IDFC First Bank share : దూసుకెళుతున్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు- ఇప్పుడు కొనొచ్చా?
జూన్ త్రైమాసికంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ.1,075 కోట్లతో రికార్డు నికర లాభం సాధించడంతో బీఎస్‌ఈలో బ్యాంక్ షేర్ల ధర 9.48% పెరిగింది. కోర్ ఇన్కమ్ పెరగడం, మొండిబాకీలు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఐడీఎఫ్‌సీ షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. మరి ఇప్పుడు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేరు కొనాలా? వద్దా?
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ అద్భుతమైన త్రైమాసిక ఫలితాలతో స్టాక్ మార్కెట్లో అదరగొట్టింది. ఏప్రిల్-జూన్ (క్యూ1 ఎఫ్వై27) త్రైమాసికంలో కంపెనీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు ధర ఏకంగా 9.48 శాతం ఎగిసింది.

గత సెషన్‌లో రూ.80.83 వద్ద ముగిసిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు, సోమవారం ఉదయం రూ.85.70 వద్ద లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫలితాల జోరుతో ఇంట్రాడేలో ఒక దశలో గరిష్టంగా రూ.88.70 స్థాయికి చేరుకున్నాయి.
ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేరు ధర 5శాతం లాభాలతో 85.88 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్యూ1 ఫలితాలు: లాభాల్లో 132% వృద్ధి!
జులై 25న బ్యాంక్ తన మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వడ్డీ ఆదాయం పెరగడం, నిబంధనల ప్రకారం కేటాయించే ప్రొవిజన్లు తగ్గడంతో నికర లాభంలో భారీ జంప్ కనిపించింది.
నికర లాభం: గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.463 కోట్లుగా ఉన్న నికర లాభం, ఈ ఏడాది జూన్ త్రైమాసికానికి ఏకంగా 132.2 శాతం పెరిగి రూ.1,075 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ): బ్యాంక్ తీసుకునే వడ్డీలకు, ఇచ్చే వడ్డీలకు మధ్య తేడా తెలియజేసే ఎన్ఐఐ గతేడాది రూ.4,933 కోట్లు ఉండగా, ఈసారి 21 శాతం పెరిగి రూ.5,972 కోట్లకు చేరింది.
నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ (ఎన్ఐఎం): గత ఏడాది 5.71 శాతంగా ఉన్న ఎన్ఐఎమ్, ఈ త్రైమాసికంలో 25 బేసిస్ పాయింట్లు పెరిగి 5.96 శాతానికి మెరుగుపడింది.
ఆపరేటింగ్ ప్రాఫిట్: గతేడాది రూ.2,239 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధితో రూ.2,553 కోట్లకు చేరింది.
ప్రొవిజన్లు: బ్యాంక్ కేటాయించిన ప్రొవిజన్లు గతేడాది ఉన్న రూ.1,659 కోట్ల నుంచి రూ.1,144 కోట్లకు తగ్గాయి.
మెరుగైన అసెట్ క్వాలిటీ..
బ్యాంక్ మొండిబాకీలు (ఎన్‌పీఏ) కూడా గణనీయంగా తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికానికి గ్రాస్ ఎన్‌పీఏ 1.61 శాతం నుంచి 1.51 శాతానికి తగ్గగా, నెట్ ఎన్‌పీఏ 0.48 శాతం నుంచి 0.44 శాతానికి తగ్గి బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడింది.
"మేము అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన బ్యాంకింగ్ సంస్థను నిర్మిస్తున్నాము. బిజినెస్ మొమెంటమ్ చాలా బలంగా ఉంది. మా ఆస్తి నాణ్యత నిరంతరం మెరుగుపడుతుండటం సంతోషకరం. ఈ త్రైమాసికంలో సీజీఎఫ్ఎమ్‌యూ క్లెయిమ్ కింద రూ.515 కోట్లు వచ్చాయి. అయితే వర్షపాతం, ఇంధన ధరల అస్థిరత వల్ల ముందు జాగ్రత్తగా అంతే మొత్తాన్ని ప్రొవిజన్ కింద కేటాయించాము. మేము చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్లు ఇప్పుడు మెరుగైన లాభాల రూపంలో ప్రతిబింబిస్తున్నాయి," అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ వీ వైద్యనాథన్ పేర్కొన్నారు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు కొనవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
మోతీలాల్ ఓస్వాల్ : ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ స్టాక్‌కు ‘బై’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. సవరించిన టార్గెట్ ధరను రూ.90 గా నిర్ణయించింది. రాబోయే రోజుల్లో ఈ స్టాక్ 11 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఐఎన్‌వి అసెట్ పీఎమ్ఎస్ : ఐఎన్‌వీ అసెట్ బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ ప్రకారం.. బ్యాంక్ ప్రాథమికంగా బలమైన వృద్ధి బాటలో ఉన్పప్పటికీ, ఇప్పటికే 52 వారాల గరిష్ట స్థాయి రూ.87కి చేరువలో ఉందని చెప్పారు. ఫలితాలు వచ్చిన వెంటనే షేరు వెంటపడటం కంటే, స్టాక్ స్థిరపడిన తర్వాత ఎంట్రీ ఇవ్వడం మంచి రిస్క్-రివార్డ్ ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


