బడ్జెట్ 2026: ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ మినరల్’ కారిడార్ల ఏర్పాటు
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దేశీయంగా సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కీలకమైన ‘రేర్ ఎర్త్’ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం భారీ వ్యూహాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక మినరల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు. దేశంలోని అరుదైన ఖనిజాల (Rare Earth Minerals) నిల్వలను వెలికితీసి, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.

₹7,280 కోట్ల భారీ ప్రోత్సాహకాలు
భారతదేశంలో రేర్ ఎర్త్ అయస్కాంతాల (Rare-earth magnets) తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ₹7,280 కోట్ల ఇన్సెంటివ్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల సహాయంతో దేశవ్యాప్తంగా ఐదు భారీ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, విక్రయించే ప్రతి కిలో అయస్కాంతంపై రాయితీలు కల్పించనున్నారు.
భారతదేశం వద్ద సుమారు 6.9 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద నిల్వల్లో ఒకటి కావడం విశేషం. అయితే, వీటి వెలికితీత, ప్రాసెసింగ్ ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది, కాలుష్యంతో కూడుకున్నది కావడంతో ఇప్పటివరకు మనం వెనుకబడ్డాం.
చైనాకు చెక్ - స్వయం సమృద్ధి దిశగా..
ఈ నిర్ణయం వెనుక బలమైన వ్యూహం ఉంది. 2025లో భారత ఆటోమొబైల్ రంగం రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడింది. ప్రపంచవ్యాప్తంగా వీటి సరఫరాలో 90% పైగా వాటా ఉన్న చైనా, 2025 ఏప్రిల్ నుంచి ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో భారత పరిశ్రమలు కుదేలయ్యాయి.
ఈ విదేశీ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి భారత్ ఇప్పుడు 'మోనాజైట్' వంటి ఖనిజాల నుంచి దేశీయంగానే సరఫరా గొలుసును (Supply Chain) నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) ఈ ఖనిజ ఆక్సైడ్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త పథకం కింద ఐఆర్ఈఎల్ సుమారు 500 టన్నుల ఆక్సైడ్లను తయారీదారులకు సరఫరా చేయనుంది.
ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఊతం
“ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటన ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఇకో సిస్టమ్‌కు ఎంతో మేలు చేస్తుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకు దేశీయంగానే వాల్యూ-చైన్ నిర్మించడానికి ఇది తోడ్పడుతుంది.” — సాకేత్ మెహ్రా, పార్ట్‌నర్, గ్రాంట్ థోర్న్టన్ భారత్
ఈ కారిడార్ల ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి పెరగడమే కాకుండా, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ రంగాలకు అవసరమైన విడిభాగాల తయారీ సులభతరం కానుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


