142 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- ధర రూ. 1లక్ష కన్నా తక్కువే..
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తన ఆంపేర్ బ్రాండ్ నుండి సరికొత్త 'మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రూ. 94,999 ప్రారంభ ధరతో లభించే ఈ స్కూటర్, భద్రతకు పెద్దపీట వేస్తూ ఎల్ఎఫ్పీ బ్యాటరీ సాంకేతికతతో వస్తోంది.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తన 'యాంపియర్' బ్రాండ్ ద్వారా ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. నెలవారీ అమ్మకాల గణాంకాల్లో టాప్- 6లో ఒకటిగా ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు సామాన్యులకు అందుబాటు ధరలో ‘మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్’ పేరుతో ఇటీవలే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్- బ్యాటరీ, రేంజ్..
సాధారణంగా యాంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు డెలివరీ భాగస్వాములకు, గిగ్ వర్కర్లకు, గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంత ప్రజలకు మొదటి ప్రాధాన్యతగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఉన్న మాగ్నస్ గ్రాండ్ (2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ) కంటే మెరుగైన అనుభూతిని అందించేలా, ఈ కొత్త గ్రాండ్ మ్యాక్స్‌లో పెద్ద బ్యాటరీని అమర్చారు.
బ్యాటరీ: ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల ఎల్ఎఫ్పీ బ్యాటరీని వాడారు.
రేంజ్: ఈ యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 142 కి.మీ అని సంస్థ చెబుతోంది. కాగా దీని రియర్ వరల్డ్ రేంజ్ 100 కి.మీ కన్నా ఎక్కువే ఉంటుంది.
ఛార్జింగ్: బ్యాటరీ 20 నుంచి 80 శాతం నిండటానికి సుమారు 4.5 గంటల సమయం పడుతుంది.
భద్రత: ఈవీ మార్కెట్లో సుజుకీ ఈ-యాక్సెస్ వంటి కొన్ని మోడళ్లు మాత్రమే వాడుతున్న ఎల్ఎఫ్పీ బ్యాటరీలను యాంపియర్ ఎంచుకుంది. ఇవి ఎన్‌ఎంసీ బ్యాటరీల కంటే సురక్షితమైనవి. వీటిలో మంటలు అంటుకునే ప్రమాదం చాలా తక్కువ.
వారెంటీ: స్టాండర్డ్‌గా ఈ బ్యాటరీపై 3 ఏళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారెంటీని కంపెనీ అందిస్తోంది.
యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్- పనితీరు, డిజైన్..
యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సాంకేతికంగా చాలా సరళమైనది, సమర్థవంతమైనది.
మోటార్: ఇందులో హబ్-మౌంటెడ్ మోటార్‌ను వాడారు. ఇది గరిష్టంగా 2.4 కేడబ్ల్యూ పవర్‌ను అందిస్తూ, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
సస్పెన్షన్ అండ్ బ్రేక్స్: ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే రెండు వైపులా 130ఎంఎం డ్రమ్ బ్రేక్‌లను అమర్చారు.
రైడింగ్ మోడ్స్: ఇందులో ఈకో, సిటీ అనే రెండు మోడ్లతో పాటు రివర్స్ ఫంక్షనాలిటీ కూడా ఉంది.
స్టోరేజ్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రధాన మార్పు ఏంటంటే.. సీటు కింద 33 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్. యాంపియర్ ఉత్పత్తుల్లోనే ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బూట్ స్పేస్ కావడం విశేషం.
డిస్‌ప్లే అండ్ కలర్స్: ఇందులో 3.5 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్ ఉంది. మన్సూన్ బ్లూ, మచ్చా గ్రీన్, సినమన్ కాపర్ వంటి ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ రంగుల్లో ఇది లభిస్తుంది.
యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్- ధర..
యాంపియర్ మాగ్నస్ గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 94,999గా ఉంది. టీవీఎస్ ఆర్బిటర్ (రూ. 99,900), బజాజ్ చేతక్ సీ2501 (రూ. 91,399), విడా వీఎక్స్2 గో (రూ. 1.02 లక్షలు) వంటి మోడళ్లకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

E-Paper












