CAT 2026 Notification : క్యాట్ 2026 నోటిఫికేషన్ ఔట్- రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీలు..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) క్యాట్ 2026 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 29న మూడంచెల విడతల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాలు..
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలైన 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్' (ఐఐఎం)లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే 'కామన్ అడ్మిషన్ టెస్ట్' (క్యాట్ 2026) షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. 2026 నవంబర్ 29న (ఆదివారం) ఈ రాత పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఐఐఎం వర్గాలు ప్రకటించాయి. ప్రతిష్టాత్మక ఐఐఎంలలో ఎంబీఏ, ఇతర మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే ఆశావాహులు ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. నవంబర్ 29న మొత్తం మూడు షిఫ్టుల్లో (సెషన్లలో) ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ క్యాట్ 2026 పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 15న సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను నవంబర్ 4 నుంచి నవంబర్ 29న పరీక్ష ముగిసే వరకు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐఎం స్పష్టం చేసింది.
క్యాట్ 2026: విద్యా అర్హతలు ఇవే!
క్యాట్ 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులు లేదా సమానమైన సీజీపీఏ (CGPA)తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
రిజర్వ్‌డ్ కేటగిరీలు: ఎస్సీ , ఎస్టీ. దివ్యాంగులకు డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
చివరి సంవత్సరం విద్యార్థులు: డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, ఎంపికైన పక్షంలో నిబంధనల ప్రకారం నిర్దేశిత తేదీ నాటికి తమ డిగ్రీ పూర్తయినట్లు కళాశాల లేదా యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
వృత్తిపరమైన విద్యార్హతలు: సీఏ, సీఎస్, సీఎమ్‌ఏ లేదా ‘ఫెలో ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చువరీస్ ఆఫ్ ఇండియా’ వంటి వృత్తిపరమైన కోర్సులు పూర్తి చేసి, కనీస మార్కుల అర్హత ఉన్న వారు కూడా ఈ పరీక్షకు అర్హులే.
క్యాట్ 2026- దరఖాస్తు ఫీజు వివరాలు..
క్యాట్ 2026 రిజిస్ట్రేషన్ ఫీజును ఐఐఎం నిర్దేశించింది:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు: రూ. 1,350
ఇతర అభ్యర్థులందరికీ (ఓపెన్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్): రూ. 2,700
అభ్యర్థి ఎన్ని ఐఐఎంలకు లేదా పాల్గొనే ఇతర మేనేజ్‌మెంట్ సంస్థలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ ఫీజును ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ కుల/దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ఒక్కసారి చెల్లించిన దరఖాస్తు ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వరు.
క్యాట్ 2026- పరీక్ష నగరాల ఎంపిక..
దరఖాస్తు ప్రక్రియ సమయంలో అభ్యర్థులు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదు పరీక్షా నగరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ప్రాధాన్యత, సీట్ల లభ్యత ఆధారంగా అందులో ఒక నగరాన్ని కేటాయిస్తారు. ఒకవేళ అభ్యర్థి ఎంచుకున్న నగరాల్లో సీట్లు అందుబాటులో లేకపోతే, సమీపంలో ఉన్న వేరే నగరాన్ని కేటాయిస్తారు.
దేశవ్యాప్తంగా దాదాపు 170కి పైగా నగరాల్లో ఈ క్యాట్ 2026 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థికి కేటాయించిన పరీక్ష కేంద్రం పూర్తి వివరాలు అడ్మిట్ కార్డ్‌లో పొందుపరుస్తారు.
క్యాట్ 2026- ఫలితాలు. స్కోర్ చెల్లుబాటు..
క్యాట్ 2026 ఫలితాలు 2027 జనవరి మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక ఐఐఎం క్యాట్ వెబ్‌సైట్ నుంచి తమ స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల సమాచారం ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా కూడా అభ్యర్థులకు అందుతుంది. క్యాట్ 2026 సాధించిన స్కోర్ 2027 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది.
అడ్మిషన్ ప్రక్రియ..
ఐఐఎంలలో మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశానికి క్యాట్ స్కోర్ ప్రాథమిక కొలమానంగా ఉపయోగపడుతుంది. అయితే, ప్రతి ఐఐఎం తన సొంత ఎంపిక విధానం, ప్రవేశ నిబంధనలను కలిగి ఉంటుంది.
క్యాట్ రాత పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు అభ్యర్థి గత విద్యా అర్హతల మార్కులు (10వ తరగతి, ఇంటర్, డిగ్రీ), పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేస్తాయి. కేవలం కనీస విద్యా అర్హతలు సాధించినంత మాత్రాన అడ్మిషన్‌కు ఎంపికైనట్లు కాదని గుర్తుంచుకోవాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


