దూసుకొస్తున్న మొంథా తుపాను- దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

మొంథా తుపాను కారణంగా దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడులు అప్రమత్తమయ్యాయి. చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాలు సహా దక్షిణాదిలోని అనేక చోట్ల వర్షాలు పడనున్నాయి. పూర్తి అప్డేట్స్​ ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 27, 2025 6:06 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొంథా తుపాను దూసుకొస్తోంది! ఇది అక్టోబర్ 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశా అప్రమత్తమయ్యాయి. ఈ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నట్టు ఇండియన్ ఆర్మీ సైతం ప్రకటించింది.

ముంచుకొస్తున్న మొంథా (AI generated- Google Gemini)
ముంచుకొస్తున్న మొంథా (AI generated- Google Gemini)

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది అక్టోబర్ 27 నాటికి నైరుతి, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుపానుగా బలపడుతుంది. అనంతరం అక్టోబర్ 28 ఉదయానికి 'తీవ్ర తుపానుగా' మారుతుంది.

మొంథా తుపాను: ముఖ్య అప్‌డేట్‌లు

1. తీరం దాటే తేదీ, సమయం

మొంథా తుపాను అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 90–100 కిలోమీటర్లు (గరిష్టంగా 110 కి.మీ. వరకు) ఉండవచ్చు.

2. ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు రెడ్ అలర్ట్

అక్టోబర్ 27, ఆదివారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఐఎండీ 'ఎక్స్​' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా రెడ్ వార్నింగ్ ప్రకటించారు.

ఐఎండీ పోస్ట్ ప్రకారం.. ఒడిశాకు అక్టోబర్ 28, 29 తేదీల్లో, తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌లకు కేవలం అక్టోబర్ 28న రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో, తమిళనాడుకు అక్టోబర్ 27, 28 తేదీలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

3. దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తమిళనాడు, పుదుచ్చేరి: అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉరుములతో కూడిన ఈదురు గాలులతో (30–40 kmph) పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కేరళ, మాహే: అక్టోబర్ 27న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి.

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: అక్టోబర్ 26 నుంచి 30 వరకు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ 27–29 మధ్య అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ: అక్టోబర్ 27–30 మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా అక్టోబర్ 28న అత్యంత భారీ వర్షపాతం ఉండవచ్చు.

రాయలసీమ: అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కోస్తా, అంతర్గత కర్ణాటక: అక్టోబర్ 26–28 మధ్య మోస్తరు వర్షాలు, తీర ప్రాంతంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

4. తూర్పు, మధ్య భారతదేశంలో వర్ష సూచన

ఒడిశా: అక్టోబర్ 27–30 మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ ఒడిశాలో అక్టోబర్ 28, 29 తేదీల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షపాతం ఉండవచ్చు.

ఛత్తీస్‌గఢ్: అక్టోబర్ 27–30 మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్టోబర్ 28న అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

గంగా పశ్చిమ బెంగాల్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్/సిక్కిం: అక్టోబర్ 28–31 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెలాఖరుకు అవి మరింత బలపడవచ్చు.

5. ఆర్మీ అప్రమత్తం

బంగాళాఖాతంలో తుపాను నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది.

"నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము," అని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More