవచ్చు," అని ఆయన పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.

"రెండొవ సమస్య మధ్యవర్తిత్వం. వివాద పరిష్కారంలో ఇది సులభమైన మార్గాలలో ఒకటి. ఇది నిజంగా మార్పు తీసుకురాగలదు," అని ఆయన నొక్కి చెప్పారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More