రిటైర్మెంట్‌కు నాలుగేళ్ల ముందే రికార్డుల తనిఖీ.. కేంద్రం కొత్త నిబంధనలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్, పెన్షన్ రికార్డులను పదవీ విరమణకు నాలుగేళ్ల ముందే సమగ్రంగా సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పొరపాట్ల వల్ల అదనపు చెల్లింపులు జరిగితే ధ్రువీకరించిన అధికారులదే పూర్తి బాధ్యత అని తాజా నిబంధనల్లో స్పష్టం చేసింది.

Published on: Oct 16, 2026, 16:12:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, పెన్షన్ వ్యవహారాల్లో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పే ఫిక్సేషన్ (వేతన సవరణ) ఆర్డర్లు, సర్వీస్ రికార్డులు, పెన్షన్‌కు సంబంధించిన వివరాలను వారు పదవీ విరమణ చేయడానికి నాలుగేళ్ల ముందే సమగ్రంగా సమీక్షించాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం (Department of Expenditure) ఆదేశించింది. అదనపు చెల్లింపులను చాలా ఆలస్యంగా గుర్తించి, ఆ తర్వాత రికవరీ చేయడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను నివారించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

రిటైర్మెంట్‌కు నాలుగేళ్ల ముందే రికార్డుల తనిఖీ.. కేంద్రం కొత్త నిబంధనలు
రిటైర్మెంట్‌కు నాలుగేళ్ల ముందే రికార్డుల తనిఖీ.. కేంద్రం కొత్త నిబంధనలు

రికవరీల భారం తప్పించేందుకే..

తప్పుగా చేసిన పే ఫిక్సేషన్లు, వార్షిక ఇంక్రిమెంట్లు, అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (ఏసీపీ), మోడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (ఎంఏసీపీ) పథకాల కింద దక్కిన ప్రయోజనాల వల్ల ఉద్యోగులకు భారీగా అదనపు చెల్లింపులు జరుగుతున్నాయి. తీరా రిటైర్మెంట్ సమయంలో వీటిని గుర్తించి, ఆ మొత్తాన్ని రికవరీ చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి రికవరీల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వ్యయ విభాగానికి పెద్ద సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకునే తాజా నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది.

కొత్త నిబంధనల ప్రకారం సర్వీస్ రికార్డులు, అర్హత కలిగిన సేవలు, జీతభత్యాల వివరాలు, పెన్షన్ సమాచారాన్ని పెన్షన్ పత్రాలు అకౌంట్స్ విభాగానికి పంపే ముందే కచ్చితంగా ధ్రువీకరించాలని కార్యాలయాల అధిపతులను కేంద్రం ఆదేశించింది. గతేడాది (మార్చి 25, 2025) కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో 36.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులు, 33.9 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2024లో రూ.3.08 లక్షల కోట్లుగా ఉన్న పెన్షన్లు, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల వ్యయం ఆర్థిక సంవత్సరం 2025 నాటికి 12.3 శాతం పెరిగి రూ.3.46 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రక్షణ శాఖ పెన్షన్ల వాటా 45.57 శాతం కాగా, సివిల్ పెన్షన్ల వాటా 33.57 శాతంగా ఉంది.

మూడు నెలల్లోగా తనిఖీ పూర్తి కావాలి

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సంప్రదింపుల తర్వాతే తాజా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. "ఉద్యోగి పదోన్నతి, వార్షిక ఇంక్రిమెంట్, ఆర్థిక ఉన్నతీకరణ లేదా ఇతర వేతన సవరణల తర్వాత జారీ చేసిన పే ఫిక్సేషన్ ఆర్డర్లను మూడు నెలల్లోగా లేదా ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కచ్చితంగా తనిఖీ చేయాలి" అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. గతంలో ఇలా తనిఖీ చేయడానికి కచ్చితమైన గడువు ఉండేది కాదు. తాజా నిబంధనలతో ఈ సమస్యకు చెక్ పడనుంది.

నిపుణులు ఏమంటున్నారంటే?

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైన దిశలో వేసిన అడుగు అని నిపుణులు ప్రశంసిస్తున్నారు. "సకాలంలో పే ఫిక్సేషన్ ఆర్డర్లను పరిశీలించడం వల్ల భారీగా అదనపు చెల్లింపులు జరగకముందే లోపాలను గుర్తించవచ్చు. స్పష్టమైన జవాబుదారీతనం వల్ల విభాగాలు తమ అంతర్గత తనిఖీలు, ఆర్థిక నియంత్రణలను బలోపేతం చేసుకుంటాయి," అని ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ మాజీ అధికారి, రాంచీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఛాన్సలర్ అరుణ్ కుమార్ ఝా విశ్లేషించారు.

"కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వ విభాగాల్లో ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేస్తాయి. సకాలంలో ఆడిట్‌లు నిర్వహించడం, జవాబుదారీతనం పెంచడం ద్వారా జీతాలు, పెన్షన్ల లెక్కల్లో కచ్చితత్వం పెరుగుతుంది," అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ మాజీ డైరెక్టర్ డీపీ మాఝీ అభిప్రాయపడ్డారు.

ఆ తప్పులకు అధికారులదే బాధ్యత

సవరించిన నిబంధనల ప్రకారం, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు 2021లోని రూల్ 30 కింద ఉద్యోగుల సర్వీస్‌ను కాలానుగుణంగా ధ్రువీకరించడం తప్పనిసరి. సర్వీస్ రికార్డుల్లో ఏవైనా తేడాలు ఉంటే వెంటనే సరిదిద్దాలి. పే ఫిక్సేషన్ ఆర్డర్లను సరిచూసినట్లు ఇంటర్నల్ ఆడిట్ వింగ్ లేదా సంబంధిత పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ ధ్రువీకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ఒకవేళ పే ఫిక్సేషన్ ఆర్డర్లను ధ్రువీకరించిన తర్వాత తప్పులు లేదా అదనపు చెల్లింపులు జరిగినట్లు గుర్తిస్తే, సంబంధిత పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ లేదా చీఫ్ కంట్రోలర్/కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్‌ దే పూర్తి బాధ్యత అని కేంద్రం స్పష్టం చేసింది. జీతం వివరాలు సరైనవేనని ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తర్వాత, ఆ కాలానికి సంబంధించి ఉద్యోగి నుంచి ఎలాంటి రికవరీ చేయకూడదు. తప్పుగా చేసిన వేతన సవరణ వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏదైనా నష్టం వాటిల్లితే, ఆ ధ్రువీకరణ పత్రాన్ని ఆమోదించిన కార్యాలయం నుంచే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More