బైపాస్ సర్జరీ అయినా తగ్గలేదు... 73 ఏళ్ల వయసులో భద్రాచలం వాసి సత్తా! వరల్డ్ పవర్‌లిఫ్టింగ్‌లో పతకాలు!
గుండె బైపాస్ సర్జరీ చేయించుకున్న భద్రాచలం రిటైర్డ్ బ్యాంకర్ డి.వి. శంకర్ రావు (73) అమెరికాలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. రజత, కాంస్య పతకాలు సాధించారు.
వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని, సంకల్ప బలం ముందు శారీరక అడ్డంకులు చిన్నబోతాయని తెలంగాణకు చెందిన ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారి నిరూపించారు. గుండెకు బైపాస్ సర్జరీ జరిగినప్పటికీ ఏమాత్రం వెరవకుండా పవర్‌లిఫ్టింగ్‌లో అడుగుపెట్టిన 73 ఏళ్ల డి.వి. శంకర్ రావు…. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. గతేడాది జాతీయ స్థాయిలో స్వర్ణ పతకాలతో మెరిసిన ఆయన….. తాజాగా ప్రపంచ వేదికపై భారత్ కీర్తి పతాకను ఎగురవేశారు.

అమెరికాలోని నెవాడా రాష్ట్రం…. రెనో నగరంలో 2026 అక్టోబర్‌లో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తాను ఈ పతకాలు గెలుచుకున్నట్లు భద్రాచలం పట్టణానికి చెందిన శంకర్ రావు ఆదివారం వెల్లడించారు. మాస్టర్స్-4, 74 కిలోల విభాగంలో పోటీపడిన ఆయన అక్టోబర్ 15న జరిగిన క్లాసిక్ విభాగంలో ఓవరాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 22న జరిగిన ఎక్విప్డ్ విభాగంలో ఓవరాల్ రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
"73 ఏళ్ల వయసులో ప్రపంచ పోడియంపై నిలబడి, నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ రెండు అంతర్జాతీయ పతకాలు అందుకోవడం నా జీవితంలో మరపురాని క్షణం," అని శంకర్ రావు పీటీఐ వార్తా సంస్థతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
శంకర్ రావు సాధించిన ఈ అరుదైన విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రస్తావించాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రధానికి లేఖ రాశారు.
"సశక్త భారత్ కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం" (హెల్తీ ఏజింగ్ ఫర్ ఎ స్ట్రాంగర్ ఇండియా) అనే ఇతివృత్తం కింద ఆయన ప్రస్థానాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
బైపాస్ సర్జరీ నుంచి బరువులెత్తే స్థాయికి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అధికారిగా పనిచేసిన శంకర్ రావు 2013 జులైలో ఉద్యోగ విరమణ చేశారు. అంతకుముందే, అంటే 2012 సెప్టెంబర్‌లో తన 59వ ఏట ఆయనకు కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ జరిగింది. రిటైర్మెంట్ తర్వాత ఉదయపు నడకకు వెళ్తున్న సమయంలో ఒక స్నేహితుడు ఆయన శరీర సౌష్టవాన్ని గమనించి జిమ్‌లో శిక్షణ తీసుకోవాలని…. పోటీల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు. అలా నేటి యువతకు, విశ్రాంత ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచిన ఆయన పవర్‌లిఫ్టింగ్ ప్రయాణం మొదలైంది.
"గుండె బైపాస్ సర్జరీ చేయించుకున్నందున మొదట్లో జిమ్‌కు వెళ్లడానికి నేను చాలా సంకోచించాను," అని ఆయన నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ డాక్టర్ కూడా తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, జిమ్‌కు వచ్చే కొందరు వైద్యులు ఆయనకు భరోసా ఇచ్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా లేదా అసౌకర్యంగా ఉన్నా వెంటనే శిక్షణ ఆపేయాలనే షరతుతో ముందుకు వెళ్లవచ్చని వారు సూచించారు. శిక్షణకు తన శరీరం చాలా బాగా స్పందిస్తోందని మరికొందరు వైద్యులు చెప్పడంతో ఆయనలో ధైర్యం పెరిగింది.
2025 ఫిబ్రవరిలో కఠోర శిక్షణ ప్రారంభించిన శంకర్ రావు…. అదే ఏడాది చివర్లో కేరళలోని కోజికోడ్‌లో పవర్‌లిఫ్టింగ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెలుచుకున్నారు. "ఆ విజయం నాలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున ఆడాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచింది," అని ఆయన వివరించారు.
పదవీ విరమణ తర్వాత తమ ఉత్పాదక జీవితం ముగిసిపోయిందని, ఇక లక్ష్యాలేమీ ఉండవని కొందరు సీనియర్ సిటిజన్లు నిరాశ చెందుతుంటారని శంకర్ రావు పేర్కొన్నారు. తన ప్రయాణం ద్వారా కొద్దిమందిలోనైనా ఆత్మవిశ్వాసం చిగురించి, వారు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోగలిగితే…. పతకాలు గెలవడం కంటే అదే తనకు అతిపెద్ద విజయమని ఆయన అభిప్రాయపడ్డారు.
గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ప్రతి ఒక్కరూ పవర్‌లిఫ్టింగ్ చేయాలని తాను సూచించబోనని ఆయన స్పష్టం చేశారు. ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో తగిన వ్యాయామాలను ఎంచుకోవాలని హితవు పలికారు. ప్రపంచ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించడమే తన తదుపరి లక్ష్యమని శంకర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

