...
...
Next Story

Australia Student Visa : భారత విద్యార్థులకు షాకిస్తున్న ఆస్ట్రేలియా- 40శాతం వీసాలు రిజెక్ట్!

ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత దశాబ్ద కాలంలో లేనంతగా స్టూడెంట్ వీసాల తిరస్కరణ రేటు రికార్డు స్థాయికి చేరగా, భారతీయ విద్యార్థుల దరఖాస్తులే 40 శాతానికి పైగా రిజెక్ట్ కావడం గమనార్హం.

Published on: Sep 14, 2026, 05:59:22 IST
Advertisement

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి స్థిరపడాలని కలలు కనే భారతీయ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం బిగ్ షాక్ ఇస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను తిరస్కరిస్తోంది. విద్యార్థి వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా అప్డేట్స్..
ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా అప్డేట్స్..

ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2026 జూన్ నాటికి విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24.2 శాతానికి చేరింది. పదేళ్ల క్రితం, అంటే 2016 జూన్‌లో ఈ తిరస్కరణ రేటు కేవలం 7.9 శాతం మాత్రమే ఉండేది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఏకంగా 40 శాతానికి పైగా ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించడం కలకలం రేపుతోంది.

భారత్, నేపాల్ అభ్యర్థులపైనే తీవ్ర ప్రభావం..

ఈ కొత్త కఠిన నిబంధనల ప్రభావం దక్షిణాసియా దేశాల విద్యార్థులపైనే ఎక్కువగా పడుతోంది. నేపాల్ అభ్యర్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది! అక్కడ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 50 శాతానికి పైగా రిజెక్ట్ అయ్యాయి. మరోవైపు చైనా విద్యార్థుల వీసా రిజెక్షన్ రేటు కేవలం 5.8 శాతంగానే ఉండటం గమనార్హం.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుంచి ప్రతిఏటా వేలాది మంది విద్యార్థులు ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీల్లో మాస్టర్స్, డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తు చేస్తుంటారు. లక్షల రూపాయల కన్సల్టెన్సీ ఫీజులు, ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించిన తర్వాత వీసాలు నిరాకరణకు గురికావడంతో తెలుగు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి?

ఈ తనిఖీల్లో భాగంగా అభ్యర్థి స్వదేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ఎంచుకున్న కోర్సుతో భవిష్యత్ కెరీర్‌కు కలిగే ప్రయోజనం, గత విద్యార్హతలు, పూర్వపు ఇమ్మిగ్రేషన్ చరిత్రను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గతంలో చదివిన చదువుకూ, ఆస్ట్రేలియాలో ఎంచుకునే కోర్సుకూ ఎలాంటి సంబంధం లేకపోయినా లేదా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో సీటు పొందినా వీసాలను వెంటనే తిరస్కరిస్తున్నారు.

ఆస్ట్రేలియా వర్సిటీల ఆందోళన..

వీసా నిబంధనలను అతిగా కఠినతరం చేయడం వల్ల తమ దేశ విద్యా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆస్ట్రేలియాలోని ఉన్నత విద్యా సంస్థల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చర్యల వల్ల నిజమైన ప్రతిభ ఉన్న విద్యార్థులు కెనడా, యూకే లేదా ఇతర ఐరోపా దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో విద్యనభ్యసించాలనుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ ప్రక్రియలో ఎటువంటి చిన్న తప్పులు లేకుండా చూసుకోవాలని విద్యా రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 'స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్' (ఎస్​ఓపీ) స్పష్టంగా రాయాలని, తాము ఎంచుకున్న కోర్సు తమ భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుందో అధికారులకు నమ్మకం కలిగేలా వివరించాలని స్పష్టం చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks