బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్

సెప్టెంబరు 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి. అంతకుముందు శని, ఆదివారాలు (సెప్టెంబరు 26, 27) కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ఖాతాదారులకు ఎస్‌బీఐ జారీ చేసిన సూచనలు, ఇతర వివరాలు ఇక్కడ పరిశీలించండి.

Published on: Sep 21, 2026, 20:44:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంక్ పనులు ఉన్న ఖాతాదారులకు కీలక హెచ్చరిక. ఈ నెల చివరి వారంలో ఏకంగా వరుసగా ఐదు రోజుల పాటు సాధారణ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే వాతావరణం నెలకొంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చింది.

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్

ఈ మూడు రోజుల సమ్మెకు సరిగ్గా ముందు సెప్టెంబరు 26 (నాలుగో శనివారం), సెప్టెంబరు 27 (ఆదివారం) వారాంతపు సెలవులు వచ్చాయి. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంక్ శాఖలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ వినియోగదారులకు కీలక సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

శాఖల పనులు ముందే పూర్తి చేసుకోండి: ఎస్‌బీఐ సూచన

బ్యాంక్ శాఖల ద్వారా సాగే ముఖ్యమైన లావాదేవీలు, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర పత్రాల సమర్పణ వంటి సేవలు అవసరమైన వినియోగదారులు సమ్మె ప్రారంభానికి ముందే పూర్తి చేసుకోవాలని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. "సమ్మె సమయంలోనూ అత్యవసర బ్యాంకింగ్ సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం" అని ఎస్‌బీఐ పేర్కొంది.

సమ్మె సమయంలో నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల కోసం ఏటీఎంలు, ఆటోమేటెడ్ డిపాజిట్ విత్‌డ్రాయల్ మెషిన్లు (ఏడీడబ్ల్యూఎమ్) అందుబాటులో ఉంటాయని తెలిపింది. డిజిటల్ లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో (YONO) యాప్, యూపీఐ, ఇతర ఆన్‌లైన్ సేవలనే వినియోగించుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. అయితే భౌతిక పత్రాలు, చెక్కుల సర్దుబాట్లు, సిబ్బంది సహాయంతో జరిగే సేవలకు తీవ్ర ఆలస్యం లేదా అంతరాయం ఏర్పడే అవకాశముంది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌పై తీవ్ర ప్రభావం

ఈ సమ్మె ప్రభావం బ్యాంకును బట్టి, ప్రాంతాన్ని బట్టి వేర్వేరుగా ఉండనుంది. బ్యాంకింగ్ రంగానికి చెందిన మెజారిటీ ఉద్యోగులు, అధికారుల సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటుండటంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీ) కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు సాధారణంగానే పనిచేసినప్పటికీ, బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీల సర్దుబాటు ప్రక్రియలో కొంత ఆలస్యం జరగవచ్చు.

ఇంతకుముందు సెప్టెంబరు 11న నిర్వహించిన ఒక రోజు దేశవ్యాప్త సమ్మె అనంతరం కూడా యాజమాన్యంతో చర్చలు సఫలం కాకపోవడంతో యూఎఫ్‌బీయూ ఈ మూడు రోజుల నిరసనకు పిలుపునిచ్చింది. సెప్టెంబరు 28-30 సమ్మెతోనూ తమ సమస్యలు పరిష్కారం కాకపోతే, అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్లు హెచ్చరించాయి.

బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు ఎందుకు దిగుతున్నారు?

బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలనేది సమ్మెలోని ప్రధాన డిమాండ్. మార్చి 8, 2024న కుదిరిన ఒప్పందంలో 5 రోజుల పనిదినాల ప్రతిపాదనపై అంగీకారం తెలిపినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు దీనిని అమలు చేయలేదని యూఎఫ్‌బీయూ తెలిపింది.

దీంతో పాటు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని ఉపసంహరించుకోవాలని లేదా ద్విపాక్షిక చర్చల ద్వారా మార్పులు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న పనిభారం, సిబ్బంది కొరత, పదేపదే పెరిగే కాంప్లయన్స్ బాధ్యతలు ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అంగీకరించిన ఇతర పెండింగ్ సర్వీసు డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని కోరుతున్నాయి.

బ్యాంక్ శాఖలకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన అత్యవసర పనులు ఉన్నవారు సెప్టెంబరు 26 కంటే ముందే పనులను ముగించుకోవడం శ్రేయస్కరం. డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, నిరంతర నగదు అవసరాల కోసం సరిపడా ప్లాన్ చేసుకోవడం మంచిది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More