Free flight seats : విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 60 శాతం సీట్లకు ఆ ఫీజు కట్..
భారత విమానయాన రంగంలో చారిత్రాత్మక మార్పు రాబోతోంది! ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ప్రయాణికులకు ఉచితంగా కేటాయించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ అన్ని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. సీట్ల కేటాయింపులో పారదర్శకత, ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
భారతదేశంలో విమాన ప్రయాణం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. విమానయాన రంగంలో పారదర్శకతను పెంచడం, ప్రయాణికులకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ప్రతి విమానంలో మెజారిటీ సీట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేసే వీలుండదు.

కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధనల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:
60 శాతం సీట్లు ఇక ఉచితం!
ప్రస్తుతం విమానాల్లో సీట్ల కేటాయింపు (సీట్ సెలక్షన్) సమయంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు అదనపు రుసుము వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. విండో సీటు కావాలన్నా లేదా ముందు వరుసలో కూర్చోవాలన్నా ప్రయాణికులు భారీగా చెల్లించాల్సి వస్తోంది. అయితే, తాజా ఆదేశాల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా (ఫ్రీ ఆఫ్ కాస్ట్) ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి. టికెట్ బుక్ చేసుకునే సమయంలో లేదా ఆన్‌లైన్ వెబ్ చెక్-ఇన్ చేసేటప్పుడు ప్రయాణికులకు ఈ సీట్లు ఉచితంగా లభిస్తాయి.
ఒకే పీఎన్ఆర్ ఉంటే.. కలిసే కూర్చోవచ్చు!
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించే వారికి మరో తీపి కబురు. ఒకే పీఎన్ఆర్ (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) కింద టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానంలో సీట్లను కలిసే కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకే గ్రూపులో ఉన్న వారు విడివిడిగా కూర్చోవాల్సిన అవసరం లేకుండా, వీలైనంత వరకు పక్కపక్క సీట్లే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
క్రీడా సామాగ్రి, పెంపుడు జంతువులపై స్పష్టత..
విమానాల్లో క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలను తరలించే విషయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సులభతరమైన విధానాలను అమలు చేయాలని ఎయిర్‌లైన్స్‌కు సూచించింది. అలాగే, పెంపుడు జంతువులను తీసుకెళ్లే విషయంలో స్పష్టమైన పాలసీలను తమ వెబ్‌సైట్లలో పొందుపరచాలని ఆదేశించింది.
ప్రయాణికుల హక్కులు - ప్రాంతీయ భాషల్లో సమాచారం..
విమానాలు ఆలస్యమైనా, రద్దయినా లేదా బోర్డింగ్ నిరాకరించినా.. ప్రయాణికులకు లభించే పరిహారం, హక్కుల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
ఈ వివరాలను విమానయాన సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, ఎయిర్‌పోర్ట్ కౌంటర్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి.
ముఖ్యంగా, ప్రయాణికులకు అవగాహన పెంచేందుకు ఈ సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
సాధారణంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు ‘ప్రిఫర్డ్ సీట్’పేరుతో ప్రయాణికుల నుంచి వందల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ కొత్త నిబంధన వల్ల సామాన్యులకు విమాన ప్రయాణం మరింత చౌకగా మారనుంది. అయితే, ఈ 60 శాతం ఉచిత సీట్ల కేటాయింపును ఎయిర్‌లైన్స్ ఎలా అమలు చేస్తాయనేది వేచి చూడాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


