Budget 2026 live : 7 హై స్పీడ్ రైల్ కారిడర్లు- హైదరాబాద్ కేంద్రంగా 3..
బడ్జెట్ 2026లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. 7 హైస్పీడ్ రైల్ కారిడర్లను తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. వీటిల్లో మూడు హైదరాబాద్ నుంచే ఉండటం విశేషం.
వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మౌలిక సదుపాయాల రంగంలో భారీ ప్రకటన చేశారు. దేశంలోని కీలక నగరాలను వేగంగా అనుసంధానించేలా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ 7 హైస్పీడ్ రైల్ కారిడర్లలో మూడు హైదరాబాద్ కేంద్రంగానే ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు సానుకూల విషయం.

బడ్జెట్ 2026- ప్రకటించిన 7 హైస్పీడ్ కారిడార్లు ఇవే..
ముంబై - పూణె
పూణె - హైదరాబాద్
హైదరాబాద్ - బెంగళూరు
హైదరాబాద్ - చెన్నై
చెన్నై - బెంగళూరు
బెంగళూరు - వారణాసి
వారణాసి - సిలిగురి
దేశాభివృద్ధికి చోదక శక్తులుగా నిలిచే ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా, పారిశ్రామిక వృద్ధికి కొత్త ఊతం లభించనుంది.
బడ్జెట్ 2026- దక్షిణాదికి పెద్దపీట..
ఈ తాజా ప్రకటనతో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఒక కీలక రైల్వే హబ్‌గా మారనుంది. ముఖ్యంగా పూణె, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలకు హైదరాబాద్ నుంచి హైస్పీడ్ కనెక్టివిటీ ఏర్పడటం వల్ల ఐటీ, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.
రైల్ కారిడర్లతో పాటు 5లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం కృషిచేస్తుందని నిర్మల వెల్లడించారు. ఇవి టైర్-2, టైర్-3 నగరాలని, భవిష్యత్తులో ఇవే వృద్ధి కేంద్రాలుగా నిలుస్తాయని స్పష్టం చేశారు.
రైల్వే స్టాక్స్ జంప్..
7 హైస్పీడ్ రైల్ కారిడర్ల ప్రకటన అనంతరం ఆదివారం ట్రేడింగ్ సెషన్లో రైల్వే స్టాక్స్ ఒక్కసారిగా దూసుకెళుతున్నాయి.
ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం రైల్‌టెల్ కార్పొరేషన్ స్టాక్ 4.48శాతం, టిటాగర్ రైల్ సిస్టెమ్స్ 3.2శాతం పెరిగాయి. ఐఆర్సీటీసీ స్టాక్ 2.0శాతం, రైట్స్ 2.99శాతం వృద్ధిచెందాయి.
భారత ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా నిధులు కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 12.2 లక్షల కోట్ల మేర ప్రభుత్వ మూలధన వ్యయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇది గత ఏడాది (రూ. 11.2 లక్షల కోట్లు) కంటే సుమారు 10 శాతం ఎక్కువ.
రైల్ కారిడర్‌తో పాటు మరో కీలక ప్రతిపాదన చేశారు నిర్మలా సీతారామన్. దేశంలో అరుదైన ఖనిజాల వెలికితీత, శుద్ధి, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రత్యేక 'రేర్ ఎర్త్ కారిడార్ల' ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు.
ఏంటీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్?
ఇవి పీరియాడిక్ టేబుల్‌లోని 17 రకాల ప్రత్యేక మూలకాలు. మన నిత్యజీవితంలో వాడే స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, విండ్ టర్బైన్లు, రక్షణ రంగంలో వాడే యుద్ధ విమానాల తయారీ వరకు ఇవి అత్యంత కీలకం.
ప్రస్తుతం వీటి ఉత్పత్తిలో చైనా (60% మైనింగ్, 90% రిఫైనింగ్) గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. ఈ విదేశీ ఆధారిత పరిస్థితిని మార్చి, భారత్‌ను 'ఆత్మనిర్భర్'గా మార్చడమే ఈ కారిడార్ల లక్ష్యం.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


