Election results 2026 : పశ్చిమ బెంగాల్​ నుంచి కేరళ వరకు.. నేడే ఓట్ల లెక్కింపు- గెలుపెవరిది?

Election results West Bengal : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాలు- యూటీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. బెంగాల్‌లో మమత పీఠం దక్కుతుందా? దక్షిణాదిలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటుందా? అనే ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది.

Published on: May 4, 2026, 05:18:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bengal election result date 2026 : దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంకానికి సమయం ఆసన్నమైంది! పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న ‘ఇండియా’ కూటమికి, అలాగే తన ప్రాబల్యాన్ని మరింత విస్తరించుకోవాలని చూస్తున్న బీజేపీకి ఈ ఫలితాలు జీవన్మరణ సమస్యగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయడం ద్వారా జాతీయ రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని కమలదళం వ్యూహరచన చేస్తోంది.

ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. (Hindustan Times)
ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. (Hindustan Times)

బెంగాల్ కోటపై కమలం కన్ను.. దీదీ నిలబడుతుందా?

ఈ ఎన్నికల్లో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే ఉంది. గత పదేళ్లుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అగ్రనేతల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం ఈసారి పతాక స్థాయికి చేరింది. అవినీతి ఆరోపణలు, చొరబాట్లు, సాంస్కృతిక అస్తిత్వం వంటి అంశాలే అస్త్రాలుగా ఇరుపక్షాలు తలపడ్డాయి. దాదాపు 91 లక్షల ఓటర్ల తొలగింపు వ్యవహారం, ఓటర్ల మౌనం ఈసారి ఫలితాలను ఎటువైపు తిప్పుతాయోనన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, మమత ‘ఫైటింగ్ స్పిరిట్’ ముందు అవి నిలబడతాయా అనేది చూడాలి.

తమిళనాడులో సినీ గ్లామర్.. స్టాలిన్‌కు సవాల్?

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమిదే హవా అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నప్పటికీ, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎంట్రీ సమీకరణాలను మార్చేలా కనిపిస్తోంది. విజయ్ పార్టీ సుమారు 30 శాతం ఓట్ షేర్ సాధిస్తుందన్న అంచనాలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నా, అధికారంలో భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వైఖరి చూస్తుంటే.. గెలిచినా కాంగ్రెస్‌కు దక్కేది కేవలం ఉనికి మాత్రమే.

కేరళలో కమ్యూనిస్టుల ఉనికి చాటుతారా?

సాధారణంగా కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది. కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని చెరిపివేసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే అది ఒక రికార్డు అవుతుంది. ఒకవేళ ఇక్కడ లెఫ్ట్ కూటమి ఓడిపోతే, 1977 తర్వాత దేశంలోనే కమ్యూనిస్టులు ఎక్కడా అధికారంలో లేని పరిస్థితి వస్తుంది. బెంగాల్, త్రిపురలను ఇప్పటికే కోల్పోయిన వామపక్షాలకు కేరళే ఇప్పుడు ఆఖరి ఆశ.

అసోం- పుదుచ్చేరి: హిమంత బిశ్వ శర్మ హవా నడుస్తుందా?

అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అయితే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందా లేదా అన్నదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఈసారి గట్టి పోటీ ఇచ్చారు. ఇక పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇక్కడ కూడా విజయ్ పార్టీ ప్రభావం ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసించే అవకాశం ఉంది.

ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా నేడే జరగనుంది. ఆయా ప్రాంతాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాలు వెలువడేసరికి రాత్రి అవ్వొచ్చు కానీ మధ్యాహ్నం కల్లా దేశ రాజకీయ దిశ ఏంటో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎందుకు అంత కీలకం?

దేశంలో బీజేపీని బలంగా ఢీకొంటున్న నేతల్లో మమతా బెనర్జీ ఒకరు. అక్కడ బీజేపీ గెలిస్తే అది జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీకి తిరుగులేని విజయంగా మారుతుంది. అందుకే బెంగాల్ ఫలితంపై దేశమంతా ఆసక్తిగా ఉంది.

2. తమిళనాడులో నటుడు విజయ్ ప్రభావం ఎలా ఉండబోతోంది?

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి సుమారు 30% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేల ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రమాదం ఉంది.

3. కేరళలో లెఫ్ట్ పార్టీలకు ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యం?

త్రిపుర, బెంగాల్‌లో అధికారం కోల్పోయిన కమ్యూనిస్టులకు కేరళ ఇప్పుడు ఏకైక కోట. ఇక్కడ ఓడిపోతే జాతీయ స్థాయిలో వామపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది.

4. ఓట్ల లెక్కింపు ఎప్పుడు ప్రారంభమవుతుంది?

సాధారణంగా ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను గణిస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More