ఫోన్ బ్లాక్ చేశాడని ఘోరం! ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన యువతి
మొబైల్ ఫోన్‌లో తనను బ్లాక్ చేశాడన్న కోపంతో ఒక యువతి తన ప్రియుడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మొబైల్ ఫోన్‌లో తన నంబర్‌ను బ్లాక్ చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణ ఘటనతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ప్రేమగా మారి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల కామ్తా ప్రసాద్ సూర్యవంశీ బిలాస్‌పూర్‌లో ఒక అద్దె ఇంటిలో నివసిస్తూ స్థానిక హోటల్‌లో పనిచేస్తున్నాడు. సుమారు ఆరు నెలల క్రితం అతడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 22 ఏళ్ల రోష్ని సూర్యవంశీ అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు.
అయితే, గత రెండు మూడు రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కామ్తా ప్రసాద్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆమె ఫోన్ నంబర్‌ని, ఆమె మెసేజెస్‌ని బ్లాక్ చేశాడు.
బాయ్‌ఫ్రెండ్ తనని బ్లాక్ చేయడంతో రోష్ని తీవ్ర ఆగ్రహానికి గురైంది. కామ్తా ప్రసాద్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె అనుమానించడం మొదలుపెట్టింది.
కత్తితో వెళ్లి దాడి..
మంగళవారం మధ్యాహ్నం రోష్ని తన వెంట ఒక కత్తిని తీసుకుని కామ్తా ప్రసాద్ ఉంటున్న ఇంటికి వెళ్లింది. డోర్ కొట్టింది. కామ్తా తలుపు తీయగానే, ఆమె అతడి మొబైల్ ఫోన్ చూపించాలని డిమాండ్ చేసింది. దీనికి కామ్తా నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రోష్ని తన వద్ద ఉన్న కత్తిని తీసి కామ్తా ప్రసాద్ ఛాతీపై నేరుగా పొడిచింది.
గదిలో జరుగుతున్న అరుపులు, గొడవను విన్న కామ్తా రూమ్‌మేట్ వెంటనే బయటకు వచ్చి చూడగా.. అతడు రక్తపు మడుగులో నేలపై పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. తీవ్రంగా గాయపడిన కామ్తాను ఆసుపత్రికి తరలిస్తుండగా, అతడు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
బీజేపీ నేత మేనల్లుడిగా గుర్తింపు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ అధికారి సుమ్మత్ సాహు విచారణ చేపట్టారు. నిందితురాలు రోష్నిని అరెస్ట్ చేసి ఆమెపై హత్య కేసు నమోదు చేసినట్లు ఆయన ధృవీకరించారు.
"నిందితురాలు కత్తితో బాధితుడి గదికి వెళ్లి అతడి ఫోన్ కావాలని గొడవపడింది. ఆ ఘర్షణలోనే ఆమె కత్తితో అతడి ఛాతీపై బలంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు," అని సాహు వివరించారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మృతుడు కామ్తా ప్రసాద్ స్థానిక బీజేపీ నాయకుడు, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు రాజేష్ సూర్యవంశీకి మేనల్లుడు!
కేవలం భయపెట్టడానికే తాను కత్తి తెచ్చానని నిందితురాలు రోష్ని పోలీసులకు ప్రాథమికంగా తెలిపింది. అయితే, ఆమె ఉద్దేశపూర్వకంగానే హత్య చేసిందా? లేక ఆ క్షణంలో జరిగిన గొడవలో ఈ దారుణం జరిగిందా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, తదుపరి ఆధారాల కోసం విచారణ కొనసాగిస్తున్నారు.
బ్లాక్ చేశాడన్న కారణంతోనే మహిళ, తన ప్రియుడిని చంపిందన్న వార్త విని అందరు షాక్‌కి గురవుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


