నిజమైన హీరో ఇతను! సిడ్నీ కాల్పుల ఘటనలో షూటర్‌తో పోరాడాడు- లైవ్ వీడియో..
ఆస్ట్రేలియా సిడ్నీలో ఇద్దరు సాయుధులు కాల్పుల మోత మోగించారు. కాగా వారిలో ఒకరిని ఒక సామాన్యుడు అడ్డుకున్నాడు. అతడి నుంచి ఆయుధం లాక్కుని, అతనివైపే ఎక్కుపెట్టాడు! ఈ సాహసం చేసిన వ్యక్తి పేరు అహ్మద్ అల్ అహ్మద్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రజలపై ఇద్దరు సాయుధులు కాల్పులకు పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 12మంది మృతిచెందారు. అయితే, ఒక సామాన్యుడు ఈ ఉగ్రదాడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు! ఒక సాయుధుడితో ఒంటరి పోరాటం చేసి, అతడి నుంచి ఆయుధాన్ని లాక్కున్నాడు.

ఇంతటి సాహం చేసిన ఆ సామాన్యుడిని ఇప్పుడు అందరు ‘బాండీ బీచ్ హీరోగా’ కీర్తిస్తున్నారు.
బాండీ బీచ్ హీరో- వైరల్ వీడియో..
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీలో.. తెల్ల చొక్కా ధరించిన ఒక వ్యక్తి.. పార్కింగ్ లాట్లో, ఆయుధాన్ని పట్టుకున్న సాయుధుడివైపు దూసుకెళుతుండటం కనిపిస్తోంది. ఈ సాహసం చేసిన వ్యక్తిని 43 ఏళ్ల పండ్ల దుకాణ యజమాని అహ్మద్ అల్ అహ్మద్‌గా స్థానిక వార్తా సంస్థలు గుర్తించాయి.
అహ్మద్, సాయుధ వ్యక్తిని వెనుక నుంచి ఎదుర్కొని, తన చేతులతో రైఫిల్‌ను బలవంతంగా లాక్కుని, అదే ఆయుధాన్ని తిరిగి ఆ వ్యక్తి వైపు గురిపెట్టడం ఆ వీడియోలో చూడవచ్చు.
ఆ తరువాత, నల్ల చొక్కా ధరించిన ఆ సాయుధుడు ఒక బ్రిడ్జి వైపు పారిపోయాడు. అక్కడ మరొక షూటర్ ఉన్నాడు. పెద్ద సాహసం చేసిన అహ్మద్ అల్ అహ్మద్ ఆ గన్‌ను నేలపై పెట్టి దూరంగా వెళ్లినట్లు ఫుటేజీలో ఉంది.
ఆ తర్వాత బ్రిడ్జ్ మీద ఉన్న మరో షూటర్ కాల్పులు జరపడంతో అహ్మద్ అల్ అహ్మద్‌కు రెండు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టు, సర్జరీ చేయించుకుంటున్నట్టు సమాచారం.
శస్త్రచికిత్స జరుగుతున్న సెయింట్ జార్జ్ హాస్పిటల్ వెలుపల అహ్మద్ బంధువు అయిన ముస్తఫా '7న్యూస్ ఆస్ట్రేలియా'తో మాట్లాడారు. తన సోదరుడు (కజిన్) సాయుధ వ్యక్తితో పోరాడినప్పుడు, అతని పై చేయి, చేతికి బుల్లెట్ గాయాలు తగిలాయని ధృవీకరించారు.
"అతను ఆసుపత్రిలో ఉన్నాడు. లోపల ఏం జరుగుతుందో మాకు కచ్చితంగా తెలియదు. అతను బాగానే ఉంటాడని మేము ఆశిస్తున్నాము. అతను 100 పర్సెంట్ హీరో" అని ముస్తఫా అన్నారు.
మీడియా నివేదికల ప్రకారం, అహ్మద్ సిడ్నీలోని సదర్‌ల్యాండ్ షైర్‌కు చెందిన వ్యక్తి. అక్కడే స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తున్నారు.
న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ ప్రశంసలు..
ఈ సంఘటన జరిగిన న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రీమియర్ (ముఖ్యమంత్రి) క్రిస్ మిన్స్, అహ్మద్ అల్ అహ్మద్‌ను నిజమైన హీరోగా కొనియాడారు. ఈ వీడియో.. తాను చూసినదానిలో అత్యంత నమ్మశక్యం కాని దృశ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
యూదుల పండుగ అయిన హనుక్కా సందర్భంగా బీచ్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఒక నిందితుడు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిలో మూడో సాయుధ వ్యక్తి ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సిడ్నీ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. కాగా యుదులను రక్షించడంలో ఆస్ట్రేలియా విఫలమైందని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు మండిపడ్డారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


