‘బొద్దింకలు వస్తున్నాయి.. మంత్రి వెళ్తున్నారు’

నీట్ 2026 పేపర్ లీక్, సీబీఎస్‌ఈ మార్కింగ్ అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శనివారం నిరసన ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసనకారులు భారీగా నినాదాలు చేస్తున్నారు.

Published on: Jun 6, 2026, 10:36:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలతో హోరెత్తుతోంది. నీట్ 2026 (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో జరిగిన అక్రమాలకు నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) శనివారం తన ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యాశాఖ వైఖరిని నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన (PTI)
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసన (PTI)

"ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో" (ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి), "మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు" అంటూ నిరసనకారులు రాసిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ ఉధృత నిరసనల్లో పాల్గొనేందుకు CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నగరం నుండి శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని కనిపించడం విశేషం.

అనుమతి లభించింది..

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనను చేపట్టనున్నట్లు CJP అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.

"ఢిల్లీ పోలీసులు మా జంతర్ మంతర్ నిరసనకు అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా జంతర్ మంతర్ వద్దే గుమిగూడవచ్చు. బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు" అని నిరసనకారులు ట్వీట్ చేశారు.

శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలుపుకునేందుకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా అనుమతినిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి, ఒకేసారి మినహాయింపుగా ఈ అనుమతి ఇస్తున్నట్లు న్యూఢిల్లీ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

జూన్ 21న మళ్లీ నీట్ పరీక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్ష అక్రమాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షను రద్దు చేసి, తిరిగి జూన్ 21న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈ దర్యాప్తు ప్రగతిని వివరించారు. ఈ పరిణామాల మధ్య విద్యాశాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు గతంలో నిరసనలు తెలిపిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు కూడా జరిగాయి.

రాజుకున్న రాజకీయ కాక

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం పణంగా పెడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ ‘కాక్రోచ్’ ఉద్యమం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేలా కనిపిస్తోంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More