...
...
Next Story

Bittu Tabahi : నదిని శుభ్రం చేస్తే మళ్లీ 'చెత్త'మయం చేశారు- ఇప్పుడు 2 డస్ట్ ​బిన్లు పెడితే ఒకటి లేపేశారు!

మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నదిని శుభ్రపరిచేందుకు నెలల తరబడి శ్రమించిన 20 ఏళ్ల పర్యావరణ ప్రేమికుడు బిట్టూ తబాహికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ప్రజలు చెత్తను నదిలో వేయకుండా ఉండేందుకు ఆయన ఒడ్డున ఏర్పాటు చేసిన రెండు డస్ట్ బిన్లలో ఒకదాన్ని ఎవరో దొంగిలించారు!

Published on: Oct 18, 2026, 07:30:47 IST
Advertisement

పర్యావరణ పరిరక్షణ కోసం కొందరు తమ సమయాన్ని, శ్రమను ధారపోస్తుంటే.. మరికొందరి బాధ్యతారాహిత్యం ఆ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువ పర్యావరణ వేత్త సురేంద్ర సింగ్ చౌదరికి సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సోషల్ మీడియాలో 'బిట్టూ తబాహి' పేరుతో నెటిజన్లకు పరిచితమైన ఈ యువకుడు, స్థానిక అజ్నార్ నదిని ఎనిమిది నెలలు కష్టపడి శుభ్రం చేశాడు. కాని ప్రజలు కొన్ని వారాల్లోనే ఆ నదిని 'చెత్త'మయం చేశారు. ఇక ఇప్పుడు చెత్త వేసేందుకు బిట్టూ రెండు డస్ట్​ బిన్లు ఏర్పాటు చేయగా.. ఒకటి కనిపించడం లేదు!

నెలల శ్రమతో అజ్నార్ నది పునరుద్ధరణ..

డస్ట బిన్లు మాయం చేశారని బిట్టూ తబాహి ఆవేదన
డస్ట బిన్లు మాయం చేశారని బిట్టూ తబాహి ఆవేదన

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా గుండా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో తీవ్రంగా కలుషితమైపోయింది. ఈ నదిని కాలుష్య కోరల నుంచి కాపాడాలని సంకల్పించిన బిట్టూ తబాహి.. ఒంటరిగానే నదిని శుభ్రపరిచే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. నెలల తరబడి కష్టపడి నదిలోని టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసి దానికి కొత్త రూపునిచ్చారు. అయితే, ఆయన శ్రమను గుర్తించని కొందరు స్థానికులు మళ్లీ నదిలోనే ప్లాస్టిక్ సంచులు, వ్యర్థాలు వేయడం ప్రారంభించారు. దీనితో ఆయన రెండోసారి నదిని శుభ్రం చేయాల్సి వచ్చింది.

ప్రజల కోసం పెడితే డ్రమ్మునే ఎత్తుకెళ్లారు!

రెండోసారి నదిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత, ప్రజలు వ్యర్థాలను నేరుగా నీటిలో వేయకుండా ఉండేందుకు ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద రెండు పెద్ద డ్రమ్ములను (డస్ట్ బిన్లను) ఏర్పాటు చేశారు.

"నా స్వప్రయోజనాల కోసం కాకుండా, ప్రజలు చెత్తను ఇందులో వేస్తే నది మళ్లీ కలుషితం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే వీటిని ఇక్కడ పెట్టాను," అని బిట్టూ పేర్కొన్నారు.

కానీ, కొద్దిరోజుల తర్వాత వచ్చి చూసేసరికి ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది. అందులోని ఒక చెత్తబుట్ట మాయమైంది. కొందరు అపరిచితులు దానిని దొంగిలించారని గ్రహించిన బిట్టూ.. ఈ దారుణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "ప్రజల సౌకర్యార్థం ఉంచిన డ్రమ్ములు కూడా దొంగతనానికి గురయ్యాయి," అని ఆవేదన వ్యక్తం చేశారు.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. పోలీసుల రక్షణకు డిమాండ్!

పర్యావరణ వేత్తల శ్రమ వృథా కాకుండా ఉండాలంటే స్థానిక పోలీసులు, యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. నది ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రక్షణ చర్యలు చేపట్టకపోతే బిట్టూ తబాహి పడుతున్న శ్రమ మళ్లీ వీధులపాలవుతుందని హెచ్చరిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks