Foldable iPhone : యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్.. లాంచ్ రేపే! ఫీచర్లు, ధర..

యాపిల్ ప్రియులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న సంస్థ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ (iPhone Fold/Ultra) విడుదలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 9న జరిగే 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో మోడళ్లతో పాటు ఈ ఫోల్డబుల్ ఫోన్ అరంగేట్రం చేయనుందనే వార్తలు గ్లోబల్ టెక్ ప్రపంచంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

Published on: Sep 8, 2026, 06:45:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ రంగాన్ని శాసిస్తున్న యాపిల్ సంస్థ తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మైలురాయికి సిద్ధమవుతోంది. ఆండ్రాయిడ్ దిగ్గజాలు శాంసంగ్, గూగుల్ ఇప్పటికే ఫోల్డబుల్ మార్కెట్‌లో జోరు చూపిస్తుండగా, యాపిల్ కూడా తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. సెప్టెంబర్ 9న నిర్వహించనున్న ప్రత్యేక గ్రాండ్ ఈవెంట్ ‘సర్‌ప్రైజ్ అండ్ షైన్’ వేదికగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్​తో పాటు ఈ నయా ఫోల్డబుల్ ఫోన్​ని ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

ఫోల్డబుల్ ఐఫోన్.. (Representative Image)
ఫోల్డబుల్ ఐఫోన్.. (Representative Image)

లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోల్డబుల్ పరికరానికి 'ఐఫోన్ ఫోల్డ్' లేదా 'ఐఫోన్ ఆల్ట్రా' అని పేరు పెట్టే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మాన్ కథనం ప్రకారం.. అత్యంత ప్రీమియం కేటగిరీలో రానున్న ఈ ఫోన్ ప్రారంభ ధర దాదాపు 2,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1,88,000 కంటే ఎక్కువ) ఉండవచ్చని అంచనా.

మడతపెట్టే అత్యంత సన్నని డిజైన్ కోసం యాపిల్ ఇంజనీర్లు తొలిసారి కొన్ని కీలకమైన ఫీచర్లలో రాజీపడాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో మోడళ్లతో పోలిస్తే ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో కనిపించవని భావిస్తున్న ముఖ్యమైన మార్పులు ఇవే..

ఫేస్ ఐడీకి గుడ్ బై.. టచ్ ఐడీ రీ-ఎంట్రీ!

ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో రానున్న అతిపెద్ద మార్పు ఫేస్ ఐడీని తొలగించడం. ఫోన్ పూర్తిగా తెరిచినప్పుడు దీని మందం కేవలం 4.5 మిల్లీమీటర్లు మాత్రమే ఉండేలా డిజైన్ చేశారట. ఇంత సన్నని బాడీలో ఫేస్ ఐడీకి కావాల్సిన 'ట్రూ డెప్త్' కెమెరా సెన్సార్లను అమర్చడం సాంకేతికంగా కుదరలేదు. అందువల్ల, యాపిల్ తన ఐకానిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ‘టచ్ ఐడీ’ని మళ్లీ తీసుకువస్తోంది. అయితే పాత మోడళ్లలా హోమ్ బటన్‌పై కాకుండా, ఐప్యాడ్‌లలో మాదిరిగా పక్కనే ఉండే పవర్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను నిక్షిప్తం చేయనున్నారు.

కెమెరా సెటప్‌లో రాజీ: టెలిఫోటో లెన్స్ లేనట్లే?

క్యాజువల్ ఫొటోగ్రఫీకి ఇది అద్భుతంగా ఉన్నప్పటికీ, ప్రో మోడళ్ల స్థాయి కెమెరా అనుభూతిని ఇందులో ఊహించలేము. లీకైన డమ్మీ యూనిట్ల ప్రకారం ఈ ఫోల్డబుల్ ఐఫోన్ వెనుక భాగంలో కేవలం రెండు కెమెరాలు మాత్రమే ఉంటాయి: 48-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ సెన్సార్, 48-మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్సార్. బాడీ మందాన్ని తగ్గించే క్రమంలో ప్రత్యేకమైన 'టెలిఫోటో జూమ్ లెన్స్'ను తొలగించాల్సి వచ్చినట్లు సమాచారం.

పాస్‌పోర్ట్ సైజ్ డిస్‌ప్లే.. స్క్రీన్ క్రీజ్ మాయం!

ఈ ఫోల్డబుల్ ఐఫోన్ బయట 5.5 ఇంచుల కవర్ డిస్‌ప్లే, లోపల 7.8 ఇంచుల విశాలమైన ఓఎల్ఈడీ మెయిన్ స్క్రీన్‌తో రానుంది. ఫోన్ మడతపెట్టి ఉన్నప్పుడు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా, విప్పినప్పుడు ఒక చిన్న ఐప్యాడ్ లాగా మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగపడుతుంది. మడతపెట్టే ఫోన్లలో స్క్రీన్ మధ్యలో వచ్చే 'క్రీజ్' కనిపించకుండా ఉండేందుకు యాపిల్ ప్రత్యేకమైన ‘లిక్విడ్ మెటల్ హింజ్’ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు మార్క్ గుర్మాన్ వెల్లడించారు.

మాగ్‌సేఫ్ ఛార్జింగ్ అండ్ బటన్ లొకేషన్లు..

మడతపెట్టే భాగంలో కాంపోనెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మాగ్‌సేఫ్ అయస్కాంత ఛార్జింగ్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే అనుమానాలు ఉండేవి. కానీ, ఐఫోన్ ఎయిర్‌లో సాధించిన సాంకేతిక విజయంతో ఈ ఫోల్డబుల్ ఫోన్​లో కూడా మాగ్‌సేఫ్ ఛార్జింగ్ సదుపాయాన్ని యాపిల్ కొనసాగిస్తోంది. ఇక బటన్ల అమరిక విషయానికొస్తే, వాల్యూమ్ బటన్లు ఫోన్ పైభాగంలో కుడివైపున ఉండే అవకాశం ఉంది. అంతర్గత మదర్‌బోర్డును కుడివైపున ఉంచడం వల్ల కేబుల్స్ మడతభాగం గుండా వెళ్లకుండా యాపిల్ ఈ వినూత్న డిజైన్‌ను ఎంచుకుంది.

ఫిజికల్ సిమ్ స్లాట్‌కు స్వస్తి..

గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఉండదు. ఇది పూర్తిగా ఈ-సిమ్ సాంకేతికతతో మాత్రమే పనిచేస్తుంది. అంతేకాకుండా, యాపిల్ సొంతంగా తయారుచేసిన సీ2 5జీ మోడెమ్‌ను ఇందులో ఉపయోగిస్తుండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో mmWave 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ ఉండకపోవచ్చని నిపుణుడు మింగ్-చి కువో పేర్కొన్నారు.

అయితే, ఇవన్నీ ప్రస్తుతం రూమర్స్​ దశలోనే ఉన్నాయి. సెప్టెంబర్​ 9 ఈవెంట్​తో ఫోల్డబుల్ ఐఫోన్​కి సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More