...
...
Next Story

మద్యం, డ్యాన్స్‌లు: బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీల విలాసాలు.. మరో వీడియో వైరల్

బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతున్న, టీవీ చూస్తున్న వీడియోల కలకలం ఇంకా సద్దుమణగక ముందే, ఇప్పుడు మద్యం పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ తాజా వీడియోలో ఖైదీలు మద్యం తాగుతూ, స్నాక్స్ తింటూ, పాటలకు డ్యాన్స్ చేస్తూ విలాసవంతమైన పార్టీ నిర్వహించుకున్నట్లు కనిపించింది.

Published on: Nov 10, 2025, 12:06:53 IST
Advertisement

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడానికి తాజా వీడియోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, రేపిస్టులు వంటి ఖైదీలు మొబైల్ ఫోన్లు వాడుతూ, టీవీలు చూస్తున్న వీడియోలు ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జైలు నుంచే మరో వీడియో బయటికొచ్చింది.

మద్యం, డ్యాన్స్‌లు: బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీల విలాసాలు.. మరో వీడియో వైరల్ (Screengrab/X via @karnatakaportf)
మద్యం, డ్యాన్స్‌లు: బెంగళూరు సెంట్రల్ జైలులో ఖైదీల విలాసాలు.. మరో వీడియో వైరల్ (Screengrab/X via @karnatakaportf)

ఈ వీడియోలో ఖైదీలు మద్యం, స్నాక్స్‌లతో విందు చేసుకుంటూ, ఒకరితో ఒకరు నృత్యం చేస్తూ విలాసవంతమైన పార్టీ చేసుకున్న దృశ్యాలు కనిపించాయి.

పార్టీ ఏర్పాట్లు అదరహో!

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. డిస్పోజబుల్ గ్లాసులలో మద్యం, వాటి పక్కనే ప్లేట్లలో కట్ చేసిన పండ్లు, వేయించిన పల్లీలు (స్నాక్స్) చక్కగా ఏర్పాటు చేసి ఉన్నాయి. చూస్తే, ఇదొక సాధారణ పార్టీలా కనిపించింది. వీడియోలో వరుసగా నాలుగు చిన్న మద్యం సీసాలు పెట్టడం కనిపించింది. కొంతమంది ఖైదీలు పాత్రలను కొడుతూ చేసిన శబ్దాలకు డ్యాన్స్ చేశారు.

హోంమంత్రి సీరియస్: 'ఈ చెత్తను సహించను'

"దయానంద్ నుంచి నివేదిక అడిగాను. ఆ నివేదిక సంతృప్తికరంగా లేకపోతే, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటాను. ఈ చెత్తను నేను సహించను. ఇది చాలు. ఇలాంటివి మళ్లీ జరగడానికి వీల్లేదు" అని మంత్రి కఠినంగా హెచ్చరించారు.

సిబ్బంది కొరత సాకు కాదు:

జైలు అధికారుల వైఫల్యంపై మంత్రి స్పందిస్తూ.. "సిబ్బంది కొరత ఉందని వాళ్లు (జైలు అధికారులు) తరచుగా చెబుతారు. కానీ, ఉన్న సిబ్బంది అయినా సరిగ్గా తమ విధులను నిర్వర్తించాలి. సిబ్బంది కొరత అనేది సాకు కాదు. సిబ్బంది లేరనే పేరుతో ఖైదీలకు టీవీలు, మొబైల్ ఫోన్లు వంటివి ఇస్తే, దాన్ని జైలు అని ఎందుకంటారు?" అని ప్రశ్నించారు.

జైళ్లలో సీసీ కెమెరాలు, జామర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని హోంమంత్రి తెలిపారు. ఉగ్రవాదుల చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయనే వీడియోలపై ఆయన మాట్లాడుతూ, "ఉగ్రవాదుల చేతుల్లోనే కాదు, జైలులోపల ఎవరి చేతుల్లోనూ ఫోన్లు లేదా ఇతర సౌకర్యాలు ఉండకూడదు" అని స్పష్టం చేశారు.

శనివారం నుంచే జైలు అధికారులు ఈ వీడియోల ప్రామాణికతను, భద్రతా లోపాలకు బాధ్యులైన వారిని గుర్తించడానికి అంతర్గత విచారణను ప్రారంభించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks