Crime news : కీలేడీ.. భర్తని వదిలి అతని అన్నతో పెళ్లి- ఆ తర్వాత పొరుగింటి ప్రేమికుడితో కలిసి ‘హత్య’!

గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో కొద్ది నెలల క్రితం కాల్వలో లభ్యమైన మృతదేహం ఉదంతం.. ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని తేలింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో.. ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపిన ఓ కీలాడీ భార్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Published on: May 19, 2026, 13:59:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Woman kills husband : గుజరాత్‌లో నెలల క్రితం జరిగి.. ఒక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా గుర్తిచిన ఒక కేసును అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ చాకచక్యంగా ఛేదించింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్, గ్రౌండ్ వర్క్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక ఘోరమైన హత్య ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చారు.

గుజరాత్​లో దారుణం! భర్తను చంపిన భార్య.. పక్కా స్కెచ్​తో!
గుజరాత్​లో దారుణం! భర్తను చంపిన భార్య.. పక్కా స్కెచ్​తో!

సురేంద్రనగర్ జిల్లా ద్రాంగధ్ర తాలూకా సోల్డి గ్రామానికి చెందిన శాంతిగిరి విష్ణుగిరి గోస్వామి అనే లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత స్థానిక కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దానిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేశారు. అయితే, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి లోతుగా విచారించడంతో ఇదొక పక్కా స్కెచ్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది.

అక్రమ సంబంధాల అల్లిక..

ఈ కేసు నేపథ్యం చూస్తే తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిందితురాలు జగృతి గోస్వామికి మొదట సుఖ్‌దేవ్‌గిరి గోస్వామితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆమె తన భర్త పెద్దన్నశాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. దీనితో మొదటి భర్తను, పిల్లలను వదిలేసి అతనితో కలిసి పారిపోయింది.

ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని మరో గ్రామంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. శాంతిగిరి ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో వారాల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో.. వారి పక్కింట్లో అద్దెకు దిగిన కాంతిలాల్ అలియాస్ భరత్‌భాయ్ లాల్జీభాయ్ సబరియాతో జగృతికి పరిచయం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య నిత్యం జరిగే గొడవలను ఆసరాగా చేసుకుని కాంతిలాల్, జగృతితో అక్రమ సంబంధం మొదలుపెట్టాడు.

రూ. 25 వేల సుపారీ.. కాంట్రాక్ట్ కిల్లర్ మోసం..

శాంతిగిరిని ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన ఈ జంట.. మొదట యూనస్ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌కు రూ. 25,000 సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. ఒక రాత్రి శాంతిగిరిని చంపడానికి యూనస్ ఇంట్లోకి ప్రవేశించాడు. కానీ నిద్రిస్తున్న శాంతిగిరిని చూడగానే అతనికి భయం వేసింది. దానితో అతను శాంతిగిరిని చంపకుండా, నిద్రిస్తున్న ఫోటోను తన మొబైల్‌లో తీసుకుని జగృతికి పంపాడు. పని పూర్తయిందని అబద్ధం చెప్పాడు. భర్త చనిపోయాడని నమ్మిన జగృతి అతనికి డబ్బులు చెల్లించింది. అయితే, ఉదయాన్నే భర్త నిద్ర లేవడంతో కాంట్రాక్ట్ కిల్లర్ మోసం చేశాడనే విషయం ఆమెకు తెలిసింది.

దిండుతో నొక్కి.. మంచం వెనుక దాచి..:

మొదటి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఈసారి కాంతిలాల్, జగృతి స్వయంగా రంగంలోకి దిగారు! ఒకరోజు రాత్రి ఇంట్లో గొడవ జరుగుతున్న సమయంలో కాంతిలాల్.. శాంతిగిరి గొంతు గట్టిగా నులిమాడు. అతను అరువకుండా జగృతి మొహంపై దిండు పెట్టి గట్టిగా నొక్కింది. దానితో శాంతిగిరి ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. హత్య చేసిన తర్వాత పొరుగువారికి అనుమానం రాకుండా శవాన్ని ఇంట్లోని మంచం వెనుక దాచిపెట్టారు.

శవాన్ని మాయం చేయడానికి జగృతి.. తనకు పరిచయం ఉన్న దీపక్ అలియాస్ మున్నా అనే మూడో వ్యక్తి సహాయం కోరింది. దీపక్ ఒక కారును ఏర్పాటు చేయగా.. ముగ్గురూ కలిసి శాంతిగిరి మృతదేహాన్ని సురేంద్రనగర్​లోని ఒక కాల్వలో పడేశారు. నీటిలో మునిగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. శాంతిగిరి తన ఇష్టపూర్వకంగానే పని కోసం ఊరు విడిచి వెళ్లిపోయాడని పుకార్లు పుట్టించారు. అలాగే పోలీసులకు ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

కానీ ఈ వ్యవహారంపై అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, చివరికి అసలు నిజాన్ని బయటపెట్టారు.

నెలల తరబడి దాగి ఉన్న ఈ క్రూరమైన నేరాన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మే 18న ప్రధాన నిందితులైన జగృతి గోస్వామి, కాంతిలాల్ సబరియాలను హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణల కింద పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More