బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్: నేడు సెప్టెంబర్ 26న బ్యాంకులు పనిచేస్తాయా?
నాలుగో శనివారం కావడంతో నేడు (సెప్టెంబర్ 26న) ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా ప్రధాన బ్యాంకుల శాఖలన్నీ మూసివేసి ఉంటాయి. అయితే సమ్మె నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 27న) బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్‌బీఐ ప్రకటించింది.
బ్యాంకులకు వెళ్లి ప్రత్యక్షంగా లావాదేవీలు నిర్వహించాలని భావిస్తున్న వినియోగదారులు నేడు (సెప్టెంబర్ 26) బ్యాంకులకు సెలవు అని గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం ప్రతినెల రెండో, నాల్గవ శనివారాల్లో బ్యాంకులకు అధికారికంగా వారంతపు సెలవు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల శాఖలు నేడు పనిచేయవు.

రేపు సేవలు అందుబాటులో..
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వరుసగా 5 రోజులు బ్యాంకింగ్ సేవలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చాయి.
రేపు ఆదివారం (సెప్టెంబర్ 27) సాధారణ సెలవు దినం అయినప్పటికీ, ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు (PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు సజావుగా పనిచేస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. నగదు డిపాజిట్లు, చెక్కుల దాఖలు వంటి అత్యవసర పనులు ఉన్నవారు రేపు బ్యాంకులకు వెళ్లి తమ పనులను పూర్తి చేసుకోవచ్చని సూచించింది.
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకింగ్ సమ్మె
వారంలో 5 రోజుల బ్యాంకింగ్ పనిదినాలు అమలు చేయడం, పెన్షన్ విధానంలో మార్పులు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సెప్టెంబర్ 28 (సోమవారం) నుంచి సెప్టెంబర్ 30 (బుధవారం) వరకు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టనున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 30న అర్ధవార్షిక ముగింపు (Half-Yearly Closing) ఉన్నందున, బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
డిజిటల్ సేవలు యథాతథం
శాఖల పరిధిలో ప్రత్యక్ష లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ, ఆన్‌లైన్ లావాదేవీలైన యూపీఐ (UPI), ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం (ATM) సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


