బెంగుళూరులో ‘ఈ-ఖాటా’ విప్లవం- ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్!
బెంగుళూరులో ‘ఈ-ఖాటా విప్లవం’ ప్రారంభమైంది! ఇక ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. ఫలితంగా మధ్యవర్తులకు చెక్ పడనుంది. అవినీతి, జాప్యాలకు చెక్ పెట్టేందుకే ఈ డిజిటల్ సంస్కరణలు తీసుకొచ్చినట్టు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు.
బెంగుళూరు నగరంలో ఆస్తుల రికార్డుల వ్యవస్థను సమూలంగా మారుస్తూ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం ఒక కీలకమైన డిజిటల్ సంస్కరణను ప్రకటించారు. ఇది "ఈ-ఖాటా విప్లవానికి" నాంది పలుకుతుందని, దీని ద్వారా మధ్యవర్తులు లేకుండా పోతారని, అనుమతులు వేగవంతం అవుతాయని, అలాగే మొత్తం ఖాటా ప్రక్రియ పూర్తిగా ఫేస్‌లెస్, ఆన్‌లైన్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శివకుమార్ పంచుకున్న పోస్ట్ ప్రకారం, నివాసితులు ఇకపై ఏ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే, బీబీఎంపీ ఈ-ఆస్తి పోర్టల్ ద్వారా లేదా బెంగుళూరు వన్ కేంద్రాల్లో డిజిటల్‌గా ఈ-ఖాటా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అవినీతి, జాప్యం, వేధింపులపై దీర్ఘకాలంగా ఉన్న ఫిర్యాదులకు ముగింపు పలకడమే ఈ చర్యకు ప్రధాన లక్ష్యమని డీకే శివకుమార్ తెలిపారు.
ఈ- ఖాటా : పారదర్శకతకు పెద్ద పీట
ఇప్పటికే 25 లక్షల కంటే ఎక్కువ ఆస్తి రికార్డులను ఈ-ఆస్తి ప్లాట్‌ఫారమ్‌కు మైగ్రేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా పౌరులు తమ యాజమాన్య వివరాలు, మ్యుటేషన్ స్టేటస్, పన్ను సమాచారాన్ని తక్షణమే తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన ప్రతి దరఖాస్తు ఇప్పుడు ఆటో-రూట్ ద్వారా అప్రూవల్ డాష్‌బోర్డ్‌కు వెళుతుంది. తద్వారా పారదర్శకత, సమయ-పరిమితితో కూడిన ప్రాసెసింగ్‌కు హామీ లభిస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌తో బెంగుళూరు ఆస్తి పాలన "సరళంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా" మారుతుందని, ఇది పౌర-కేంద్రీకృత, పౌర పరిపాలన వైపు ఒక ముఖ్యమైన అడుగు అని శివకుమార్ అభివర్ణించారు.
బీ-ఖాటా నుంచి ఏ-ఖాటా రెగ్యులరైజేషన్
ఇదిలా ఉండగా, కర్ణాటక ప్రభుత్వం బీ-ఖాటా ప్లాట్లను ఏ-ఖాటా స్థలాలుగా మార్చడానికి, కొత్తగా అర్హత పొందిన ప్లాట్లకు ఏ-ఖాటాను జారీ చేయడానికి ఒక సరళీకృత, ఎండ్-టు-ఎండ్ ప్రక్రియను అమలు చేసిన తర్వాత, బెంగుళూరులోని బీ-ఖాటా స్థలాల యజమానులకు పెద్ద ఊరట లభించింది.
ఈ పథకం చట్టపరమైన యాజమాన్యాన్ని స్పష్టం చేయడం, ఆస్తి విలువలను పెంచడం, వేలాది ప్లాట్ల యజమానులకు రియల్ ఎస్టేట్ లావాదేవీలను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ పథకం ఫ్లాట్‌లకు స్పష్టంగా మినహాయింపునిచ్చి, వ్యక్తిగత ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే కన్వర్ట్ అయిన, ఇంకా కన్వర్ట్ చేయాల్సిన ప్లాట్లు రెండూ ఈ కొత్త సరళీకృత మార్గంలో అర్హత కలిగి ఉంటాయని అధికారులు తెలిపారు.
వేగవంతమైన ఆన్‌లైన్ ప్రక్రియ
అధికారులు ఒకే ప్లాట్‌కి సంబంధించిన ఫాస్ట్-ట్రాక్ అర్హతను 2,000 చదరపు మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు పరిమితం చేశారు. అలాగే, కార్యాలయ సందర్శనలను తగ్గించడానికి, మధ్యవర్తులను పరిమితం చేయడానికి ఎక్కువగా ఆన్‌లైన్ మార్గాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఆటోమేషన్, ఆధార్-అనుసంధాన ధృవీకరణ టైటిల్ వివాదాలను తగ్గిస్తుంది, బ్యాంకు అనుమతులను వేగవంతం చేస్తుంది, కన్వర్ట్ అయిన ప్లాట్ల మార్కెట్ విలువను మెరుగుపరుస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


