స్టాక్ మార్కెట్: ఆగస్టు నెలలో లార్జ్‌క్యాప్స్ డౌన్.. రేసులో మిడ్‌క్యాప్స్ దూకుడు

ఆగస్టు నెలలో భారతీయ ఈక్విటీ మార్కెట్ విభాగాలలో తీవ్ర వ్యత్యాసం కనిపించింది. లార్జ్‌క్యాప్ సూచీలు నష్టాల్లో కూరుకుపోగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు గెలుపు బాట పట్టాయి. మిడ్‌క్యాప్ సూచీ ఏకంగా ఆల్‌టైమ్ హై రికార్డు సాధించగా, దీర్ఘకాలిక రాబడుల్లోనూ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.

Published on: Sep 3, 2026, 10:33:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆగస్టు మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లకు ఒక భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. ప్రధాన మార్కెట్ సూచీలైన లార్జ్‌క్యాప్‌లు ఒత్తిడికి లోనైనప్పటికీ, బ్రాడర్ మార్కెట్లోని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాలు లాభపడ్డాయి. ప్రధాన సూచీలతో సంబంధం లేకుండా విశాలమైన మార్కెట్ (Broader Market) స్వతంత్రంగా రాణిస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

స్టాక్ మార్కెట్: ఆగస్టు నెలలో లార్జ్‌క్యాప్స్ డౌన్.. రేసులో మిడ్‌క్యాప్స్ దూకుడు
స్టాక్ మార్కెట్: ఆగస్టు నెలలో లార్జ్‌క్యాప్స్ డౌన్.. రేసులో మిడ్‌క్యాప్స్ దూకుడు

"ఆగస్టు మార్కెట్ విభిన్న ఫలితాలను ఇచ్చింది. లార్జ్‌క్యాప్‌లు నష్టపోగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లు లాభాలతో నెలను ముగించాయి. నిఫ్టీ 500 టీఆర్ఐ ఆరంభ స్థానానికి చేరుకుని, ఈ ఏడాదిలో కేవలం 1 శాతం మాత్రమే ప్రతికూలతలో ఉంది" అని క్యాపిటల్‌మైండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

ఆగస్టులో ఏ విభాగం ప్రదర్శన ఎలా ఉంది?

ఆగస్టు నెలకు సంబంధించి మార్కెట్ క్యాప్ విభాగాల వారీగా చూస్తే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. లార్జ్‌క్యాప్ షేర్లు తడబడగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లు ఇన్వెస్టర్లకు ఆశాజనకమైన రాబడులను ఇచ్చాయి.

  • స్మాల్‌క్యాప్ 250: 2.6 శాతం లాభపడింది.
  • మిడ్‌క్యాప్ 150: 1.8 శాతం పెరిగింది.
  • నిఫ్టీ 100: 0.9 శాతం క్షీణించింది.
  • నిఫ్టీ 50: 1.1 శాతం నష్టపోయింది.

గడిచిన ఏడాది కాలపు ప్రదర్శనను పరిశీలిస్తే, నిఫ్టీ 50 సూచీ 0.4 శాతం నష్టపోగా, నిఫ్టీ 100 దాదాపు 2 శాతం రాబడిని ఇచ్చింది. కానీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ రంగాలు వరుసగా 14.1 శాతం, 11.9 శాతం చొప్పున అద్భుతమైన రాబడులను అందించడం గమనార్హం.

దీర్ఘకాలిక దృక్పథంతో చూస్తే ఈ వ్యత్యాసం మరింత స్పష్టమవుతుంది. గత 10 ఏళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 100 సూచీలు వార్షికంగా సగటున 12 శాతం రాబడిని ఇవ్వగా.. మిడ్‌క్యాప్ విభాగం 17.5 శాతం, స్మాల్‌క్యాప్ విభాగం 15.1 శాతం మేర వార్షిక కాంపౌండెడ్ (CAGR) రాబడులను సమకూర్చాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మిడ్‌క్యాప్‌లే ఎక్కువ సంపదను సృష్టించాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

కొత్త ఆల్‌టైమ్ హై తాకిన మిడ్‌క్యాప్స్

ఆగస్టు నెలలో మిడ్‌క్యాప్ సూచీ సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. స్మాల్‌క్యాప్ సూచీ కూడా తన జీవితకాల గరిష్ఠ స్థాయికి అతిసమీపంలో (కేవలం 0.67 శాతం దూరంలో) ఉంది. అయితే లార్జ్‌క్యాప్స్ మాత్రం తమ గరిష్ఠ స్థాయిల నుంచి ఇంకా గణనీయమైన దూరంలోనే ట్రేడ్ అవుతున్నాయి.

  • నిఫ్టీ మిడ్‌క్యాప్ 150: కొత్త ఆల్‌టైమ్ హై తాకింది.
  • నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250: గరిష్ఠ స్థాయికి కేవలం 0.67 శాతం దూరంలో ఉంది.
  • నిఫ్టీ 500: గరిష్ఠ స్థాయి కంటే 2.45 శాతం దిగువన ఉంది.
  • నిఫ్టీ 100: గరిష్ఠ స్థాయికి 5.45 శాతం దిగువన కొనసాగుతోంది.
  • నిఫ్టీ 50: గరిష్ఠ స్థాయి నుంచి 7.71 శాతం కిందకు పడిపోయింది.

ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం

మార్కెట్ మొత్తం ఒకే దిశలో ప్రయాణించదనే విషయాన్ని ఈ గణాంకాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. లార్జ్‌క్యాప్ సూచీలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మిడ్‌క్యాప్‌లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కేవలం బెంచ్‌మార్క్ సూచీలనే కాకుండా, పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: ఈ విశ్లేషణ కేవలం సమాచారం, అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ముల్యాంకన రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఏవైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ సెబీ (SEBI) రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More