ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవి- ధర రూ. 20లక్షల లోపే
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2026లో ఊపందుకోనుంది! టాటా, మారుతీ సుజుకీ, టయోటా వంటి దిగ్గజ సంస్థలు రూ. 20 లక్షల బడ్జెట్ ధరలో అత్యాధునిక ఈవీలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ 2026లో భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ సరికొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా రూ. 20 లక్షల లోపు ధరలో వివిధ బ్రాండ్ల నుంచి అనేక కొత్త మోడళ్లు రాబోతున్నాయి. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటార్స్ వంటి అగ్రగామి సంస్థలు సామాన్య వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే మెరుగైన రేంజ్, అధునాతన ఫీచర్లు, సరసమైన ధరలతో ఈవీలను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 20లక్షల లోపు ధరలో, త్వరలోనే ఇండియా రోడ్ల మీద కనిపించే ఎలక్ట్రిక్ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్..
వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ నుంచి రాబోతున్న 'లిమో గ్రీన్' ఎలక్ట్రిక్ కారు.. బీవైడీ ఇ-మాక్స్ 7కు పోటీగా నిలవనుంది. ఇది 5+2 మంది ప్రయాణించగల ఎంపీవీ. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ కారులో 60.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫ్రంట్ యాక్సిల్‌పై ఉండే మోటార్ ద్వారా 201 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వియత్నాం మార్కెట్లో 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
విన్‌ఫాస్ట్ వీఎఫ్3..
చూడటానికి కాంపాక్ట్‌గా, బాక్సీ షేప్‌లో ఉండే 'విన్‌ఫాస్ట్ వీఎఫ్3' స్మార్ట్ ఈవీ ప్రియులను ఆకట్టుకోనుంది. ఇది 191 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇందులో 18.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు, ఇది 43.5 హెచ్‌పీ పవర్‌నిచ్చే మోటార్‌తో పనిచేస్తుంది. ఈ ఏడాది మధ్యలో విడుదల కానున్న ఈ కారు ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా..
టయోటా సంస్థ తాజాగా భారత మార్కెట్ కోసం 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'ను ఆవిష్కరించింది. ఇది మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌పైనే తయారైనప్పటికీ, టయోటా ప్రత్యేకమైన డిజైన్ శైలిని కలిగి ఉంటుంది. ఇందులో కూడా 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఫుల్ ఛార్జ్‌పై 543 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ ఎస్‌యూవీని ‘బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్’ విధానంలో భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్..
టాటా మోటార్స్ ఇటీవల పంచ్ మోడల్‌లో టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకుపోతున్న పంచ్ ఈవీలో కూడా త్వరలో ఇవే మార్పులు కనిపిస్తాయి. దీని ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్లు, బంపర్, అలాయ్ వీల్స్‌ను రీ-డిజైన్ చేయనున్నారు. వెనుక భాగంలో ఎల్‌ఈడీ బార్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న 25 కేడబ్ల్యూహెచ్, 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతోనే కొనసాగే అవకాశం ఉంది.
మారుతీ సుజుకీ ఈ-విటారా..
మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈ-విటారా'తో ఈవీ రంగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. 2025లో ఈ మోడల్ని సంస్థ అధికారికంగా ఆవిష్కరించింది. రానున్న నెలల్లో డెలివరీలు మొదలవుతాయి. ఈ ఎలక్ట్రిక్కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ6, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఇందులో 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది గరిష్టంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, భద్రత విషయంలో రాజీ లేకుండా దీనికి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా అందించారు.
వీటితో పాటు టాటా సియెర్రా ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్5 కూడా ఇదే ఏడాదిలో లాంచ్కానున్నాయి. వీటి ధర, రేంజ్‌పై ఆసక్తి నెలకొంది.
మరి మీరు ఏ ఎలక్ట్రిక్ కారు విషయంలో ఎగ్జైటెడ్‌గా ఉన్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


