Price Hike : మళ్లీ పెరగనున్న నిత్యావసరాల ధరలు! యుద్ధం సెగతో సామాన్యుడి జేబుకు చిల్లు..

పెరిగిన ముడిసరుకుల ధరల కారణంగా రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను మరింత పెంచేందుకు ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధిక ధరల భారంతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడి జేబుకు ఇది మరింత చిల్లు పెట్టనుంది.

Published on: Aug 10, 2026, 10:45:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సామాన్యులకు మరోసారి ధరల భారం తప్పేలా లేదు. నిత్యావసర వస్తువులను అందించే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలను మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి! అమెరికా- ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో పెట్రోల- డీజిల్, ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పలు కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రైజ్ హైక్ చేయాలని చూస్తుండగా.. మరికొన్ని కంపెనీలు ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించే 'శ్రింక్‌ఫ్లేషన్' వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఘజియాబాద్​లోని ఒక సూపర్​ మార్కెట్..
ఘజియాబాద్​లోని ఒక సూపర్​ మార్కెట్..

గత జూన్ త్రైమాసికంలోనే పరిశ్రమ వర్గాలు సుమారు 2 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచాయి. అయినప్పటికీ ముడిసరుకుల భారం తగ్గకపోవడంతో ఇంకోసారి ధరల పెంపు బాట పట్టనున్నాయి.

బిస్కట్లపై పడనున్న భారం!

ప్రముఖ బిస్కట్ల తయారీ సంస్థ బ్రిటానియా.. మరో 1.5 నుంచి 2 శాతం వరకు ధరలను పెంచాలను భావిస్తోందని సమాచారం. ముఖ్యంగా రూ. 5, రూ. 10 ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఈ భారాన్ని సర్దుబాటు చేసే అవకాశం ఉంది. పంచదార, పామాయిల్ వంటి కీలక పదార్థాల ధరలు పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆ సంస్థ ఎండీ, సీఈఓ రక్షిత్ హర్గవే తెలిపారు. జూన్ త్రైమాసికంలో పెంచిన ధరలు.. ఖర్చుల పెరుగుదలను పూర్తిగా భర్తీ చేయలేకపోయాయని ఆయన పేర్కొన్నారు.

మరికొన్ని దిగ్గజ కంపెనీలు కూడా..

హిందుస్థాన్ యునిలీవర్ కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2 నుంచి 5 శాతం వరకు ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తున్న ఆ సంస్థ.. వివిధ కేటగిరీల్లో తగిన విధంగా ధరలను సవరించాలని యోచిస్తోంది.

ముడిసరుకుల వ్యయం అధికంగా ఉండటం ఆందోళనకరమని డాబర్ ఇండియా వెల్లడించింది. ద్రవ్యోల్బణ భారాన్ని కొంతవరకు వినియోగదారులకు బదలాయించడం వల్ల అమ్మకాల పరిమాణం కంటే రాబడి, ధరల వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యాజమాన్యం తెలిపింది.

గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి.

దేశంలో మే నెల నుంచి పెట్రోల్​, డీజిల్​ ధరలు పలుమార్లు పెరిగాయి. పెట్రోల్​ మీద అయితే దాదాపు 7 రూపాయిల పెంపు జరిగింది. ఫలితంగా దేశంలో వస్తువుల ధరలు పెరుగుతూనేే ఉన్నాయి.

ఆల్కొహాల్ మార్కెట్లో విరుద్ధమైన ధోరణి!

ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతుంటే, ప్రీమియం ఆల్కోహాల్ అమ్మకాలు మాత్రం దూసుకుపోతుండటం గమనార్హం.

యూనిటెడ్ స్పిరిట్స్, రాధికో ఖైతాన్, అలైడ్ బ్లెండర్స్ సంస్థలు జూన్ త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్‌లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. యూనిటెడ్ బ్రూవరీస్ ప్రీమియం వాల్యూమ్స్ ఏకంగా 17 శాతం పెరిగినట్లు తెలిపింది. రాడికో ఖైతాన్ ప్రీమియం పోర్ట్‌ఫోలియో ఏకంగా 35.8 శాతం ఎగబాకడంతో పాటు 76 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. యూనిటెడ్ స్పిరిట్స్ నికర లాభం కూడా 51.6 శాతం పెరగడం విశేషం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More