డీఏ పెంపుతో జీతంలో ఎవరికి ఎంత పెరగనుంది.. ఇవిగో లెక్కలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) 3 శాతం పెరిగింది. జులై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయంతో డీఏ 60 శాతం నుండి 63 శాతానికి చేరింది. మూల వేతనం ఆధారంగా జీతాలు ఎంత పెరుగుతాయో, బకాయిలు ఎలా అందుతాయో వివరించే కథనం.

Published on: Oct 28, 2026, 16:50:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ వేళ భారీ ఊరట లభించింది. పెరిగిన ధరల భారాన్ని తట్టుకునేందుకు వీలుగా కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనాన్ని (డీఆర్) 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 48 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది.

డీఏ పెంపు తదితర అంశాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Naveen Sharma)
డీఏ పెంపు తదితర అంశాలను వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Naveen Sharma)

60 శాతం నుంచి 63 శాతానికి పెంపు

తాజా సవరణతో కేంద్ర ఉద్యోగుల డీఏ ప్రస్తుతం ఉన్న 60 శాతం నుంచి 63 శాతానికి చేరుకుంటుంది. 7వ వేతన సంఘం (7th Pay Commission) నిబంధనల ప్రకారం డీఏను కేవలం మూల వేతనం (Basic Pay) ప్రాతిపదికన మాత్రమే లెక్కిస్తారు. ఇంటి అద్దె అలవెన్స్ (HRA), రవాణా అలవెన్స్ (TA) వంటి ఇతర భత్యాలను ఇందులో చేర్చరు.

ఉద్యోగుల మూల వేతనాన్ని బట్టి ప్రతి నెలా వచ్చే అదనపు లబ్ధి మారుతుంది. బేసిక్ పే ఎక్కువగా ఉన్నవారికి నెలావారీ డీఏ పెంపు మొత్తం అదే నిష్పత్తిలో పెరుగుతుంది.

బేసిక్ పే ఆధారంగా జీతాల పెంపు లెక్కలు

3 శాతం డీఏ పెంపు ద్వారా ఏ స్థాయి ఉద్యోగికి ఎంత లబ్ధి చేకూరుతుందో కొన్ని ఉదాహరణల ద్వారా పరిశీలిద్దాం:

  • ₹18,000 మూల వేతనం: నెలకు అదనంగా ₹540 పెరుగుతుంది.
  • ₹35,000 మూల వేతనం: గతంలో 60% ప్రకారం డీఏ ₹21,000 ఉండేది. ఇప్పుడు 63% పెంపుతో అది ₹22,050కి చేరుతుంది. అంటే నెలకు ₹1,050 చొప్పున ఏడాదికి ₹12,600 అదనంగా లభిస్తుంది.
  • ₹50,000 మూల వేతనం: నెలకు అదనంగా ₹1,500 పెరుగుతుంది.

(గమనిక: ఈ అదనపు మొత్తం కేవలం డీఏ పెంపునకు మాత్రమే వర్తిస్తుంది. పిఎఫ్, పన్ను మినహాయింపులు వంటి ఇతర సర్దుబాట్ల ఆధారంగా చేతికి అందే నికర జీతం మారవచ్చు.)

జులై నుంచే అమలు.. 4 నెలల బకాయిలు

ఈ సవరించిన డీఏ రేట్లు 2026 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఉద్యోగులకు జులై నుంచి అక్టోబర్ వరకు 4 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు (Arrears) లభిస్తాయి.

ఉదాహరణకు, ₹18,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు ₹540 చొప్పున నాలుగు నెలలకు కలిపి మొత్తం ₹2,160 బకాయిల రూపంలో అందుతాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే చెల్లింపుల షెడ్యూల్ ఖరారు కానుంది.

ఏడాదికి రెండుసార్లు డీఏ సవరణ

ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏటా రెండుసార్లు డీఏను సవరిస్తుంది. ప్రతి ఏటా జనవరి 1, జులై 1వ తేదీల నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపును మార్చి లేదా ఏప్రిల్ నెలలో, జులై నెలకు సంబంధించిన సవరణను అక్టోబర్ నెలలో ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More