కుప్పకూలిన Bitcoin price- 75,000 డాలర్ల దిగువకు! 2018 తర్వాత ఇదే సుదీర్ఘ నష్టాల పరంపర..

క్రిప్టో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బిట్‌కాయిన్ ధర సోమవారం 75,000 డాలర్ల స్థాయి కంటే కిందకు పడిపోయింది. ఇది 2025 ఏప్రిల్​ నాటి కనిష్ఠ.

Published on: Feb 02, 2026 10:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది! కొనుగోలుదారులు కరువవ్వడం, మార్కెట్ ముమెంటం కోల్పోవడంతో బిట్‌కాయిన్ ధరలు సోమవారం (ఫిబ్రవరి 2) భారీగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్ల నమ్మకం సడలడంతో అమ్మకాల జోరు పెరిగి, ప్రధాన డిజిటల్ కరెన్సీలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి.

భారీగా పతనమైన బిట్​కాయిన్​ (Bloomberg)
భారీగా పతనమైన బిట్​కాయిన్​ (Bloomberg)

అట్టడుగు స్థాయికి బిట్‌కాయిన్..

కాయిన్‌మార్కెట్‌క్యాప్ డేటా ప్రకారం.. సోమవారం ఉదయం 9:15 గంటల సమయానికి బిట్‌కాయిన్ ధర 74,683.63 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 2025 ఏప్రిల్ తర్వాత బిట్‌కాయిన్ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. 2025లో నమోదైన గరిష్ట స్థాయిలతో పోలిస్తే, ప్రస్తుతం బిట్‌కాయిన్ ఏకంగా 40 శాతం మేర విలువను కోల్పోయింది!

కేవలం ఈ జనవరి నెలలోనే బిట్‌కాయిన్ 11 శాతం క్షీణించింది. 2025 అక్టోబర్‌లో మొదలైన ఈ పతనం వరుసగా నాలుగో నెల కూడా కొనసాగుతోంది. 2017 క్రిప్టో బూమ్ తర్వాత 2018లో వచ్చిన భారీ పతనం అనంతరం, బిట్‌కాయిన్ ఇంత సుదీర్ఘ కాలం పాటు వరుసగా నష్టపోవడం ఇదే తొలిసారి!

బిట్‌కాయిన్‌తో పాటు రెండో అతిపెద్ద కరెన్సీ ఇథిరియం కూడా 2,200 డాలర్ల కీలక స్థాయి కంటే కిందకు పడిపోయింది.

బిట్‌కాయిన్ ఎందుకు పడిపోతోంది?

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. కొనుగోలుదారుల కొరత, మార్కెట్‌లో జోరు తగ్గడంతో క్రిప్టో ఆస్తుల లిక్విడేషన్ (అమ్మకాలు) వేగవంతమైంది. డెల్టా ఎక్స్​ఛేంజ్​ రీసెర్చ్ ఎనలిస్ట్ రియా సెహగల్ అభిప్రాయం ప్రకారం.. వారాంతంలో తక్కువ లిక్విడిటీ ఉన్న సమయంలో దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన పొజిషన్లు లిక్విడేట్ కావడంతో ఈ భారీ కరెక్షన్ సంభవించింది.

గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన పతనంలా కాకుండా, ఈసారి ఎలాంటి వ్యవస్థాగత షాక్ లేదా అకస్మాత్తుగా జరిగిన మార్పులు ఏవీ లేవు. కేవలం డిమాండ్ తగ్గడం, మార్కెట్ లిక్విడిటీ క్షీణించడం వల్లే బిట్​కాయిన్​లో ఈ పరిస్థితి ఏర్పడింది.

పతనానికి దారితీసిన ప్రధాన కారణాలు..

ఈటీఎఫ్​ల నుంచి నిధుల ఉపసంహరణ: జనవరిలో అమెరికా స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్​ల నుంచి సుమారు 1.6 బిలియన్ డాలర్ల నిధులు బయటకు వెళ్లిపోయాయి. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ రిస్క్ తగ్గించుకోవడమే దీనికి కారణం.

ట్రంప్ నిర్ణయం - కెవిన్ వార్ష్ ప్రభావం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి అధ్యక్షుడిగా కెవిన్ వార్ష్‌ను డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడం మార్కెట్లను భయపెట్టింది. వార్ష్ కఠినమైన ద్రవ్య విధానాలను అనుసరిస్తారనే అంచనాతో డాలర్ పుంజుకోగా, క్రిప్టో వంటి రిస్క్ ఆస్తులపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బంగారం, వెండి ధరల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పతనానికి కూడా ఇది ఒక కారణం.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవు వద్ద పేలుడు సంభవించిందనే వార్తలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగవచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లించాయి.

బిట్​కాయిన్​- టెక్నికల్ అవుట్‌లుక్..

ప్రస్తుతానికి బిట్‌కాయిన్ 80,000 – 82,000 డాలర్ల వద్ద బలమైన రెసిస్టెన్స్​ ఎదుర్కొంటోంది. ధర మరింత తగ్గితే 72,000 – 70,000 డాలర్ల స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇథిరియం 2,500 డాలర్ల కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది, ఇది 2,000 డాలర్ల స్థాయిని మళ్లీ పరీక్షించే అవకాశం ఉంది.

స్థూల ఆర్థిక స్థిరత్వం తిరిగి వచ్చే వరకు, ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు మళ్లీ మొదలయ్యే వరకు క్రిప్టో మార్కెట్ రక్షణాత్మక ధోరణిలోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్​ చేసే ముందు సంబంధిత అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)