Bank strike : సమ్మె ఎఫెక్ట్- ఆదివారం బ్యాంకులు ఓపెన్! ముందుగానే జీతాలు? సెంటర్ ప్లాన్స్ ఇవి..
సెప్టెంబర్ ఆఖరి వారంలో బ్యాంకుల సమ్మె, వారాంతపు సెలవుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు ముందస్తు జీతాల చెల్లింపుతో పాటు సెప్టెంబర్ 27 ఆదివారం నాడు బ్యాంకులు పనిచేసేలా ఆదేశాలు జారీ చేసింది.
నాలుగో శనివారం, ఆదివారం, అనంతరం మూడు రోజుల వరకు బ్యాంకు సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు వరుసగా 5 రోజుల పాటు అంతరాయం ఏర్పడుతున్న వార్తలు ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అప్రమత్తమయ్యాయి. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు ప్రారంభించాయి.

ఆదివారం నాడు బ్యాంకులు తెరిచేందుకు ఆర్బీఐ అనుమతి!
నెల ఆఖరి వారంలో డిపాజిట్లు, నగదు ఉపసంహరణలు, ఇతర అత్యవసర లావాదేవీల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సెప్టెంబర్ 27 (ఆదివారం) నాడు అన్ని ప్రభుత్వ రంగా బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీలు) యథావిధిగా పనిచేయాలని కేంద్రం ఆదేశించింది.
"ప్రజా సంక్షేమం, కస్టమర్ల సౌకర్యార్థం ఈ సడలింపు ఇస్తున్నాం," అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఆ రోజున అన్ని బ్యాంక్ శాఖలు, ఏటీఎంలతో అనుసంధానమైన బ్రాంచ్‌లు, కరెన్సీ చెస్ట్‌లు, అధికారిక కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి మంజూరు చేసింది.
25నే కేంద్ర ఉద్యోగుల చేతికి జీతాలు, పెన్షన్లు..
సమ్మె కష్టాలు ప్రభుత్వ ఉద్యోగులపై పడకుండా ముందుజాగ్రత్తగా సెప్టెంబర్ నెల వేతనాలు, పెన్షన్లను నిర్ణీత గడువు కంటే ముందే చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన అధికారిక మెమోరాండం ప్రకారం, సాధారణంగా నెల ఆఖరి రోజు ఇచ్చే జీతాలను ఈసారి సెప్టెంబర్ 25 (శుక్రవారం) నాడే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ సదుపాయం రక్షణ, పోస్టల్, టెలికమ్యూనికేషన్ శాఖలతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. పెన్షనర్లకు కూడా అదే రోజున పింఛను అందుతుంది. ఈ ముందస్తు చెల్లింపులో ఏవైనా సర్దుబాటులు ఉంటే వాటిని అక్టోబర్ నెల జీతంలో సరిచేస్తారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో చెల్లించాల్సిన ఇతర లావాదేవీలను కూడా సాధ్యమైనంత వరకు ముందుగానే పూర్తి చేయాలని శాఖలకు సూచించారు.
బ్యాంక్ యూనియన్ల డిమాండ్లు ఇవే..
బ్యాంకింగ్ రంగంలో దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు, అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుకిపైగా యూనియన్ల కూటమి 'యూఎఫ్‌బీయూ' ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, బ్యాంకింగ్ రంగమంతటా ఏకరూప పెన్షన్ నిబంధనలను ప్రవేశపెట్టాలని, పీఎల్ఐ విధానాన్ని సవరించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా, తమ డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
కస్టమర్లు పాటించాల్సిన జాగ్రత్తలు..
ఈ 5 రోజుల వ్యవధిలో భౌతిక శాఖలలో కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశమున్నందున, కస్టమర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు కోరాయి.
"అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలను ముందే పూర్తి చేసుకోండి," అని ఎస్బీఐ తమ వినియోగదారులకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఇదే విషయమై ఇతర బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు మెసేజీలు పంపించాయి.
డిజిటల్ సేవలు: యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలు పనిచేస్తాయి.
రోజూవారీ లావాదేవీలు: చెక్కు డిపాజిట్లు, కౌంటర్ క్యాష్ విత్‌డ్రాయల్స్, డీడీలు తీసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 25 లేదా 27 నాడే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం.
ఏటీఎంలలో నగదు: సమ్మె రోజుల్లో ఏటీఎంలలో నగదు కొరత రాకుండా తగినంత భర్తీ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


