బెంగళూరులో అద్దె ఇల్లు కావాలా? ఈ టెక్కీకి వింత అనుభవం.. రెడిట్‌లో చర్చ
ఐటీ హబ్ బెంగళూరులో అద్దె ఇల్లు వెతుకుతున్న ఓ టెక్కీకి వింత అనుభవం ఎదురైంది. ఇంటి యజమానులు జీతం స్లిప్పులు, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌తో పాటు టెన్త్ క్లాస్ మార్కుల మెమో అడగడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కొలువు సంపాదించడం కంటే అద్దె ఇల్లు వెతుక్కోవడమే పెద్ద టాస్క్‌గా మారిపోయింది. బడ్జెట్‌కు తగ్గ ఇల్లు దొరకడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత ఇంటి యజమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మరో ఎత్తు. తాజాగా నగరానికి మకాం మార్చిన ఓ యువకుడికి ఇలాంటి విచిత్రమైన అనుభవమే ఎదురైంది. ఓనర్లు అడిగే ప్రశ్నలు చూసి విసిగిపోయిన సదరు వ్యక్తి, తన గోడును 'రెడిట్' (Reddit) వేదికగా పంచుకున్నారు.

ఇంటర్వ్యూను మించిన ప్రశ్నల వర్షం
సాధారణంగా ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు ఎవరైనా ఏం పని చేస్తున్నారు, జీతం ఎంత వస్తుంది అని అడగడం సహజం. కానీ ఈ ఓనర్లు మాత్రం ఏకంగా అభ్యర్థి వ్యక్తిగత జీవితాన్ని స్కాన్ చేస్తున్నారు. పెళ్లైందా? కాకపోతే ఎప్పుడు చేసుకుంటారు? తల్లిదండ్రులు తరచుగా వస్తుంటారా? స్నేహితులు ఇంటికి వస్తారా? ఆహారపు అలవాట్లు ఏంటి? మందు, సిగరెట్ అలవాటు ఉందా? ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? ఇలా ఒకట్రెండు కాదు, ఏకంగా ఓ పెద్ద లిస్టునే ముందుంచుతున్నారు. వీటితో పాటు గత మూడు నెలల శాలరీ స్లిప్పులు, పనిచేస్తున్న కంపెనీ వివరాలు, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్, పాత ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా అడుగుతున్నారు.
"బెంగళూరులో అద్దెలు మండిపోతున్నాయి, కానీ ఓనర్ల ఇంటర్వ్యూలు మాత్రం మరో స్థాయిలో ఉన్నాయి" అని సదరు నెటిజన్ రెడిట్‌లో రాసుకొచ్చారు. అద్దెదారుల ఎంపిక ప్రక్రియ చూస్తుంటే ఇల్లు కిరాయికి తీసుకుంటున్నానా లేక ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకు అటెండ్ అవుతున్నానా అనే సందేహం కలుగుతోందని ఆయన వాపోయారు.
"ఇంత అడుగుతున్నారు కదా.. నా టెన్త్ క్లాస్ మార్కుల మెమో, బ్లడ్ గ్రూప్ సర్టిఫికెట్, పాత ఓనర్ నుంచి క్యారెక్టర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలా?" అని ఆ యువకుడు వ్యంగ్యంగా ప్రశ్నించారు.
అద్దె 35 వేలు.. అడ్వాన్స్ 10 నెలలు!
కేవలం ఇంటర్వ్యూల వరకే ఈ కష్టాలు పరిమితం కాలేదు. నెలవారీ అద్దె రూ.35,000 పైనే పలుకుతుండగా, ఏకంగా 10 నెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు నీటి బిల్లుల విషయంలో ఎలాంటి స్పష్టతా ఉండటం లేదు.
నెట్టింట భిన్న స్పందనలు
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. "నిజాయితీగా చెప్పాలంటే, 2017 నుంచి బెంగళూరులో ఉంటున్నాను. ఐదు ఇళ్లు మారినా నాకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితం గురించి ఓనర్లు ఎప్పుడూ ఆరా తీయలేదని ఆయన స్పష్టం చేశారు. స్థానికులు కాని ఓనర్ల వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని మరొకరు అభిప్రాయపడ్డారు.
అయితే, అందరు ఓనర్లు ఇలాగే ఉండరని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. ఇల్లు ఖాళీ చేసే సమయంలో తన పాత ఓనర్ కేవలం రంగులు వేయడానికి, పోగొట్టుకున్న తాళం చెవికి మాత్రమే డబ్బులు కట్ చేసుకుని మిగతా అడ్వాన్స్ మొత్తం వెనక్కి ఇచ్చేశారని, అలాంటి మంచి ఓనర్లు కూడా ఉన్నారని ఓ నెటిజన్ గుర్తుచేసుకున్నారు.
ఇలాంటి ప్రశ్నల వర్షం కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదని మరికొందరు అంటున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో ఇల్లు అద్దెకు తీసుకునే సమయంలో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, వర్క్ షెడ్యూల్, మందు అలవాట్లు, లేట్ నైట్ పార్టీల గురించి తనను ఓనర్ పదే పదే ప్రశ్నించారని ఓ నెటిజన్ చెప్పుకొచ్చారు.
న్యాయ నిపుణుల సలహా ఏంటి?
డిమాండ్‌కు తగ్గట్లుగా ఇళ్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఇల్లు దొరకడమే ఈ రోజుల్లో ఒక లగ్జరీగా మారిపోయింది.
ఇంటి ఓనర్లు అద్దెదారుల నేపథ్యాన్ని ఎంతలా పరిశీలిస్తున్నారో, అద్దెకు దిగేవాళ్లు కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. సేల్ డీడ్, ప్రాపర్టీ ట్యాక్స్ రశీదులు, ఓనర్ ఐడెంటిటీని కచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. అద్దె, డిపాజిట్, నోటీస్ పీరియడ్, మెయింటెనెన్స్ వివరాలను రెంటల్ అగ్రిమెంట్‌లో స్పష్టంగా రాసుకోవాలి.
"అద్దెకు దిగే ముందు పాత అద్దెదారులతో మాట్లాడి ఓనర్ ప్రవర్తన గురించి తెలుసుకోవడం మంచిది" అని ఓ న్యాయ నిపుణుడు హెచ్‌టీ రియల్ ఎస్టేట్‌కు వివరించారు. సరైన డాక్యుమెంటేషన్ ఉంటే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


