BYD Denza : ఇండియాలోకి బీవైడీ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్- 'డెంజా' ఎంట్రీ డేట్ ఇదే..

ప్రపంచ విద్యుత్ వాహన దిగ్గజం బీవైడీ తన అత్యంత విలాసవంతమైన ‘డెంజా’ బ్రాండ్‌ను నవంబర్ 13న భారత మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఆల్ట్రా లగ్జరీ డెంజా డీ9 ఎంపీవీ, జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు, కంపెనీ వ్యూహాలు మీకోసం..

Published on: Oct 24, 2026, 09:59:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజం ‘బీవైడీ’.. భారత లగ్జరీ ఈవీ మార్కెట్‌ను ఏలేందుకు సిద్ధమైంది! తన లగ్జరీ సబ్-బ్రాండ్ ‘డెంజా’ను నవంబర్ 13న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న లగ్జరీ వాహనాల డిమాండ్‌ను అందుకోవడమే లక్ష్యంగా బీవైడీ ఈ అడుగు వేస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో డెంజా బ్రాండ్ వ్యూహాలతో పాటు భారతదేశంలో విక్రయించబోయే మోడళ్లను, ప్రత్యేకమైన రీటైల్ నెట్‌వర్క్‌ వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

ఇండియాలోకి బీవైడీ డెంజా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్..
ఇండియాలోకి బీవైడీ డెంజా లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్..

బీవైడీ డెంజా బ్రాండ్ విశేషాలు..

డెంజా బ్రాండ్‌కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది! 2010వ సంవత్సరంలో బీవైడీ, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్-బెంజ్' సంయుక్తంగా, జాయింట్ వెంచర్‌గా దీనిని ప్రారంభించాయి. అయితే 2024 నాటికి ఈ భాగస్వామ్యం నుంచి మెర్సిడెస్ వైదొలగడంతో డెంజా ఇప్పుడు పూర్తిగా బీవైడీ చేతిలోకి వచ్చింది. ప్రస్తుతం చైనా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో ఆల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లతో డెన్జా రచ్చ చేస్తోంది. ఇప్పుడు భారత లగ్జరీ ఈవీ విభాగంలో మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

తొలి మోడల్ 'డెంజా డీ9' ఎంపీవీ!

భారత్‌లో డెంజా నుంచి రాబోతున్న తొలి మోడల్ ‘డెంజా డీ9’ అని తెలుస్తోంది. ఇదొక లగ్జరీ ఎంపీవీ. ఇటీవల హైదరాబాద్‌లోని టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తల్లో లగ్జరీ ఎంపీవీలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ప్రైవేట్ జెట్ లాంటి లగ్జరీ సీటింగ్ అనుభవాన్ని కోరుకునే వారిని ఈ కారు ఆకట్టుకోనుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎమ్, కియా కార్నివాల్, ఎంజీ ఎం9, మెర్సిడెస్ వీ-క్లాస్ కార్లకు ఇది ప్రధాన పోటీదారుగా నిలవనుంది.

డెంజా డీ9 ప్రధాన సాంకేతిక వివరాలు..

బ్యాటరీ ప్యాక్: 103 kWh భారీ బ్యాటరీ

పవర్ అండ్ టార్క్: 308 bhp హార్స్ పవర్, 360 Nm గరిష్ఠ టార్క్

డ్రైవింగ్ రేంజ్: సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 520 కిలోమీటర్ల రేంజ్ (WLTP)

స్పీడ్: కేవలం 6.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఛార్జింగ్ టెక్నాలజీ: 200 kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

అంచనా ధర: రూ.85 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశముంది.

రాకెట్ వేగంతో 'జెడ్9 జీటీ' ఎలక్ట్రిక్ సూపర్‌కారు!

డీ9 ఎంపీవీ తర్వాత డెంజా నుంచి అందించబోయే మరో సంచలనం 'జెడ్9 జీటీ'! ఇది ఫోర్-డోర్ షూటింగ్ బ్రేక్ డిజైన్‌తో వచ్చే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. భారత మార్కెట్లో ఇలాంటి బాడీ స్టైల్‌తో రానున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం.

సాంకేతికపరంగా ఇది ఒక సూపర్ పవర్​ని కలిగిన వాహనం

బ్యాటరీ అండ్ మోటార్లు: 122.5 kWh సామర్థ్యం గల బ్యాటరీకి మూడు ఎలక్ట్రిక్ మోటార్లను జత చేశారు.

భారీ పవర్: ఇది ఏకంగా 1,140 bhp అత్యధిక శక్తిని అందిస్తూ ఆల్-వీల్ డ్రైవ్‌లో పరుగులు తీస్తుంది.

స్పీడ్: 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 2.7 సెకన్లలోనే చేరుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 270 కిలోమీటర్లు.

రేంజ్ అండ్ సూపర్ ఛార్జింగ్: ఒకే ఛార్జ్‌పై 600 కిమీ ప్రయాణించవచ్చు. ఏకంగా 1,500 kW ఆల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 9 నిమిషాల్లోనే 10 నుంచి 97 శాతం వరకు ఛార్జింగ్ పూర్తి కావడం దీని మైండ్ బ్లాకింగ్ ఫీచర్

ప్రత్యేక షోరూమ్‌లతో లగ్జరీ ఎక్స్​పీరియెన్స్..

సాధారణ బీవైడీ షోరూమ్‌లలో కాకుండా, డెంజా లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి బీవైడీ ప్రణాళికలు రచిస్తోంది. మొదటి విడతలో హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబై వంటి టైర్-1, టైర్-2 నగరాల్లో ఈ షోరూమ్‌లు ప్రారంభం కానున్నాయి. కార్ల విక్రయంతో పాటు విలాసవంతమైన కస్టమర్ సర్వీస్‌ను అందించడమే ఈ బీవైడీ డెంజా బ్రాండ్ ప్రధాన వ్యూహం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More