Crime news : వెరైటీ ప్రపోజల్ అంటూ పిలిచి.. ప్రియుడిని కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసిన మహిళ!

Bengaluru crime news : ప్రేమ పేరుతో బెంగళూరులో ఒక మహిళ కిరాతకానికి ఒడిగట్టింది. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో, విదేశీ తరహాలో ప్రపోజ్ చేస్తానని నమ్మించి, కళ్లకు గంతలు కట్టి ప్రియుడిని ప్రాణాలతో తగులబెట్టిన ఘటన ఐటీ సిటీలో కలకలం రేపుతోంది.

Published on: Apr 22, 2026, 05:31:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anjanapura Murder Case : దేశంలో నేరాలు రోజురోజుకు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని సంఘటనలు చూస్తుంటే.. “చంపడంలో పీహెచ్​డీ చేశారా?” అన్నట్టు కనిపిస్తోంది. బెంగళూరులో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేరణ అనే మహిళ తన ప్రియుడు తనను పట్టించుకోవడం లేదన్న కారణంతో అత్యంత క్రూరంగా వ్యవహరించింది. సినిమా ఫక్కీలో ప్లాన్ వేసి, బాయ్​ఫ్రెండ్​ని కుర్చూకి కట్టేసి, అతనిపై ఫ్లేమెబుల్​ లిక్విడ్​ పోసి, మంట పెట్టి కాల్చేసింది. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా కనికరం లేకుండా వీడియో తీస్తూ రాక్షసానందం పొందింది!

బెంగళూరులో దారుణం- ప్రియుడిని చంపేసిన మహిళ!
బెంగళూరులో దారుణం- ప్రియుడిని చంపేసిన మహిళ!

ప్రేమ నుంచి పగ వైపు.. అసలేం జరిగింది?

బెంగళూరులోని ఒక టెలికాం స్టోర్‌లో ప్రేరణ(27), కిరణ్(27) సహోద్యోగులుగా పనిచేసేవారు. ఏడాదిన్నరగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. అయితే, గత కొన్ని రోజులుగా కిరణ్ తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, పెళ్లి విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడని ప్రేరణ అనుమానించింది. తన ప్రేమను కాదనుకుని వేరే దారి చూసుకుంటున్నాడన్న ఆమె ఆగ్రహం పగగా మారింది. ఎలాగైనా అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం పథకం ప్రకారం కిరణ్‌ను తన ఇంటికి రప్పించింది.

విదేశీ తరహా ప్రపోజల్ అంటూ నమ్మించి..

దక్షిణ బెంగళూరులోని అంజనాపురలో ఉన్న తన ఇంటికి కిరణ్‌ను ఆహ్వానించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక, కిరణ్‌కు ఒక సర్ప్రైజ్ ఇస్తానని ప్రేరణ నమ్మించింది.

"విదేశాల్లో ఇప్పుడు కొత్త తరహా ప్రపోజల్స్ ట్రెండ్ నడుస్తున్నాయి.. నేను కూడా అలాగే చేస్తాను," అని చెప్పి కిరణ్ కళ్లకు గంతలు కట్టి, ఒక కుర్చీకి గట్టిగా కట్టేసింది. కిరణ్ మొదట అభ్యంతరం చెప్పినప్పటికీ, ప్రేమగా బతిమాలడంతో ఆమె చెప్పినట్లే చేశాడు. కానీ, అదే తన చివరి నిమిషం అవుతుందని అని అతను ఊహించలేకపోయాడు.

కళ్లముందే మంటలు.. కెమెరాలో రికార్డింగ్!

కిరణ్‌ను కుర్చీకి కట్టేసిన తర్వాత, ముందుగానే సిద్ధం చేసుకున్న మండే స్వభావం గల ద్రవాన్ని (పెట్రోల్ లేదా కిరోసిన్) అతనిపై పోసింది. కిరణ్ తేరుకునేలోపే నిప్పు అంటించింది. మంటల్లో చిక్కుకున్న కిరణ్ ఆర్తనాదాలు చేస్తున్నా, ప్రేరణ మనసు కరగలేదు. పైగా, ఆ ఘోరాన్ని తన మొబైల్‌లో వీడియో తీస్తూ నిలబడింది. మంటల తీవ్రతకు కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రేరణను అదుపులోకి తీసుకున్నారు.

"నిందితురాలిని విచారించగా, కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న ఆక్రోశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడాల్సింది పోయి, వీడియో తీస్తూ చూడటం ఆమెలోని వికృత చేష్టలకు అద్దం పడుతోంది," అని డీసీపీ డీఎల్ నాగేష్ మీడియాకు వెల్లడించారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. బెంగళూరు సజీవ దహనం ఘటన ఎక్కడ జరిగింది?

ఈ ఘోర కలికలం దక్షిణ బెంగళూరులోని అంజనాపుర పరిధిలో జరిగింది. నిందితురాలు ప్రేరణ తన సొంత ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడింది.

2. నిందితురాలు, మృతుడు ఎవరు?

మృతుడిని కిరణ్ (27)గా గుర్తించారు. నిందితురాలి పేరు ప్రేరణ (27). వీరిద్దరూ ఒకే టెలికాం స్టోర్‌లో పనిచేసే సహోద్యోగులు.

3. హత్యకు గల కారణం ఏంటి?

ప్రియుడు కిరణ్ తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోకుండా తప్పించుకుంటున్నాడని ప్రేరణ అనుమానించింది. ఆ కోపంతోనే అతడిని అంతం చేయాలని ప్లాన్ చేసింది.

4. పోలీసులు నిందితురాలిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

పోలీసులు ప్రేరణను అరెస్ట్ చేసి విచారించారు. ప్రాథమిక విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం ఆమెపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More