కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ముహూర్తం ఎప్పుడు?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన కార్యవర్గాన్ని ఖరారు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఈ వారంలోనే పార్టీ పునర్వ్యవస్థీకరణతో పాటు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశముంది.

Updated on: Aug 17, 2026, 16:08:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన బృందాన్ని (టీమ్ నితిన్ నబీన్) ఇప్పటికే ఖరారు చేశారు. ఈ వారంలోనే నూతన కార్యవర్గానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ముహూర్తం ఎప్పుడు?
కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ముహూర్తం ఎప్పుడు?

అనుభవానికి, యువతకు సమ ప్రాధాన్యం

నూతన కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు సమ ప్రాధాన్యం కల్పించారు. బీజేపీ 46 ఏళ్ల చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 1980 ఏప్రిల్ 6న స్థాపితమైన బీజేపీకి, ఆయన ఈ ఏడాది జనవరి 19న 12వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి పార్టీ నాయకత్వాన్ని యువత వైపు నడిపించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కూడా సంస్థాగతంగా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. కొత్త ముఖాలకు చోటు

కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులను పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి మార్చే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో, జెన్-జీ (Gen Z) అసంతృప్తిని చల్లార్చేలా అధికార పార్టీ ఈ నిర్ణయాలు తీసుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీజేపీ నిరసనల సమయంలో రాజీనామా చేసిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్టీలో కీలక పోస్టు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రులను పార్టీ బాధ్యతల్లోకి తీసుకురావడంతో ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లోనూ నూతన ముఖాలకు అవకాశం లభించనుంది.

బీజేపీ సంస్థాగత నిర్మాణం ఇలా..

బీజేపీ సంస్థాగత నిర్మాణంలో నిర్ణయాలు తీసుకునే అగ్ర శ్రేణి వ్యవస్థలు క్రింది విధంగా అమరి ఉంటాయి.

మార్గదర్శక్ మండలి (నలుగురు సభ్యులు): ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ నేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇందులో ఉన్నారు.

పార్లమెంటరీ బోర్డు (12 మంది సభ్యులు): పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ బోర్డులో నితిన్ నబీన్, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జె.పి. నడ్డా, బి.ఎస్. యడియూరప్ప, శర్వానంద సోనోవాల్, బి.ఎల్. సంతోష్ తదితరులు ఉన్నారు.

కేంద్ర ఎన్నికల కమిటీ (15 మంది సభ్యులు): అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసే ఈ కమిటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఇందులో పార్లమెంటరీ బోర్డులోని 12 మందితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ఉన్నారు.

జాతీయ కార్యవర్గం: తాజాగా జాతీయ కార్యవర్గాన్ని నితిన్ నబీన్ ప్రకటించారు. రాం మాధవ్, స్మృతీ ఇరానీ లాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

జాతీయ స్థాయి నాయకత్వ వ్యవస్థ

పార్టీ నిర్ణయాలను వేగవంతం చేసేందుకు జాతీయ స్థాయిలో స్పష్టమైన బాధ్యతలు వర్గీకృతమై ఉన్నాయి. పార్టీ అధినేతగా జాతీయ అధ్యక్షుడు అత్యున్నత కార్యనిర్వాహకుడిగా వ్యవహరిస్తారు. జాతీయ ఎగ్జిక్యూటివ్, కౌన్సిల్ విస్తృత విధానాలను రూపకల్పన చేయగా, జాతీయ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కోశాధికారులతో కూడిన ఆఫీస్ బేరర్లు రోజువారీ పరిపాలనా అంశాలను పర్యవేక్షిస్తారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More