అచ్చుగుద్దినట్టు.. ఒరిజినల్​ ఆధార్​, పాన్​ కార్డు తయారు చేస్తున్న ఏఐ!

గూగుల్ ఏ మోడల్ 'నానో బనానా'ను ఉపయోగించి అచ్చుగుద్దినట్టు, అసలైనదిగా కనిపించే ఆధార్, పాన్ కార్డులను సృష్టించారు బెంగళూరుకు చెందిన ఒక టెక్ నిపుణుడు! ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాను కుదిపేస్తోంది. నెటిజన్లు భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. 

Published on: Nov 25, 2025, 12:21:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగళూరుకు చెందిన ఒక టెక్ నిపుణుడు గూగుల్ ‘నానో బనానా’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఉపయోగించి అచ్చుగుద్దినట్టు, నిజమైనవిగా కనిపించే పాన్, ఆధార్ కార్డులను సృష్టించారు! ఏఐ రూపొందించిన ఈ చిత్రాలను ఆయన ట్విట్టర్​లో పంచుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేయడం ఎంత సులభమో చూపించడానికి ఆయన ఈ కార్డుల ఫొటోలను షేర్​ చేశారు.

గూగుల్​ జెమినీ నానో బనానా తయారు చేసిన పాన్​ కార్డు.. (X/@HarveenChadha)
గూగుల్​ జెమినీ నానో బనానా తయారు చేసిన పాన్​ కార్డు.. (X/@HarveenChadha)

"నానో బనానా చాలా బాగుంది. ఇప్పుడు అదే సమస్య. ఇది అత్యంత కచ్చితత్వంతో నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించగలదు. పాతకాలపు చిత్ర ధృవీకరణ వ్యవస్థలు కచ్చితంగా విఫలమవుతాయి. ఇమాజినరీ వ్యక్తి పాన్, ఆధార్ కార్డుల ఉదాహరణలను షేర్​ చేస్తున్నాను," అని హర్వీన్ సింగ్ చద్దా పోస్ట్ చేశారు.

ఆయన షేర్​ చేసిన రెండు ఫొటోలు ఫేక్​ కార్డులను చూపిస్తున్నాయి. చూసిన వెంటనే అవే నిజమైనవిగా కనిపిస్తాయి! అయితే, కొంచెం లోతుగా పరిశీలిస్తే అవి నకిలీవని అర్థమవుతుంది. అలాగే, ఈ రెండింటిపైనా 'జెమినీ ఏఐ వాటర్‌మార్క్' కూడా ఉంది.

సోషల్ మీడియా ఏమంటోంది?

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలను రేకెత్తించింది. కొందరు దీని వల్ల భద్రతాపరమైన ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు.

"సింథ్‌ఐడీ అనే హిడెన్​ ఫింగర్​ప్రింట్స్​ని జెమినీ జోడిస్తుంది. వాటిని ధృవీకరించడానికి అవకాశం ఉంది. ఇది జెమినీ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది," అని ఓ నెటిజన్​ కామెంట్​ చేశారు.

కొత్తగా వచ్చిన జెమినీ 3 అప్‌డేట్‌తో, గూగుల్ ఒక చిత్రాన్ని అప్‌లోడ్ చేసి, దాన్ని జెమినీ ఉపయోగించి సృష్టించారా లేదా అని ఏఐ మోడల్‌ను అడిగే ఫీచర్‌ను జోడించింది. దీనికి చద్దా స్పందిస్తూ, "ప్రతి రుజువును జెమినీ యాప్ ద్వారా ఎవరూ స్కాన్ చేయరు" అని బదులిచ్చారు.

"ఆధార్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిజంగా ధృవీకరించే ప్రక్రియ త్వరలో సాధారణం అవుతుంది. దీనికి ఈ ఏఐ కారణం. కొత్త ఆధార్ యాప్ కూడా ప్రైవేట్ హోటళ్లు, ఇతర ప్రదేశాలు ఆధార్‌ను స్వయంగా ధృవీకరించడాన్ని సులభతరం చేస్తుంది," అని మరొకరు పేర్కొన్నారు.

"ఆధార్ కార్డుపై స్పష్టమైన చిత్రం ఉంటే, అది వెంటనే నకిలీ అని అర్థం" అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు.

"ఇది ఒక తీవ్రమైన భద్రతాపరమైన ముప్పు కానుంది. అయితే, ఇది ఏ సాంకేతిక మార్పుతోనైనా జరిగే నష్టమే," అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More