...
...
Next Story

దోషులకు బెయిల్.. మరోసారి భయంతో గుజరాత్ వీడిన బిల్కిస్ బానో కుటుంబం

2002 గుజరాత్ అల్లర్ల నాటి సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానో తన కుటుంబంతో కలిసి గుజరాత్ రాష్ట్రాన్ని విడిచిపెట్టారు. ఈ కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, తనకు మరోసారి భయం పట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Published on: Nov 17, 2026, 16:46:00 IST
Advertisement

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అత్యంత పాశవికమైన సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలతో బయటపడిన బిల్కిస్ బానో తన కుటుంబంతో కలిసి గుజరాత్ రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషుల్లో ఇద్దరికి సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన కొద్ది రోజులకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సమీప బంధువు మంగళవారం వెల్లడించారు.

భారత సర్వోన్నత న్యాయస్థానం
భారత సర్వోన్నత న్యాయస్థానం

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత నవంబర్ 2 లేదా 3 తేదీల్లో బిల్కిస్ బానో కుటుంబం గుజరాత్‌ను వీడినట్లు ఆమె మామ అబ్దుల్ రజాక్ మన్సూరి ఫోన్ ద్వారా తెలిపారు. దాహోద్ జిల్లాలోని దేవ్‌గఢ్ బారియా పట్టణంలో నివసించే మన్సూరి మాట్లాడుతూ.. సుమారు ఏడాదిన్నర క్రితం వరకు బిల్కిస్ ఆ పట్టణంలోని కాప్డి విస్తార్ ప్రాంతంలో ఉండేవారని, ఆ తర్వాత గుజరాత్‌లోని మరో ప్రాంతానికి మారారని చెప్పారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్నే విడిచిపెట్టారని, అయితే ఆమె తదుపరి ప్రణాళికల గురించి ఇతర వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

కోర్టు తీర్పుపై బిల్కిస్ బానో ఆవేదన

ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బిపిన్‌చంద్ కన్హయ్యాలాల్ జోషి (లాలా డాక్టర్), ప్రదీప్ రమణ్‌లాల్ మోధియా అనే ఇద్దరు దోషుల శిక్షను నిలిపివేస్తూ అక్టోబర్ 28న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 17 ఏళ్లుగా వారు జైల్లో ఉన్నారన్న కారణంతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలపై బిల్కిస్ బానో సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

2002 మార్చి 3న గుజరాత్ అల్లర్ల నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న సమయంలో 19 ఏళ్ల వయసులో, ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మందికి జీవిత ఖైదు పడింది.

2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం ఆ 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోగా, రెండేళ్ల క్రితం (2024లో) సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. ఈ కేసు విచారణ ముంబైకి బదిలీ అయినందున, శిక్ష తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని, గుజరాత్ ప్రభుత్వానికి లేదని అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వాస్తవాలను దాచిపెట్టి, మోసపూరితంగా 2022 నాటి ఉత్తర్వులను పొందారని తప్పుబట్టింది. కాగా, అక్టోబర్ 28న జరిగిన విచారణలో ఇద్దరు దోషుల విడుదలను గుజరాత్ ప్రభుత్వం వ్యతిరేకించడం గమనార్హం.

నా బిడ్డల కోసం మళ్లీ పోరాడతాను..

2002 దాడి జరిగినప్పటి నుంచి తాను సాగిస్తున్న న్యాయపోరాటాన్ని బిల్కిస్ బానో తన ప్రకటనలో గుర్తుచేసుకున్నారు. "బాధ, దిగ్భ్రాంతి, నమ్మలేని నిజంతో కన్నీళ్లు వస్తుండగా మాటలు పెగలడం లేదు. నన్ను పిలవకుండా, నా వాదన వినకుండా సుప్రీంకోర్టు రెండోసారి ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వార్తాపత్రికల ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది" అని ఆమె ఆవేదన చెందారు.

"నా ప్రపంచం, నా పసిబిడ్డ, నా కుటుంబం, నా ఇల్లు, మనుషులపై నాకున్న నమ్మకం అంతా నా నుంచి క్రూరంగా లాక్కున్నప్పుడు నాకు కేవలం 19 ఏళ్లు. ఆ రోజు నుంచి 24 ఏళ్లుగా నా కోసం, అన్ని చోట్లా ఉన్న మహిళల కోసం నేను న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాను. లక్షలాది మంది నాకు మద్దతుగా నిలవడం వల్లే నాలో ఇంత ధైర్యం ఉందని నాకు తెలిసింది. శిథిలమైన నా జీవితాన్ని కుటుంబం, స్నేహితుల ప్రేమతో మళ్లీ నిర్మించుకున్నాను. ప్రశాంతత కోసం తపించాను, నవ్వడం నేర్చుకున్నాను" అని బిల్కిస్ పేర్కొన్నారు.

"ఈ ఉత్తర్వులపై నేను కచ్చితంగా పోరాడతాను. జీవితాంతం ఈ భయాలతో, గాయాలతో బతకాల్సిన అవసరం లేని నా పిల్లల కోసం నేను ఈ పోరాటం చేస్తాను. బతకడానికి అర్హత ఉన్న నా మూడేళ్ల చిన్నారి సలేహా జ్ఞాపకాల కోసం, ఆమెకు న్యాయం జరగడం కోసం నేను పోరాడతాను. ఏ మహిళా, ఏ బాధితురాలూ తన జీవితాంతం న్యాయం కోసం ఇలాంటి అగ్నిపరీక్షను ఎదుర్కోకూడదు" అని బిల్కిస్ బానో తన ప్రకటనలో ఉద్వేగంగా ముగించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks