Artificial Intelligence : ఏఐ సృష్టించిన కొత్త కుబేరులు.. 365 రోజుల పాటు రోజుకు ఇద్దరు కొత్త బిలియనీర్లు!
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 నివేదిక ప్రకారం, ఏఐ రంగం ప్రపంచవ్యాప్తంగా అపారమైన సంపదను సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా గతేడాది రోజుకు ఇద్దరు చొప్పున బిలియనీర్లు పుట్టుకొచ్చారు.
ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉద్యోగాలు ఊడిపోతాయేమే అని ఓవైపు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, ఆవేదనలు కనిపిస్తుంటే.. మరోవైపు అదే ఏఐ ద్వారా బిలియనీర్లుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. మరీ ముఖ్యంగా ఏఐ వల్ల గతేడాది వందలాది మంది బిలియనీర్ల లిస్ట్‌లో చేరిపోయారు. మరీ ముఖ్యంగా 365 రోజుల్లో, రోజుకు ఇద్దరు చొప్పున బిలియనీర్స్ లిస్ట్‌లో చేరాని ఓక నివేదిక వెల్లడించింది.

ఏఐతో పుట్టుకొస్తున్న బిలియనీర్లు..
'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026' ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4,020 మంది బిలియనీర్లలో 114 మంది నేరుగా ఏఐ రంగంతో ముడిపడి ఉన్నవారే. ఇందులో విశేషం ఏంటంటే, వీరిలో దాదాపు సగం మంది (46 మంది) ఈ ఏడాది కొత్తగా ఈ జాబితాలోకి చేరారు.
ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ రంగం ఎంతటి వేగంతో సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
"హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా గత ఏడాది సంపద సృష్టి జరిగింది. మేము రికార్డు స్థాయిలో 700 మంది కొత్త వ్యక్తులను ఈ జాబితాలో చూశాము. అంటే ఏడాది పొడవునా ప్రతిరోజూ ఇద్దరు కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ఇందులో సగం మంది చైనా వారే," అని నివేదిక ముఖ్య పరిశోధకుడు రూపెర్ట్ హూగెవెర్ఫ్ వెల్లడించారు.
ఏఐ డ్రివెన్ వెల్త్ బూమ్: దూసుకెళుతున్న దిగ్గజాలు..
గత ఏడాది కాలంలో ఏఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన 'వెల్త్ ఇంజిన్'గా మారింది. దీనివల్ల కీలక వ్యక్తుల సంపద అమాంతం పెరిగింది.
ఎన్వీడియా: ఏఐ చిప్‌ల తయారీలో రారాజుగా నిలిచిన ఎన్వీడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంపద 34% పెరిగి 172 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్వీడియా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడంతో, ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానానికి చేరుకున్నారు.
గూగుల్: 'జెమినీ 4' ఏఐ మోడల్ సక్సెస్, క్లౌడ్ వ్యాపారంలో ఆధిపత్యం వల్ల గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ 3వ స్థానానికి, సెర్గీ బ్రిన్ 5వ స్థానానికి ఎగబాకారు.
ఒరాకిల్ అండ్ ఓపెన్ ఏఐ: ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సంపద 32శాతం పెరిగి 267 బిలియన్ డాలర్లకు చేరగా.. ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ సంపద దాదాపు మూడు రెట్లు పెరిగి 4.7 బిలియన్ డాలర్లకు వెళ్లింది.
ఆంథ్రోపిక్: ఓపెన్ ఏఐ ప్రత్యర్థి సంస్థ అయిన ఆంథ్రోపిక్ ఏకంగా ఏడుగురు కొత్త బిలియనీర్లను సృష్టించింది. దీని మార్కెట్ విలువ 380 బిలియన్ డాలర్లకు చేరడంతో, దాని వ్యవస్థాపకులైన అమొడెయ్ తోబుట్టువుల సంపద చెరో 3.7 బిలియన్ డాలర్లకు చేరింది.
యువ రక్తం: ఏఐ రిక్రూట్‌మెంట్ స్టార్టప్ ‘మెర్కర్’ వ్యవస్థాపకులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హీరేమత్, సూర్య మిధా.. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే 2.4 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా రికార్డు సృష్టించారు.
చైనాలో ఏఐ జోరు..
చైనాలో అత్యధికంగా 1,110 మంది బిలియనీర్లు ఉన్నారు. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అధినేత జాంగ్ యిమింగ్ సంపద 79 బిలియన్ డాలర్లకు చేరగా, టెన్సెంట్ సీఈఓ మా హువటెంగ్ నెట్ వర్త్ 66 బిలియన్ డాలర్లకు పెరిగింది. డేటా సెంటర్, స్టోరేజ్ సొల్యూషన్స్ అందించే కంపెనీల యజమానుల సంపద కూడా అమాంతం పెరిగింది.
‘చారిత్రాత్మక సంపద విధ్వంసం’
అయితే, ఏఐ విప్లవం ఒకవైపు కొత్త కుబేరులను సృష్టిస్తుంటే, మరోవైపు పాతతరం సాఫ్ట్‌వేర్- డేటా కంపెనీలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
నష్టపోయిన దిగ్గజాలు: మైకేల్ బ్లూమ్‌బెర్గ్ సంపద 13% తగ్గగా, అట్లాసియన్ సహ వ్యవస్థాపకుల సంపద సగానికి పడిపోయింది.
సాస్ మార్కెట్: ఏఐ అప్లికేషన్లు పాత సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను భర్తీ చేస్తుండటంతో, సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్, వర్క్‌డేకు చెందిన డేవిడ్ డఫీల్డ్‌ల సంపద మూడో వంతు తగ్గింది.
భారత ఐటీపై ప్రభావం: ఏఐ రాకతో భారత ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీల వ్యవస్థాపక కుటుంబాల సంపద సమిష్టిగా 25 శాతం మేర పడిపోయింది.
"ఏఐ రంగంలో పుట్టుకొచ్చే ప్రతి కొత్త డాలర్ సంపద.. పాత టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థలో ఒక డాలర్ సంపదను తుడిచిపెట్టేస్తోంది," అని హురున్ రిపోర్ట్ చైర్మన్ హూగెవెర్ఫ్ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


