CBSE exams 2026 : క్లాస్​ 12 పరీక్షలకు ముందు.. సీబీఎస్​ఈ నుంచి బిగ్​ అప్డేట్​!

బోర్డు పరీక్షల మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది సీబీఎస్ఈ. 2026 నుంచి 12వ తరగతి సమాధాన పత్రాలను 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్​ఎం) విధానంలో డిజిటల్‌గా దిద్దాలని నిర్ణయించింది. దీనివల్ల ఫలితాల వెల్లడిలో వేగం, పారదర్శకత పెరుగుతాయని బోర్డు చెబుతోంది.

Published on: Feb 10, 2026, 10:45:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​) బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ 2026 విద్యా సంవత్సరం నుంచే 12వ తరగతి బోర్డు పరీక్షల పేపర్లను ఆన్‌లైన్ విధానంలో (ఆన్​-స్క్రీన్​ మార్కింగ్​) దిద్దనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే (భౌతికంగా) మూల్యాంకనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సీబీఎస్​ఈ నుంచి బిగ్​ అప్డేట్​.. (HT_PRINT)
సీబీఎస్​ఈ నుంచి బిగ్​ అప్డేట్​.. (HT_PRINT)

సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు 2026- ఏంటీ ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్?

ఈ పద్ధతిలో విద్యార్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మారుస్తారు. ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్‌పైనే ఆ పత్రాలను చూస్తూ మార్కులు వేస్తారు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..

తప్పులకు తావుండదు: మార్కుల లెక్కింపులో (టోటలింగ్​) మనుషుల వల్ల జరిగే పొరపాట్లు పూర్తిగా తొలగిపోతాయి.

వేగవంతమైన ఫలితాలు: మాన్యువల్ పద్ధతి కంటే ఇది వేగంగా పూర్తవుతుంది. ఫలితంగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఉండదు.

టీచర్లకు వెసులుబాటు: ఉపాధ్యాయులు తమ సొంత స్కూళ్ల నుంచే మూల్యాంకనం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల సాధారణ బోధన పనులకు ఆటంకం కలగదు.

వెరిఫికేషన్ అవసరం ఉండదు: డిజిటల్ పద్ధతిలో మార్కులు వేయడం వల్ల, ఫలితాల తర్వాత మళ్లీ రీ-వెరిఫికేషన్ లేదా మార్కుల లెక్కింపు కోసం దరఖాస్తు చేసుకునే అవసరం ఉండదని బోర్డు పేర్కొంది.

సీబీఎస్​ఈ పరీక్షలు 2026- స్కూళ్లకు బోర్డు ఆదేశాలు..

ఈ నూతన విధానానికి అనుగుణంగా పాఠశాలలు తమ కంప్యూటర్ ల్యాబ్‌లను సిద్ధం చేసుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. కనీసం 4జీబీ ర్యామ్, విండోస్ 8 అంతకంటే పై వెర్షన్ ఉన్న సిస్టమ్స్, కనీసం 2 ఎంబీపీఎస్​ ఇంటర్నెట్ వేగం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు ఉండాలని స్పష్టం చేసింది.

అంతేకాదు, ఉపాధ్యాయులకు ఈ కొత్త సిస్టమ్‌పై పట్టు వచ్చేలా సీబీఎస్​ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. ట్రైనింగ్ వీడియోలతో పాటు ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తోంది.

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం భారత్ సహా 26 దేశాల్లో సుమారు 46 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ భారీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More