...
...
Next Story

రేపు బ్యాంకులకు సెలవా? ఫిబ్రవరి 12న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె.. సేవలకు అంతరాయం?

ఫిబ్రవరి 12న పలు బ్యాంక్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉండగా, ప్రైవేటు బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి.

Published on: Feb 11, 2026, 16:38:17 IST
Advertisement

బ్యాంకు పనుల కోసం రేపు (గురువారం) బయటకు వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పలు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఇప్పటికే తన ఖాతాదారులను, స్టాక్ ఎక్స్ఛేంజీలను అప్రమత్తం చేసింది.

సమ్మెలో పాల్గొంటున్న సంఘాలు ఇవే..

రేపు బ్యాంకులకు సెలవా? ఫిబ్రవరి 12న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె.. సేవలకు అంతరాయం? (Photo by Indranil Bhoumik / Mint )
రేపు బ్యాంకులకు సెలవా? ఫిబ్రవరి 12న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె.. సేవలకు అంతరాయం? (Photo by Indranil Bhoumik / Mint )

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తున్నట్లు ఈ సంఘాలు ప్రకటించాయి.

బ్యాంకులకు రేపు అధికారిక సెలవా?

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 12న ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కానీ ఎలాంటి అధికారిక సెలవు ప్రకటించలేదు. ఇది కేవలం ఉద్యోగ సంఘాలు చేపట్టిన 'సమ్మె' మాత్రమే.

ప్రభుత్వ రంగ బ్యాంకులు: ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు తమ కార్యకలాపాలను సాఫీగా నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సిబ్బంది కొరత వల్ల సేవల్లో జాప్యం జరగవచ్చు.

ప్రైవేటు బ్యాంకులు: హెచ్‌డిఎఫ్‌సి (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ బ్యాంక్ మరియు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు ఈ సంఘాలలో భాగం కాదు. కాబట్టి, ఈ బ్యాంకుల్లో సేవలు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది.

సమ్మెకు ప్రధాన కారణాలు ఏమిటి?

వారానికి 5 రోజుల పని: ప్రస్తుతం బ్యాంకులకు రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే సెలవులు ఉంటున్నాయి. అయితే, అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలని, వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే దీనిపై ఐబీఏ (IBA) తో ఒప్పందం కుదిరినప్పటికీ, ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్ రాకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త లేబర్ కోడ్‌ల రద్దు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఇవి కార్మిక వర్గ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి.

గత నెలలోనూ ఇదే పరిస్థితి..

జనవరి 27న కూడా ఇదే తరహాలో దేశవ్యాప్త సమ్మె జరిగింది. అప్పట్లో రిపబ్లిక్ డే సెలవుల తర్వాత బ్యాంకులు తెరుచుకున్న వెంటనే సమ్మె జరగడంతో సాధారణ ప్రజలు నగదు ఉపసంహరణలు, ఇతర లావాదేవీల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 12న సమ్మె పిలుపునివ్వడంతో బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.

ఖాతాదారులకు సూచన: డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe