ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్య- ఎయిర్‌బస్ హెచ్చరికతో దేశీయ విమాన సర్వీసులకు అంతరాయం!

ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో ఫ్లైట్ కంట్రోల్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ సమస్య ఏర్పడింది. దీని వల్ల ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సహా అనేక విమానయాన సంస్థల కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

Published on: Nov 29, 2025, 08:15:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎయిర్‌బస్ S320కి చెందిన విమానాల్లో ఫ్లైట్ కంట్రోల్స్‌ (విమాన నియంత్రణ వ్యవస్థ)కు సంబంధించిన సమస్య తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహా పలు విమానయాన సంస్థల విమాన కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది. ఈ నెల ప్రారంభంలో మెక్సికో నుంచి వచ్చిన జెట్‌బ్లూ ఎయిర్‌బస్ ఏ320 విమానంలో అకస్మాత్తుగా ఎత్తు తగ్గడంతో 15 మంది ప్రయాణికులు గాయపడి, ఫ్లోరిడాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్య (AFP)
ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్య (AFP)

ఎయిర్‌బస్ హెచ్చరిక ఏంటి?

తమ వద్ద ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఏ320 జెట్‌లైనర్ కుటుంబంలోని సగం కంటే ఎక్కువ విమానాలకు సాఫ్ట్‌వేర్ పరిష్కారం అవసరమని ఎయిర్‌బస్ ఎస్‌ఈ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

తాజా సమాచారం ప్రకారం.. భారతీయ ఆపరేటర్ల వద్ద సుమారు 560 ఏ320 కుటుంబ విమానాలు ఉండగా, వాటిలో 200కు పైగా విమానాలకు సాఫ్ట్‌వేర్ మార్పులు లేదా హార్డ్‌వేర్ సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని పీటీఐ వార్తా సంస్థకు వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా ఏ320 కుటుంబంలో ఏ319లు, ఏ320 సీఈఓ​లు, నియోలు, ఏ321 సీఈఓలు​, నియోలు​ వంటి విమానాలు ఉన్నాయి.

విమాన కార్యకలాపాలపై ప్రభావం..

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏ320 కుటుంబ విమానాలకు సాఫ్ట్‌వేర్ మార్పులు లేదా హార్డ్‌వేర్ సర్దుబాట్లు జరుగుతున్నందున, కొన్ని విమానాలను గ్రౌండ్ చేయాల్సి వస్తుంది. దీని కారణంగా విమాన కార్యకలాపాలలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఈ సమస్యపై దేశీయ విమానయాన సంస్థలు కూడా స్పందించి, ప్రయాణికులకు అంతరాయాల గురించి తెలియజేశాయి.

"దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో శనివారం (నవంబర్ 29) ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ320 కుటుంబ విమానాల గురించి ఎయిర్‌బస్ నోటీసు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. "ఎయిర్‌బస్ నోటిఫికేషన్ ప్రకారం అమలు జరిగేలా మేము ఎయిర్‌బస్‌తో కలిసి పనిచేస్తున్నాము. అవసరమైన తనిఖీలు చేపడుతున్నప్పుడు, అంతరాయాలను తగ్గించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము," అని ఇండిగో సంస్థ పేర్కొంది.

ఏ320 విమాన శ్రేణిలో సాఫ్ట్‌వేర్ పరిష్కారం అవసరమని హెచ్చరించిన వెంటనే తాము తక్షణమే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. "మా విమానాలలో ఎక్కువ భాగం దీని ప్రభావానికి గురి కానప్పటికీ, ఈ మార్గదర్శకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లకు వర్తిస్తుంది. విమాన కార్యకలాపాలలో సర్దుబాట్లకు దారితీయవచ్చు. ఫలితంగా ఆలస్యాలు లేదా రద్దులు ఉండే అవకాశం ఉంది," అని పేర్కొంది.

ఎయిర్ ఇండియా (Air India): తాము ఈ ఆదేశం గురించి తెలుసుకున్నామని, దీని కారణంగా విమానాల 'టర్న్‌అరౌండ్ సమయం' పెరిగే అవకాశం ఉందని, షెడ్యూల్ చేసిన కార్యకలాపాలలో ఆలస్యం ఉండవచ్చని ప్రయాణికులను హెచ్చరించింది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవసరం ఎందుకు?

జెట్‌బ్లూ ఎయిర్‌వేస్‌ విమానానికి సంబంధించిన తాజా సంఘటన తర్వాత, ఫ్లైట్ కంట్రోల్స్ సరిగ్గా పనిచేయడానికి ఉపయోగించే డేటాలో "తీవ్రమైన సోలార్​ రేడియేషన్​" కారణంగా మార్పులు జరిగే అవకాశం ఉందని ఎయిర్‌బస్ ఎస్‌ఈ తెలిపింది. దీని కారణంగా తమ ఏ320 జెట్‌లైనర్ కుటుంబంలో సగం కంటే ఎక్కువ విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవసరం అవుతుందని ప్రకటించింది.

ఈ అవసరమైన అప్‌డేట్ కోసం 6,500 కంటే ఎక్కువ విమానాలు ప్రభావితం కావచ్చని ఎయిర్‌బస్ తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ విమానం తదుపరి సాధారణ విమానానికి బయలుదేరేలోపు జరగాలని నోటీసులో పేర్కొంది.

కాగా, ఏ320 విమానం బోయింగ్ కో. 737 విమానానికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఈ రెండు జెట్‌లైనర్ కుటుంబాలు పౌర విమానయాన పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More