డిఫెన్స్ స్టాక్ ధమాకా: 2 నెలల్లో 100% కి పైగా పెరిగిన అపోలో మైక్రో షేరు
దేశీయ డిఫెన్స్ రంగానికి చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట పండిస్తున్నాయి. మార్చి కనిష్ఠాల నుంచి ఏకంగా 110 శాతం కోలుకున్న ఈ స్టాక్, రూ. 377.70 వద్ద ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే (Range-bound) కదులుతున్నప్పటికీ, డిఫెన్స్ రంగానికి చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్ (Apollo Micro Systems) షేర్లు మాత్రం కొత్త శిఖరాలను తాకుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బుల్ రన్ కొనసాగిస్తూ గురువారం రోజున ఈ షేరు రూ. 377.70 వద్ద సరికొత్త ఆల్-టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. కంపెనీకి ఉన్న బలమైన వృద్ధి అవకాశాలు, ఆర్డర్ బుక్ ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

గడిచిన సెప్టెంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో అపోలో మైక్రో సిస్టమ్స్ స్టాక్ తీవ్ర ఒత్తిడికి గురై దాదాపు 42 శాతం మేర పతనమైంది. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. మార్చి నాటి కనిష్ఠ స్థాయిల నుంచి కేవలం రెండు నెలల వ్యవధిలోనే 110 శాతం మేర లాభపడింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏకంగా 63 శాతం మేర పెరిగి జూన్ 2023 తర్వాత అతిపెద్ద నెలవారీ రికవరీని సాధించింది.
ప్రస్తుత నెలలోనూ మరో 21 శాతం మేర పుంజుకుని, ఈ ఏడాది (YTD) మొత్తం 32 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఈ కాలంలో కేవలం 1.5 శాతం పెరిగిన నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్‌ను ఇది స్పష్టంగా అధిగమించింది.
కాంపోనెంట్ సరఫరాదారు నుంచి సిస్టమ్ ఇంటిగ్రేటర్‌గా..
కేవలం విడిభాగాలను సరఫరా చేసే సంస్థ స్థాయి నుంచి పూర్తి స్థాయి 'సిస్టమ్ ఇంటిగ్రేటర్'గా కంపెనీ రూపాంతరం చెందడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. మార్జిన్లు పెరుగుతుండటం, ఆర్డర్ పైప్‌లైన్ ఆశాజనకంగా ఉండటంతో విశ్లేషకులు కూడా అపోలో మైక్రో సిస్టమ్స్ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. వరుసగా ఆరో ఏడాదీ ఈ స్టాక్ సానుకూల రాబడులను అందించడమే కాకుండా, రెండుసార్లు మల్టీబ్యాగర్‌గా నిలిచి ఇన్వెస్టర్లకు మరువలేని లాభాలను పంచింది.
క్యూ4, వార్షిక ఫలితాల్లో బంపర్ లాభాలు
మార్చి త్రైమాసికంలో (Q4 FY26) కంపెనీ అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను సాధించింది.
త్రైమాసిక ఆదాయం: ఆపరేషన్స్ ద్వారా వచ్చిన కన్సాలిడేటెడ్ ఆదాయం గతేడాది రూ. 161.77 కోట్లతో పోలిస్తే 81.3 శాతం పెరిగి రూ. 293.26 కోట్లకు చేరింది.
త్రైమాసిక నికర లాభం (PAT): గతేడాది ఉన్న రూ. 13.96 కోట్ల నుంచి ఏకంగా 163.5 శాతం ఎగబాకి రూ. 36.79 కోట్లుగా నమోదైంది.
మొత్తం ఆర్థిక సంవత్సరం (FY26): ఆపరేషనల్ ఆదాయం 60.9 శాతం పెరిగి రూ. 904.32 కోట్లకు చేరగా, నికర లాభం 90.5 శాతం వృద్ధితో రూ. 107.38 కోట్లుగా నమోదైంది (గతేడాది రూ. 56.36 కోట్లు).
బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణ
"రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ రాబడులు, ఎబిటా, నికర లాభాలు వరుసగా 52.9%, 52.9%, 54.6% మేర సీఏజీఆర్ (CAGR) వృద్ధిని నమోదు చేయవచ్చు" అని బ్రోకరేజ్ సంస్థ ఛాయిస్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది.
మంచి ఫలితాల నేపథ్యంలో FY27E, FY28E ఈపీఎస్ (EPS) అంచనాలను వరుసగా 27.5 శాతం, 19.5 శాతానికి బ్రోకరేజ్ పెంచింది. అయితే, ఇటీవలి కాలంలో షేరు ధర ఊహించని రీతిలో పెరగడంతో దీని రేటింగ్‌ను 'బై' నుంచి 'యాడ్'కు సవరించింది. అయినప్పటికీ ఈ షేరు రూ. 365 స్థాయిని చేరుకోగలదని ముందే అంచనా వేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


