2025లో అత్యధిక సేల్స్​ చేసిన ఆటోమొబైల్​ కంపెనీ ఏదో తెలుసా?

2025 కార్​ సేల్స్​లో మారుతీ సుజుకీ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. అయితే టాటా మోటార్స్​, హ్యుందాయ్​ సంస్థలకు షాక్​ ఇస్తూ మహీంద్రా సంస్థ రెండో స్థానాన్ని దక్కించుకుంది.

Published on: Dec 30, 2025, 10:01:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగం 2025లో ఒక చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో రెండో స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నాళ్లూ ఆ స్థానంలో పాతుకుపోయిన టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి సంస్థలను వెనక్కి నెట్టి మహీంద్రా ఈ ఘనత సాధించడం విశేషం. కేవలం ఎస్‌యూవీలపైనే దృష్టి సారించే ఒక స్వదేశీ కంపెనీ.. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లు అమ్మే దిగ్గజాలను అధిగమించడం ఇదే మొదటిసారి.

ఇండియా కార్​ సేల్స్​ 2025..
ఇండియా కార్​ సేల్స్​ 2025..

2025 కార్​ సేల్స్​- గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రభుత్వ వాహన్ పోర్టల్​లోని డిసెంబర్ 25, 2025 నాటి గణాంకాల ప్రకారం..ఎప్పటిలాగే మారుతీ సుజుకీ 17.50 లక్షల యూనిట్ల విక్రయాలతో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. మహీంద్రా ఏకంగా 5.81 లక్షల వాహనాలను రిజిస్టర్ చేసింది. ఇదే సమయంలో టాటా మోటార్స్ 5.52 లక్షల యూనిట్లు, హ్యుందాయ్ 5.50 లక్షల యూనిట్లను విక్రయించాయి.

మహీంద్రా గెలుపు సూత్రం ఇదే..

మహీంద్రా సాధించిన ఈ విజయం ఏదో అదృష్టంతో వచ్చింది కాదు! పక్కా ప్రణాళికతో వారు వేసిన అడుగులే ఈ స్థాయికి చేర్చాయి. ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్, థార్ రాక్స్ వంటి మోడళ్లు కంపెనీకి బలమైన పునాదిని వేశాయి. వీటికి తోడు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మహీంద్రా చేసిన దండయాత్ర ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బ తీసింది.

2025 ప్రారంభంలో విడుదలైన బీఈ 6, ఎక్స్​ఈవీ 9e మోడళ్లు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు మోడళ్లు కలిపి ఇప్పటివరకు 38,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. తన సొంత ఇన్​గ్లో ఆర్కిటెక్చర్ పై మహీంద్రా పెట్టుకున్న నమ్మకం ఫలించిందని ఈ విక్రయాలే నిరూపిస్తున్నాయి. ఇదే ఊపులో నవంబర్ 2025లో ఎక్స్​ఈవీ 9ఎస్​ పేరుతో 7-సీటర్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా సంస్థ పరిచయం చేసింది. రూ. 19.95 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారు, తన అత్యాధునిక ట్రిపుల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌తో టెక్ ప్రియులను కట్టిపడేస్తోంది. ఈ ఈవీకి మంచి స్పందన లభిస్తోంది. 2026లో ఈ ఈవీ సేల్స్​ ఊపందుకుని కంపెనీ సేల్స్​కో ఊతమిచ్చే అవకాశం ఉంది.

అంతేకాదు 2026లో కొత్త ప్రాడక్ట్స్​ని తీసుకొచ్చేందుకు సంస్థ రెడీ అవుతోంది. మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ (ఇది ఎక్స్​యూవీ 700కి ఫేస్​లిఫ్ట్​), మహీంద్రా విజన్​ ఎస్​ వంటి ఎస్​యూవీలు లాంచ్​కు అవుతున్నాయి.

పోటీలో వెనుకపడ్డ ప్రత్యర్థులు..

నాలుగో త్రైమాసికంలో టాటా కర్వ్, టాటా నెక్సాన్ అప్‌డేటెడ్ వెర్షన్లతో పుంజుకున్నప్పటికీ, మహీంద్రా దూకుడు ముందు టాటా మోటార్స్ నిలవలేకపోయింది. ఎలక్ట్రిక్ విభాగంలో టాటాకు మంచి పట్టు ఉన్నప్పటికీ, పెట్రోల్/డీజిల్ ఇంజిన్ వాహనాల విక్రయాల్లో మహీంద్రా రెండంకెల వృద్ధిని సాధించడం విశేషం.

మరోవైపు, కొన్నేళ్లుగా రెండో స్థానంలో కొనసాగుతున్న హ్యుందాయ్ ఈసారి అనూహ్యంగా నాలుగో స్థానానికి పడిపోయింది. ఇది కంపెనీకి షాక్​ ఇచ్చే విషయమే.

మొత్తానికి 2025 ఏడాది మహీంద్రా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. భారతీయ వినియోగదారుల మారుతున్న అభిరుచులను, ముఖ్యంగా ఎస్‌యూవీల పట్ల పెరుగుతున్న మక్కువను మహీంద్రా సరిగ్గా అందిపుచ్చుకుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More