AIBE 22 Admit Card 2026 : లా కోర్సు పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE 22) అడ్మిట్ కార్డులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి వారి హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నవంబర్ 29న ఎగ్జామ్….

షెడ్యూల్ ప్రకారం…. AIBE 22 పరీక్ష నవంబర్ 29, 2026న దేశవ్యాప్తంగా జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది న్యాయ పట్టభద్రులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష రోజున అభ్యర్థులు తమ వెంట AIBE 2026 అడ్మిట్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్ హార్డ్ కాపీ (ప్రింటౌట్) లేని అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
AIBE 22 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం :
- ముందుగా అధికారిక AIBE వెబ్‌సైట్ allindiabarexamination.com ను ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో కనిపించే "లాగిన్" లింక్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ మీ రిజిస్టర్డ్ యూజర్ ఐడీ , పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే "Admit Card" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది. అందులోని వివరాలన్నింటినీ జాగ్రత్తగా సరిచూసుకోండి.
- అనంతరం పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని…. పరీక్ష రోజు కోసం స్పష్టమైన ప్రింటౌట్ తీసి భద్రపరుచుకోండి.
అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులో తమ పేరు, రోల్ నంబర్, కేటాయించిన AIBE 22 పరీక్షా కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం, పరీక్ష రోజున పాటించాల్సిన ముఖ్య సూచనలు ఉంటాయి. హాల్ టికెట్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కావడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా, లేదా హాల్ టికెట్‌లోని వివరాలలో ఏవైనా తప్పులు దొర్లినా అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే AIBE హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలి.