HR టీమ్‌ను తీసేయగానే సమస్యలన్నీ మాయమయ్యాయి: 2,500 కోట్ల కంపెనీ సీఈవో వ్యాఖ్యలు

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'బోల్ట్' సీఈఓ ర్యాన్ బ్రెస్లో తన కంపెనీలోని హెచ్ఆర్ (HR) విభాగాన్ని పూర్తిగా తొలగించి సంచలనం సృష్టించారు. అనవసరపు సమస్యలను సృష్టించడం తప్ప, హెచ్ఆర్ టీమ్ వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

Published on: May 20, 2026, 16:51:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగుల బాగోగులు చూసేందుకు, నియామకాలు చేపట్టేందుకు హెచ్ఆర్ విభాగం అత్యంత కీలకం. కానీ, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'బోల్ట్' (Bolt) కంపెనీ సీఈఓ ర్యాన్ బ్రెస్లో ఆలోచన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఫార్చ్యూన్ వర్క్‌ఫోర్స్ ఇన్నోవేషన్ సమిట్‌లో మాట్లాడిన ఆయన, తన కంపెనీ నుంచి హెచ్ఆర్ టీమ్‌ను పూర్తిగా సాగనంపినట్లు ప్రకటించారు.

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'బోల్ట్' సీఈఓ ర్యాన్ బ్రెస్లో
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'బోల్ట్' సీఈఓ ర్యాన్ బ్రెస్లో

"మా కంపెనీలో ఒక హెచ్ఆర్ టీమ్ ఉండేది. లేని సమస్యలను సృష్టించడమే వారి పనిగా ఉండేది. ఎప్పుడైతే వారిని తొలగించానో, ఆ సమస్యలన్నీ వాటంతట అవే మాయమయ్యాయి" అని 31 ఏళ్ల బ్రెస్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా కంపెనీలో పని సంస్కృతి మెరుగుపడిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

11 బిలియన్ల నుంచి 300 మిలియన్లకు.. పతనం తర్వాత కొత్త వ్యూహం

ఒకప్పుడు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 92,000 కోట్లు) విలువ పలికిన బోల్ట్ కంపెనీ, ప్రస్తుతం 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,500 కోట్లు) విలువకు పడిపోయింది. ఈ సంక్షోభం నుంచి కంపెనీని గట్టెక్కించేందుకే తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బ్రెస్లో వివరించారు.

స్టార్టప్ మోడ్: "మేము మళ్లీ స్టార్టప్ దశకు చేరుకున్నాం. పెద్ద కంపెనీలకు, ప్రశాంతంగా ఉన్న సమయాల్లో హెచ్ఆర్ అవసరం ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాకు కావాల్సింది పని చేసే వారు మాత్రమే" అని ఆయన పేర్కొన్నారు.

ఏఐ వైపు అడుగులు: 2026 ఏప్రిల్‌లో ఈ కంపెనీ తమ సిబ్బందిలో 30 శాతాన్ని తొలగించింది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దే అని, అందుకే కంపెనీని 'లీన్ అండ్ ఏఐ సెంట్రిక్'గా మారుస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

హెచ్ఆర్ వద్దు.. పీపుల్ ఆప్స్ ముద్దు

హెచ్ఆర్ అనే విభాగం నిర్ణయాలను ఆలస్యం చేస్తుందని, ఫిర్యాదులను పెంచుతుందని బ్రెస్లో అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా 'పీపుల్ ఆపరేషన్స్' (People Ops) అనే చిన్న టీమ్‌ను నియమించుకున్నట్లు తెలిపారు.

"హెచ్ఆర్ అనేది ఒక తప్పుడు ఫార్మాట్. అది పని వేగాన్ని తగ్గిస్తుంది. దానికి బదులు పీపుల్ ఆప్స్ మేనేజర్లకు అధికారాన్ని ఇస్తుంది, నిర్ణయాలను వేగవంతం చేస్తుంది" అని ఆయన గతంలో లింక్డ్‌ఇన్‌లో రాసుకొచ్చారు.

ఏమిటీ బోల్ట్ కంపెనీ?

ర్యాన్ బ్రెస్లో, ఎరిక్ ఫెల్డ్‌మన్ కలిసి 2014లో బోల్ట్ సంస్థను స్థాపించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే బ్రెస్లో తన డార్మ్ రూమ్ నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ ప్రధానంగా ఈ-కామర్స్ వ్యాపారాలకు 'సింగిల్ క్లిక్ చెక్-అవుట్' (ఒక్క క్లిక్‌తో పేమెంట్ పూర్తి చేసే) సేవలను అందిస్తుంది. అయితే, 2026 నాటికి మారిన పరిస్థితుల దృష్ట్యా కంపెనీ రూపురేఖలను పూర్తిగా మార్చేయాలని బ్రెస్లో నిర్ణయించుకున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More