Census 2027 : భారతదేశ జనాభా గణన (సెన్సస్ 2027) ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' అనే సరికొత్త సౌకర్యాన్ని ఏప్రిల్ 1, 2026 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయిచే, ఈ ప్రక్రియపై చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. అసలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి? సామాన్యులు దీనిని ఎలా ఉపయోగించుకోవాలి? అన్న అంశాలపై సమగ్రమైన ఎఫ్ఏక్యూ కథనం మీ కోసం..
సెల్ఫ్ ఎన్యూమరేషన్: ప్రాథమిక అంశాలు..

1. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటి?
సాధారణంగా ప్రభుత్వం నియమించిన జనాభా లెక్కల అధికారి (ఎన్యూమరేటర్) ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. అలా కాకుండా, మీ వివరాలను మీరే స్వయంగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా నమోదు చేయడాన్నే 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' అంటారు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతి.
2. దీనివల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
సౌలభ్యం: ఎన్యూమరేటర్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ ఖాళీ సమయంలో వివరాలు నింపవచ్చు.
కచ్చితత్వం: మీ సమాచారాన్ని మీరే టైప్ చేస్తారు కాబట్టి అక్షర దోషాలు లేదా తప్పుడు సమాచారం నమోదు అయ్యే అవకాశం ఉండదు.
గోప్యత: వ్యక్తిగత వివరాలను నేరుగా ప్రభుత్వ సర్వర్‌కు పంపడం వల్ల ప్రైవసీ పెరుగుతుంది.
సమయం ఆదా: ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు మళ్లీ వివరాలన్నీ చెప్పాల్సిన పని ఉండదు. కేవలం వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది.
3. ఎవరెవరు ఈ విధానంలో వివరాలు నమోదు చేయవచ్చు?
కేవలం సాధారణ కుటుంబాలు మాత్రమే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోగలవు. వసతి గృహాల్లో ఉండేవారు లేదా ఇళ్లు లేని వారు ఈ సౌకర్యాన్ని వాడుకోవడానికి వీలుండదు. వారికి ఎన్యూమరేటర్లే నేరుగా వచ్చి వివరాలు సేకరిస్తారు.
4. విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌరులు ఈ పోర్టల్ వాడొచ్చా?
{{/usCountry}}4. విదేశాల్లో ఉంటున్న భారతీయ పౌరులు ఈ పోర్టల్ వాడొచ్చా?
{{/usCountry}}లేదు. ఈ పోర్టల్ కేవలం భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
జనాభా లెక్కలు 2027- సెల్ఫ్ ఎన్యూమరేషన్ : నమోదు ప్రక్రియ, ఇతర వివరాలు
5. ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వడం ఎలా?
మొదట సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్‌లో మీ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం పేరును ఎంచుకోవాలి.
క్యాప్చా వెరిఫికేషన్ తర్వాత, ఇంటి యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ (ఐచ్ఛికం) నమోదు చేయాలి.
మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి, మీకు నచ్చిన భాషను ఎంచుకుని ప్రక్రియను ప్రారంభించవచ్చు.
6. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏ భాషల్లో అందుబాటులో ఉంటుంది?
ప్రస్తుతానికి ఇంగ్లీష్‌తో పాటు తెలుగు సహా మొత్తం 15 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేసే అవకాశం ఉంది.
7. వివరాలు సబ్మిట్ చేశాక వచ్చే 'SE ID' ఎందుకు ముఖ్యం?
మీరు సమాచారాన్ని సబ్మిట్ చేసిన తర్వాత 11 అంకెల విశిష్ట సంఖ్య (SE ID) జనరేట్ అవుతుంది. దీనిని మీరు భద్రపరుచుకోవాలి. ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చూపిస్తే, వారు మీ వివరాలను సులభంగా వెరిఫై చేస్తారు. ఒకవేళ మీరు ఈ ఐడీ చెప్పలేకపోతే, ఎన్యూమరేటర్ మళ్లీ వివరాలన్నీ అడిగి నమోదు చేయాల్సి ఉంటుంది.
8. సమాచారాన్ని సబ్మిట్ చేశాక మార్చుకునే (ఎడిట్) అవకాశం ఉందా?
మీరు ఫామ్ పూర్తి చేసేటప్పుడు 'డ్రాఫ్ట్'గా సేవ్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసే వరకు ఎన్నిసార్లైనా మార్పులు చేయవచ్చు. కానీ ఒకసారి సబ్మిట్ చేశాక లేదా గడువు ముగిశాక మార్పులు చేయలేరు. అప్పుడు కేవలం ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే వారి ద్వారా సవరణలు చేయించుకోవచ్చు.
9. ఆన్‌లైన్‌లో నింపినా కూడా ఎన్యూమరేటర్ ఇంటికి వస్తారా?
అవును. మీరు ఆన్‌లైన్‌లో వివరాలు నింపినప్పటికీ, ఎన్యూమరేటర్ కచ్చితంగా మీ ఇంటికి వస్తారు. అయితే వారు కేవలం మీ SE ID ని వెరిఫై చేసి, భవనం నంబర్ వంటి కొన్ని అదనపు వివరాలను జోడించి ప్రక్రియను పూర్తి చేస్తారు.
10. నా వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందా?
ఖచ్చితంగా. జనగణన కోసం మీరు ఇచ్చే డేటా అంతా ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటుంది. అత్యంత పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ సర్వర్లలో ఈ డేటా నిక్షిప్తమవుతుంది. దీనికోసం మీరు ఎటువంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
11. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కచ్చితంగా చేసుకోవాలా?
లేదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ లేకపోయినా ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు జనాభా లెక్కల కోసం మీ వివరాలను వెల్లడించవచ్చు.