ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్! 3 కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్స్ లాంచ్- రూ. 185 నుంచే!
టెలికాం నిబంధనల సంస్థ 'ట్రాయ్' ఆదేశాలకు అనుగుణంగా భారతీ ఎయిర్టెల్ ‘వాయిస్-ఓన్లీ’ ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా రూ. 185 నుంచి ప్రారంభమయ్యే ఈ రీఛార్జ్ ప్లాన్ల వివరాలు ఇక్కడ పరిశీలించండి..
స్మార్ట్ఫోన్లు, 4జీ, 5జీ డేటా వాడని సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ శుభవార్త అందించింది. ఇంటర్నెట్ డేటాతో పనిలేకుండా కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు మాత్రమే వాడుకునే వారి కోసం మూడు కొత్త 'వాయిస్-ఓన్లీ' రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన అక్టోబర్ 21 గడువు కంటే కొన్ని రోజుల ముందు ఎయిర్టెల్ ఈ ప్లాన్లను ప్రవేశపెట్టడం విశేషం.
ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్ల ధరలు..
ఎయిర్టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వాయిస్ ఓన్లీ మూడు ప్లాన్ల వివరాలు ఇప్పటికే 'ఎయిర్టెల్ థాంక్స్' యాప్‌లో ఉన్నాయి. అవి..
- రూ. 185 ప్లాన్: ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు.
- రూ. 203 ప్లాన్: ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజులు.
- రూ. 206 ప్లాన్: ఇది క్యాలెండర్ నెల (అంటే ఆయా నెలలో ఉన్న రోజులను బట్టి 30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది.
ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలోనూ వినియోగదారులు అపరిమిత ఉచిత లోకల్, నేషనల్ కాలింగ్ సదుపాయంతో పాటు ఉచితంగా 300 ఎస్ఎంస్లు పొందుతారు.
అయితే ఈ ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్లలో ఎలాంటి ఇంటర్నెట్ డేటా లభించదని గుర్తుపెట్టుకోవాలి.
ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా..
గత సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ)లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్-ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు 30 రోజుల సమయం ఇస్తూ అక్టోబర్ 21ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ నిబంధనను పాటించడంలో మిగిలిన కంపెనీల కంటే ముందే ఎయిర్టెల్ ముందుకు వచ్చి ప్లాన్లను విడుదల చేసింది.
22 కోట్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఊరట!
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మందికి పైగా ఫీచర్ ఫోన్ (సాధారణ కీప్యాడ్ ఫోన్) వినియోగదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, వయోవృద్ధుల్లో చాలామంది ఇంటర్నెట్ వాడకుండా కేవలం మాట్లాడటానికి మాత్రమే ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. అలాంటి వారు ప్రతి నెలా రూ. 300కి పైగా వెచ్చించి డేటాతో కూడిన ప్యాక్‌లను రీఛార్జ్ చేసుకోవడం ఆర్థిక భారంగా మారింది.
రీసెర్చ్ సంస్థ 'సైబర్ మీడియా రీసెర్చ్' (సీఎంఆర్) ఆగస్టు నివేదిక ప్రకారం.. భారత్‌లో 2జీ ఆధారిత ఫీచర్ ఫోన్ల వాడకం ఏటా 5 శాతం చొప్పున పెరుగుతోంది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఐటెల్ 38 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, లావా 30 శాతం, హెచ్ఎండీ/నోకియా 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
స్మార్ట్ఫోన్ల విడిభాగాల ధరలు పెరగడంతో కొత్త ఫోన్ల ధరలు ఆకాశాన్నంటాయి. దీనితో సామాన్యులు పాత కీప్యాడ్ ఫోన్లనే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. డేటా రహిత ప్లాన్లను తీసుకురావడం వల్ల రీఛార్జ్ వ్యయం తగ్గి, ఈ వినియోగదారులకు ఊరట లభించనుంది. మార్కెట్లో ఈ ప్లాన్లకు లభించే ఆదరణను బట్టి రాబోయే రోజుల్లో సుదీర్ఘ కాలపరిమితి కలిగిన వాయిస్-ఓన్లీ ప్లాన్లను కూడా తీసుకొచ్చేందుకు ఎయిర్టెల్ యోచిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


