...
...
Next Story

Bank strike : జనవరి 27న దేశవ్యాప్త బ్యాంకు సమ్మె! ఇబ్బందుల్లో ఖాతాదారులు..

వారానికి ఐదు రోజుల పని దినాల డిమాండ్‌తో జనవరి 27న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. 24, 25, 26 తేదీలు సెలవులు కావడంతో, ఒకవేళ సమ్మె యథావిథిగా జరిగితే వరుసగా నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.

Published on: Jan 25, 2026, 09:08:21 IST
Advertisement

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక! తమ చిరకాల డిమాండ్ అయిన 'వారానికి ఐదు రోజుల పని దినాలను' వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు సిబ్బంది సంఘాలు జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఒకవేళ ఈ సమ్మె అనుకున్నట్లుగా జరిగితే, ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యకలాపాలు వరుసగా నాలుగు రోజుల పాటు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, జనవరి 24 (నాలుగో శనివారం), జనవరి 25 (ఆదివారం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా ఇప్పటికే బ్యాంకులకు సెలవులు లభించాయి.

బ్యాంకు సంఘాల సమ్మెకు కారణాలేమిటి?

27న బ్యాంకు సమ్మె..! (Bloomberg)
27న బ్యాంకు సమ్మె..! (Bloomberg)

సమ్మె వెనుక ప్రధానంగా వారానికి ఐదు రోజుల పని డిమాండ్ ఉంది. 2024 మార్చిలో జరిగిన వేతన సవరణ ఒప్పందం సమయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్​బీయూ) మధ్య ఒక అవగాహన కుదిరిందని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. ఆ ఒప్పందం ప్రకారం, అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

అయితే, ఈ నిర్ణయం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.

బ్యాంకు సంఘాల సమ్మె- సయోధ్య విఫలం..

సమ్మె నోటీసు అందిన తర్వాత, సమస్యను పరిష్కరించడానికి చీఫ్ లేబర్ కమిషనర్ బుధవారం, గురువారం బుజ్జగింపు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో ఎటువంటి సానుకూల ఫలితం రాలేదని యూనియన్లు స్పష్టం చేశాయి.

"వివరంగా చర్చించినప్పటికీ, సంప్రదింపుల ద్వారా ఎటువంటి సానుకూల పరిష్కారం లభించలేదు," అని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం వరకు ఉన్న సమాచారం ప్రకారం, యూనియన్లు సమ్మె దిశగానే ముందుకు సాగుతున్నాయి.

ఏ బ్యాంకులపై సమ్మె ప్రభావం పడుతుంది?

ఈ సమ్మె ప్రభావం ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులపై పడనుంది. సమ్మె జరిగితే సేవలకు అంతరాయం కలగవచ్చని ఇప్పటికే చాలా బ్యాంకులు తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి.

తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల ఉమ్మడి వేదికైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు కొన్ని పాత తరం ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ఆదివారంతో పాటు నెలలో రెండో, నాలుగో శనివారాలు మాత్రమే సెలవులు ఉంటున్నాయి. దీనివల్ల సంవత్సరంలో మెజారిటీ వారాలు ఆరు పని దినాలుగానే ఉంటున్నాయి.

"మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం," అని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆవేదన వ్యక్తం చేసింది. ఐదు రోజుల పని విధానం వల్ల పని గంటలు తగ్గవని, దానికి బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు తాము సిద్ధమని యూనియన్లు తెలిపాయి.

రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఎల్‌ఐసీ, స్టాక్ ఎక్స్​ఛేంజీలుస ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఐదు రోజుల పని విధానం అమల్లో ఉన్నప్పుడు, బ్యాంకులకు మాత్రమే ఆరు రోజుల షెడ్యూల్ ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks