పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం - సరికొత్త స్కీమ్ ను ప్రారంభించనున్న సీఎం విజయ్
Tamil Nadu Govt Gold Ring Scheme : తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పసిపాపలకు గ్రాము బంగారు ఉంగరం అందించే స్కీమ్ కు విజయ్ సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ‘తాయ్‌మామన్ తంగ మోదిరం’ పేరు ఈ పథకాన్ని సీఎం విజయ్ సోమవారం మధురైలో ప్రారంభించనున్నారు.
Tamil Nadu Govt Gold Ring Scheme : తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలలో ఒకటైన 'తాయ్‌మామన్ తంగ మోదిరం తిట్టం' (మేనమామ బంగారు ఉంగరం పథకం) సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతీ నవజాత శిశువుకు ప్రభుత్వం తరఫున ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని అందజేస్తారు. ఈ వినూత్న పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్….. మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి (జీఆర్‌హెచ్) వేదికగా ప్రారంభించనున్నారు.

ప్రత్యేక విమానంలో మధురై చేరుకోనున్న ముఖ్యమంత్రి విజయ్….. జీఆర్‌హెచ్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని 25 మంది నవజాత శిశువులకు స్వయంగా ఈ బంగారు ఉంగరాలను అందజేస్తారు. అనంతరం ఆయన ఆసుపత్రిలోని ప్రసూతి వార్డును నేరుగా సందర్శించి, అదే రోజు జన్మించిన పసిపాపల తల్లులకు ఉంగరాలను అందిస్తారు. నిజానికి ఈ పథకాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15నే ప్రారంభించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి విజయ్ లండన్ పర్యటన కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.
రూ. 755 కోట్ల భారీ బడ్జెట్…
ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ. 755.83 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. తొలి విడత పంపిణీ కోసం ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను సిద్ధం చేశారు. ప్రతీ ఉంగరానికి ఒక ప్రత్యేక సీరియల్ నంబర్ ఉంటుంది. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ట్యాంపర్-ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో వీటిని భద్రపరిచి పంపిణీ చేస్తారు.
ఈ పథకం అమలు బాధ్యతలను జిల్లా స్థాయిలో పూర్తి పారదర్శకంగా పర్యవేక్షించేందుకు, స్టాక్ నమోదును నిరంతరం పరిశీలించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే పార్టీ ఎన్నికల హామీలలో ఈ పథకం అత్యంత కీలకమైనది. దీని కోసం ప్రముఖ స్వర్ణాభరణాల సంస్థలైన జోయాలుక్కాస్, కల్యాణ్ జువెలర్స్‌కు ఉంగరాల సరఫరా కాంట్రాక్ట్ ఆర్డర్లను అందించారు. ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జూన్ 23నే విడుదలయ్యాయి.
అర్హతలు - నిబంధనలు :
- లబ్ధి పొందే నవజాత శిశువుల తల్లులు తప్పనిసరిగా తమిళనాడు శాశ్వత నివాసులై ఉండాలి.
- గర్భిణులు 'ప్రెగ్నెన్సీ అండ్ ఇన్‌ఫాంట్ కోహోర్ట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్' (PICME) వ్యవస్థ కింద నమోదై ఉండాలి.
- అభ్యర్థులకు రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ ఐడీ ఉండటం తప్పనిసరి.
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఈ బంగారు ఉంగరాన్ని అందిస్తారు.
- అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరగనున్న మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమల్లోకి వస్తుంది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని, అలాగే ఆసుపత్రుల్లోనే సురక్షిత ప్రసవాలు (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్) జరిగేలా ప్రోత్సహించవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) గణాంకాల ప్రకారం తమిళనాడులో ఏటా సుమారు 7.80 లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారు. వీటిలో 99.9 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

