...
...
Next Story

ఎయిర్​టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్! 3 కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లాంచ్- రూ. 185 నుంచే!

టెలికాం నిబంధనల సంస్థ 'ట్రాయ్' ఆదేశాలకు అనుగుణంగా భారతీ ఎయిర్​టెల్ ‘వాయిస్-ఓన్లీ’ ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా రూ. 185 నుంచి ప్రారంభమయ్యే ఈ రీఛార్జ్ ప్లాన్ల వివరాలు ఇక్కడ పరిశీలించండి..

Published on: Oct 18, 2026, 12:20:12 IST
Advertisement

స్మార్ట్‌ఫోన్లు, 4జీ, 5జీ డేటా వాడని సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్ శుభవార్త అందించింది. ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు మాత్రమే వాడుకునే వారి కోసం మూడు కొత్త 'వాయిస్-ఓన్లీ' రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన అక్టోబర్ 21 గడువు కంటే కొన్ని రోజుల ముందు ఎయిర్​టెల్ ఈ ప్లాన్లను ప్రవేశపెట్టడం విశేషం.

ఎయిర్​టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్ల ధరలు..

ఎయిర్​టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ వివరాలు.. (Reuters)
ఎయిర్​టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ వివరాలు.. (Reuters)

ఎయిర్​టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వాయిస్ ఓన్లీ మూడు ప్లాన్ల వివరాలు ఇప్పటికే 'ఎయిర్​టెల్ థాంక్స్' యాప్‌లో ఉన్నాయి. అవి..

  • రూ. 185 ప్లాన్: ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు.
  • రూ. 203 ప్లాన్: ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజులు.
  • రూ. 206 ప్లాన్: ఇది క్యాలెండర్ నెల (అంటే ఆయా నెలలో ఉన్న రోజులను బట్టి 30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది.

ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలోనూ వినియోగదారులు అపరిమిత ఉచిత లోకల్, నేషనల్ కాలింగ్ సదుపాయంతో పాటు ఉచితంగా 300 ఎస్ఎంస్​లు పొందుతారు.

అయితే ఈ ఎయిర్​టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఎలాంటి ఇంటర్నెట్ డేటా లభించదని గుర్తుపెట్టుకోవాలి.

ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా..

గత సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్​టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ)లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్-ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు 30 రోజుల సమయం ఇస్తూ అక్టోబర్ 21ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ నిబంధనను పాటించడంలో మిగిలిన కంపెనీల కంటే ముందే ఎయిర్​టెల్ ముందుకు వచ్చి ప్లాన్లను విడుదల చేసింది.

22 కోట్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఊరట!

రీసెర్చ్ సంస్థ 'సైబర్ మీడియా రీసెర్చ్' (సీఎంఆర్) ఆగస్టు నివేదిక ప్రకారం.. భారత్‌లో 2జీ ఆధారిత ఫీచర్ ఫోన్ల వాడకం ఏటా 5 శాతం చొప్పున పెరుగుతోంది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఐటెల్ 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, లావా 30 శాతం, హెచ్‌ఎండీ/నోకియా 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ల విడిభాగాల ధరలు పెరగడంతో కొత్త ఫోన్ల ధరలు ఆకాశాన్నంటాయి. దీనితో సామాన్యులు పాత కీప్యాడ్ ఫోన్లనే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. డేటా రహిత ప్లాన్లను తీసుకురావడం వల్ల రీఛార్జ్ వ్యయం తగ్గి, ఈ వినియోగదారులకు ఊరట లభించనుంది. మార్కెట్లో ఈ ప్లాన్లకు లభించే ఆదరణను బట్టి రాబోయే రోజుల్లో సుదీర్ఘ కాలపరిమితి కలిగిన వాయిస్-ఓన్లీ ప్లాన్లను కూడా తీసుకొచ్చేందుకు ఎయిర్​టెల్ యోచిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks