Bank of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా చోరీ? డార్క్ వెబ్‌లో 1TB సమాచారం లీక్!
Bank of Baroda data leak : బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన దాదాపు 1టీబీ మేర కీలక సమాచారం డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ భద్రంగానే ఉన్నాయని, ఒక ఉద్యోగి ఈమెయిల్ హ్యాక్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగిందని బ్యాంక్ చెబుతోంది.
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ సైబర్ దాడికి గురైందనే వార్తలు బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. బ్యాంక్‌కు చెందిన ఖాతాదారులు, అంతర్గత నిర్వహణకు సంబంధించిన దాదాపు 1 టెరాబైట్ (1టీబీ) సెన్సిటివ్ డేటా డార్క్ వెబ్‌లో ప్రత్యక్షమైందంటూ నివేదికలు బయటకు వచ్చాయి.
లీక్ అయినట్లు చెబుతున్న ఈ డేటా ఫైళ్లలో ఖాతాదారుల పేర్లు, సేవింగ్స్, కరెంట్ ఖాతాల వివరాలు, రుణాలు, నెట్ బ్యాంకింగ్ సమాచారం, ఎన్‌ఆర్‌ఐ, కార్పొరేట్ బ్యాంకింగ్ రికార్డులు, కస్టమర్ కేర్ ఫైళ్లతో పాటు శాఖలు, ఏటీఎంలకు సంబంధించిన అంతర్గత డేటా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని సాంపిల్ ఫైళ్లు కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.
ఎలా వెలుగులోకి వచ్చింది?
సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు, 'క్యాష్‌లెస్ కన్స్యూమర్' వ్యవస్థాపకుడు శ్రీకాంత్ లక్ష్మణన్ ప్రకారం, ఈ అంశం జులై 25 శనివారం రోజున వెలుగులోకి వచ్చింది. 'ransomware.live' అనే డార్క్ వెబ్ పర్యవేక్షణ వేదిక దీనిని మొదట గుర్తించింది. ప్రాథమిక తనిఖీల్లో ఆ ఫైళ్లలో బ్యాంక్ అంతర్గత నివేదికలతో పాటు ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు శ్రీకాంత్ ధ్రువీకరించారు.
హ్యాకర్లు హస్తగతం చేసుకున్న ఈ డేటా పరిమాణం దాదాపు 1టీబీ ఉంటుందని అంచనా. ఈ దాడి వెనుక 'ట్రిపుల్ ఎక్స్' అనే నూతన సైబర్ నేరస్థుల ముఠా ఉండే అవకాశం ఉందని శ్రీకాంత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పందన..
ఈ వార్తలతో కస్టమర్లలో ఆందోళన రేకెత్తడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారికంగా స్పందించింది. తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ సురక్షితంగానే ఉందనీ, దానికి ఎలాంటి విఘాతం కలగలేదని స్పష్టం చేసింది.
“మా బ్యాంక్ కోర్ సిస్టమ్స్‌లోకి ఎలాంటి అక్రమ ప్రవేశం జరగలేదు. ఒక ఉద్యోగికి చెందిన ఈమెయిల్ ఐడీ హ్యాక్ అవ్వడం వల్ల కొద్దిపాటి సమాచారానికి మాత్రమే అనధికారిక అనుమతి లభించింది. ఈ సమస్యను వెంటనే గుర్తించి, తగిన నివారణ చర్యలు చేపట్టాము,” అని సోషల్ మీడియా వేదికగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు స్పష్టం చేశారు.
అయితే బ్యాంక్ వివరణపై సైబర్ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక ఈమెయిల్ హ్యాక్ అవ్వడం ద్వారా వందల గిగాబైట్ల డేటా బయటకు వెళ్లడం సాధ్యం కాదని, బ్యాంక్ దీనిపై పూర్తి స్థాయి ఫొరెన్సిక్ రిపోర్టును వెల్లడించి, ప్రభావితమైన కస్టమర్లను అప్రమత్తం చేయాలని శ్రీకాంత్ లక్ష్మణన్ కోరారు.
‘ట్రిపుల్ ఎక్స్’ గ్రూప్ అంటే ఏంటీ?
ఇది 2026 మే నెలలో వెలుగులోకి వచ్చిన ఒక నూతన సైబర్ క్రైమ్ / డేటా ఎక్స్‌టార్షన్ ముఠా. సాధారణంగా సైబర్ నేరగాళ్లు వ్యవస్థలను లాక్ చేసి ర్యాన్సమ్‌వేర్ డిమాండ్ చేస్తుంటారు. కానీ ఈ ట్రిపుల్ ఎక్స్ ముఠా సంస్థల నుంచి భారీగా డేటాను దొంగిలించి, దాన్ని డార్క్ వెబ్‌లో లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతుంది.
గతంలో ఇండోనేషియాకు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ 'పీటీ బ్యాంక్ నెగారా ఇండోనేషియా' (బీఎన్ఐ)పై కూడా ఈ గ్రూప్ దాడి చేసి, దాదాపు 2టీబీ పరిమాణంగల కస్టమర్ రికార్డులు, కాంట్రాక్టులు, గుప్తీకరించిన అంతర్గత వివరాలను చోరీ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


