అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విక్టరీ ఖాయం- పీపుల్స్ పల్స్ సర్వే..
ఇంకొన్ని నెలల్లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ ఖాయం అని పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది. ఎన్‌డీఏ కూటమి సులభంగా 90 సీట్ల మార్క్‌ను తాకే అవకాశం ఉందని సర్వే సూచిస్తోంది. సర్వేలోని పూర్తి వివరాలు..
ఈ ఏడాది జరగబోయే అసోం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళుతోందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్ పోల్ వెల్లడిరచింది. 2025 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించే అవకాశముందని తేలింది. ఎన్‌డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్క్‌ను తాకే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఐక్యత లేని పరిస్థితులు కమలదళానికి కలిసి వస్తాయని సర్వేలో వెల్లడయ్యింది.

పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, పొలిటికల్ ఎనలిస్ట్ డా. రాజన్ పాండే నేతృత్వంలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది.
"ఈ ట్రాకర్ పోల్ ప్రస్తుత సమయంలో అసోం ఓటర్ల మనోభావాలను ప్రతిబింబిస్తోంది. అధికార ప్రయోజనాలకే పరిమితం కాకుండా విభిన్న వర్గాలతో బీజేపీకి బలమైన అనుసంధానం ఏర్పడినట్లు ఈ సర్వే స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఏఐయుడీఎఫ్, యూపీపీఎల్ వంటి పార్టీలు మనుగడకే పోరాడుతున్న నేపథ్యంలో ఎన్‌డీఏ విజయం నల్లేరు మీద నడకలా కనిపిస్తోంది,’’ అని పోల్ స్పష్టం చేసింది.
బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం..
పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ అంచనా ప్రకారం బీజేపీ 69-74 సీట్లతో అగ్రస్థానంలో నిలవనుంది. కాంగ్రెస్‌కు 25-29 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎన్‌డీఏ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ)కు 8-11 సీట్లు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)కు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. చిన్న పార్టీలు చాలా వెనుకంజలో ఉన్నాయి. ఏఐయుడీఎఫ్ 0-2, యూపీపీఎల్ 0-2, రైజర్ దళ్ 1-2, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) 0-1, సీపీఐ(ఎం) 0-1, స్వతంత్రులు/ఇతరులు 0-1 గెలిచే అవకాశం ఉంది.
సర్వే ప్రకారం.. మ్యాజిక్ ఫిగర్ 64 సీట్ల మెజారిటీకి ఎన్‌డీఏ చాలా ఆధిక్యంలో నిలుస్తోంది. బీజేపీ మూడోసారి ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ గతంలో సాధించిన మూడు వరుస విజయాల సరసన నిలుస్తుంది. బీజేపీ తన కోర్ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూనే కొత్త వర్గాల్లోకి విస్తరించగలగడమే దీనికి కారణమని ఈ ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది.
ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 39%, కాంగ్రెస్‌కు 37% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల శాతంలో తేడా తక్కువే ఉన్నప్పటికీ.. అసోంలోని ఉత్కంఠ ఎన్నికల వాతావరణంలో ఇది సీట్ల పరంగా గణనీయమైన తేడాకు కారణం కావొచ్చు.
ఇతర పార్టీల ఓట్ షేర్లు చూస్తే... ఏజీపీ 7%, బీపీఎఫ్ 5.5%, యూపీపీఎల్ 1.2%, ఏఐయుడీఎఫ్ 2.5%, రైజర్ దళ్ 0.9%, ఏజేపీ 0.7%, సీపీఐ(ఎం) 0.8%, ఇతరులు 5% ఓట్లు పొందే అవకాశం ఉంది. ఏఐయుడీఎఫ్ నుంచి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడంతో కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగిందని, అయితే డీలిమిటేషన్, ఎన్‌డీఏ సామాజిక కూటములు, బలహీన ప్రతిపక్ష భాగస్వాములు కారణంగా తన ఓటు బ్యాంకును సీట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడుతోందని ఈ సర్వేలో వెల్లడయ్యింది.
కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
తదుపరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని సర్వేలో అడిగినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు 30% మద్దతుతో స్వల్ప ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు 28%, కాంగ్రెస్ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్‌కు 27% ఓటర్లు మద్దతిచ్చారు. దేబబ్రత సైకియా 3%, హగ్రామా మోహిలారి 1%, అతుల్ బోరా 1%, దిలీప్ సైకియా 1%, బద్రుద్దీన్ అజ్మల్ 1%, అఖిల్ గోగోయ్ 1% తో వెనకంజలో ఉన్నారు. 7% మంది ఓటర్లు తాము ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.
గౌరవ్ గోగోయ్ వ్యక్తిగత ప్రజాదరణ, సీఎం రేసులో ముందంజలో ఉన్నప్పటికీ, అది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మారలేదు. హిమంత బిశ్వ శర్మ స్వల్ప ఆధిక్యానికి.. మహిళా ఓటర్ల బలమైన మద్దతు తోడైంది. గిరిజనులు, పురుషులు ఎక్కువమంది సోనోవాల్ వైపు మొగ్గు చూపించారు.
రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ మంచిది?
అసోం రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ మంచిదన్న ప్రశ్నకు 48% బీజేపీకి, 38% కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న ప్రశ్నకు 55% బీజేపీ గెలుస్తుందని భావించగా, కాంగ్రెస్‌కు 40% మంది మద్దతు తెలిపారు. మరోసారి అవకాశం ఇవ్వాలన్న ప్రశ్నకు 55% బీజేపీకి అనుకూలంగా, 45% వ్యతిరేకంగా స్పందించారు.
అభివృద్ధి, సంక్షేమం, వివిధ వర్గాల మద్దతు, సీఎం ఎంపిక, పార్టీ ప్రదర్శన, వయస్సు, లింగ పరమైన అంశాల్లో బీజేపీ సమగ్ర ఆధిక్యం కనిపించింది. 2021 నుంచి జరిగిన మండలాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వివిధ ఉపఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తూ రావడం అసోంలో ఆ పార్టీని మరింత బలోపేతం చేశాయి. గిరిజనులు, ఓబీసీల్లో కూడా మద్దతు సంపాదించి, ఎన్‌డీఏ తన పరిధిని మరింత విస్తరించుకుంది.
కాంగ్రెస్‌కు లభించిన స్వల్ప మద్దతు కూడా ప్రధానంగా బరాక్ వ్యాలీ, లోయర్ అసోంలో ఏఐయుడీఎఫ్ నుంచి ముస్లిం ఓటర్లు మారడం వల్లే అని సర్వేలో తేలింది. వ్యాపార ప్రయోజనాలు, వివాదాస్పద కూటములపై అభిప్రాయాలతో ఏఐయుడీఎఫ్ రాజకీయంగా ఒంటరిగా మారింది. ఏజీపీ బీజేపీపై ఆధారపడుతోంది. కూటమి లేకుండా దాని పునాదులు క్షీణిస్తున్నాయి. యూపీపీఎల్ ఇటీవల బీటీఏడీ ఎన్నికల్లో బలహీన ప్రదర్శనతో మనుగడ సమస్యను ఎదుర్కొంటోంది. బోడో ఓటర్లు తిరిగి బీపీఎఫ్ వైపు మళ్లారు. బీజేపీ-బీపీఎఫ్ పునఃసమ్మేళనం బీటీఏడీ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్‌కు దారులు వేస్తున్నాయి. రైజర్ దళ్, ఏజేపీ వంటి చిన్న పార్టీలు పరిమిత ప్రభావంతోనే ఉన్నాయి.
ఏ కులం ఎటువైపు?
కులాల పరంగా చూస్తే.. అస్సామీలు ప్రధానంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తున్నారు. అహోములు సివసాగర్, జోర్హాట్ వంటి కొద్ది ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఇతర ఓబీసీలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నారు. సీఏఏ తర్వాత హిందూ బెంగాలీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ముస్లింలు అధికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ ఏఐయుడీఎఫ్‌ను తిరస్కరిస్తున్నారు. గిరిజనుల్లో ఎన్‌డీఏ పట్ల ఆకర్షణ రోజురోజుకు పెరుగుతుండగా... బోడోలు బీపీఎఫ్-బీజేపీకి, మిసింగ్స్, కార్బీలు, డిమాసాలు తదితరులు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. సంక్షేమ పథకాల వల్ల కొంతవరకు టీ తోటల సమూహాలు బీజేపీతోనే ఉన్నప్పటికీ, వారిలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.
ప్రాంతాల వారీ విశ్లేషణ..
బరాక్ వ్యాలీ (13 సీట్లు): డీలిమిటేషన్ తర్వాత ముస్లిం ప్రభావం తగ్గడంతో ఎన్‌డీఏకు 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
అప్‌పర్ అసోం: ఎన్‌డీఏ ఆధిక్యంగా ఉండగా, ప్రతిపక్షానికి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది.
మిడిల్ అసోం: గిరిజన ప్రాంతాల్లో ఎన్‌డీఏ బలంగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడుతున్నాయి.
లోయర్ అసోం: డీలిమిటేషన్ ఎన్‌డీఏకు అనుకూలంగా మారడంతో బీజేపీ-బీపీఎఫ్ బీటీఏడీ కలిసి స్వీప్ చేసే అవకాశం ఉంది.
డీలిమిటేషన్‌తో ప్రతిపక్షాలకు సమస్యలు!
2023 డీలిమిటేషన్ బీజేపీకి అనుకూలంగా మారింది. ఈ చర్యతో ముస్లిం ఓట్లను చీల్చడం సులభమైంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, అభ్యర్థుల కొరతతో ఇబ్బంది పడుతోంది. ఏఐయుడీఎఫ్ పతనం కొనసాగుతోంది. బీజేపీ సంస్థాగత బలం, సంక్షేమ లబ్ధిదారుల వర్గం దాని స్థితిని మరింత బలపరుస్తున్నాయి. హింస, ప్రముఖుల మరణాలు, ఎస్టీ డిమాండ్లు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బీజేపీ నెరిటివ్ని దెబ్బతీయలేకపోయాయి. సంక్షేమంపై ఉన్న భావనలే పైచేయిగా నిలిచాయి. బీజేపీ బలంగా పాతుకుపోవడంతో వరుసగా మూడో విజయాన్ని సాధించే అవకాశాలు సుగమయ్యాయి.
సర్వే విధానం..
క్షేత్రస్థాయి రాజకీయ, ఎన్నికల పరిశోధనలో అనుభవం కలిగి ఉన్న పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, “పర్పసివ్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్” మోడల్‌తో 45 రోజులపాటు అసోం వ్యాప్తంగా విస్తృతంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. అప్పర్ అసోం, బరాక్ వ్యాలీ, మధ్య అసోం, లోయర్ అసోం అనే నాలుగు ప్రధాన ప్రాంతాలు, రాష్ట్రంలోని ఐదు పరిపాలనా విభాగాలు, మొత్తం 35 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. రాబోయే శాసనసభ ఎన్నికలకు సుమారు నాలుగు నెలల ముందే క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో పీపుల్స్ పల్స్ రీసర్చర్లు అసోంలో 5,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.
20 మందితో పీపుల్స్ పల్స్ బృందాన్ని ప్రతి గ్రూపులో నలుగురు రీసర్చర్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. అదనంగా ఒక గ్రూపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమగ్ర వివరాలు సేకరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 నుంచి 4 రోజులు గడుపుతూ అన్ని వర్గాల ప్రజలను కలిశారు. 126 నియోజకవర్గాల్లో ప్రతి చోట 40-45 నమూనాలను ముఖాముఖి ఇంటర్వ్యూల ద్వారా సేకరించారు. మొత్తం 5,000 మంది నుంచి సమాచారం సేకరించి, కులం, మతం, వయస్సును పరిగణలోకి తీసుకుంటూ పురుషులు-మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రతిబింబించేలా ఈ నమూనా రూపొందించారు.
ప్రతి గ్రూపులో ఒకరు నియమిత ప్రశ్నావళితో ఇంటర్వ్యూలు నిర్వహించగా, మిగిలిన ముగ్గురు స్వేఛగా సంభాషణలు సాగిస్తూ మూడ్ సర్వే నిర్వహించారు. రోజుకు సగటున 15-20 గ్రూపులను ఇంటర్వ్యూ చేయగా, ప్రతి సెషన్ 25-30 నిమిషాలు కొనసాగింది. ఎన్నికలను ప్రభావితం చేసే ప్రజా సమస్యలు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనపై అభిప్రాయాలు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయాలు, అలాగే ఏజీపీ, బీపీఎఫ్, ఏఐయుడీఎఫ్, రైజర్ దళ్, ఏజేపీ, యూపీపీఎల్, సీపీఐ(ఎం) తదితర పార్టీలపై అభిప్రాయాలు సేకరించారు.
రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు, సెఫాలిజిస్టులను సంప్రదించి ఈ సర్వే ఫలితాలను ధృవీకరించారు. ఇది మరికొన్ని నెలల్ల జరగబోయే 2026 ఎన్నికలకు ముందు తొలి ట్రాకర్ పోల్ కాగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత 2026 ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో రౌండ్ నిర్వహిస్తారు.
- దిలీప్‌రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


